తిరుమల బ్రహ్మోత్సవాలు : వైభవంగా ముగిసిన చక్రస్నానం
అఖిలాండ బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిది రోజుల పాటు వివిధ సేవల్లో అలసిసొలసిన శ్రీనివాసుడు.. తొమ్మిదో రోజు ఉదయం సేదతీరడం కోసం చక్రస్నాన ఘట్టం నిర్వహించారు. ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. స్వామి వారికి పుష్కరణిలో చక్రస్నానం నిర్వహించారు. అంతకు ముందు దేవదేవునికి స్నపనతిరుమంజన సేవ నిర్వహించారు. పుష్కరణి గట్టున తిరుమలరాయునికి పంచమృతాభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీవారి పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేకువజామున 3 గంటలకు స్వామికి పల్లకి సేవ నిర్వహించారు. బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఈ చక్రస్నాన ఘట్టంలో భాగంగా.. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. తాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం.