తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడోత్సవంలో ఏడులక్షల మంది భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారని టీటీడీ అంచనా. అంగరంగ వైభవంగా జరిగిన గరుడసేవలో టీటీడీ అధికారుల అంచనాలకు మించి భక్త సందోహం తిరుమలకు చేరుకుంది.
కాలిబాట గుండా గరుడోత్సవానికి జనప్రవాహం తండోపతండాలుగా తరలివచ్చారు. రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక వంటి తదితర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. గరుడ వాహనంపై అలంకృతమైన శ్రీవారు మండపం నుంచి బయటకు రాగానే భక్త జనావళి చేసిన గోవింద నామస్మరణలతో తిరుమల కొండ మారు మ్రోగింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేందుకు ఇంకా రెండు రోజులున్న నేపథ్యంలో...తిరుమలలో జరిగే వాహన సేవలను దర్శించి వెంకన్న నీరాజనాలను పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యల కోసం పోలీసులు నిఘా నీడలోనే ఉన్నారు. ఎన్నడూలేని విధంగా ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమాడ వీధుల్లోకి అనుమతిస్తున్నారు.