Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గరుడ సేవకు భక్తులందరికీ దర్శనం

Advertiesment
గరుడ సేవకు భక్తులందరికీ దర్శనం
శ్రీవారి బ్రహ్మోత్సవాలలోకెల్లా అత్యంత ప్రసిద్ధమైన గరుడ సేవను ఆదివారం ఘనంగా నిర్వహించడానికి భక్తులందరూ సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్‌ డీకే ఆదికేశవులు, ఈవో రమణాచారిలు విజ్ఞప్తి చేశారు. వారు శనివారం తిరుమలలో విలేఖరుల సమావేశంలో వారు గరుడసేవకు సంబంధించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి వివరించారు.

ఛైర్మన్‌ ఆదికేశవులు మాట్లాడుతూ గత మూడురోజులుగా సుమారు 1.30 లక్షల మంది భక్తులు కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారన్నారు. హుండీద్వారా ఈ మూడురోజులలోనే దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. గరుడసేవకు అశేష భక్తులు తరలి రానున్నందున అందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే చేశామని చెప్పారు.

భద్రతాపరంగా నలుగురు ఏఎస్పీలు, 16 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 150 మంది ఎస్‌ఐలు, 3500 మంది కానిస్టేబుళ్లతో భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వీరుగాక, టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది 2400 మంది, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మరో 1400 మంది విధి నిర్వహణలో ఉంటారన్నారు. గరుడసేవకు 2 లక్షమంది భక్తులు రానున్నట్లు అంచనా వేశామన్నారు. వీరి రాకపోకలకు అవసరమైన రవాణా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని చెప్పారు.

24 గంటలపాటు ఘాట్‌రోడ్డు తెరచి ఉంటుందని వివరించారు. ఈవో రమణాచారి మాట్లాడుతూ శ్రీవారి గరుడసేవ చూసి తరించాలన్న ఆతృత, తపన ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. అందువల్లనే ఆదివారంనాడు భక్తకోటి ఎంత పెద్దఎత్తున వెల్లువెత్తినా వారందరికీ అవసరమైన అన్నిరకాల సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

తితిదేలోని అన్ని విభాగాలతో పాటు, పోలీసు, వైద్యం వంటి ప్రభుత్వ విభాగాలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. కలెక్టర్‌ రవిచంద్ర, ఎస్‌పి లక్ష్మీరెడ్డిల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. అద్దె వాహనాల వారు భక్తులను మోసం చేసే అవకాశం వుందని, వారి బారిన పడకుండా నిత్యం ఆర్టీసీతోపాటు, టీటీడీ కూడా స్థానికంగా ఉచిత బస్సులను కూడా నిరంతరాయంగా తిప్పుతున్నదని చెప్పారు.

టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి మాట్లాడుతూ తమిళనాట పెరటాసి నెల పెట్టడంతోపాటు మూడో తిరువళ్‌ శనివారం వల్ల కూడా ఈరోజున రద్దీ విపరీతంగా ఉన్నదన్నారు. అయినాసరే గరుడ సేవతో సహా అన్ని వాహన సేవలకూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. టీటీడీ బోర్డు సభ్యుడు అంజయ్య, సీవీఎస్‌వో రమణకుమార్‌, టెంపుల్‌ డిప్యూటీ ఈవో సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu