శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం ఉదయం సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. దేవేరులతో కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు కొండకు చేరుకున్నారు.
కోరిన కోర్కెలను తీర్చే కల్పవృక్షాన్ని తన వాహనంగా మలచుకుని కామధేనువుతో శ్రీనివాసుడు తిరువీధులతో వూరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేసిన వైనాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు.
క్షీర సాగర మధనంలో ఉద్భవించిన కల్పవృక్షం నీడన ఉంటే ఆకలి దప్పులు ఉండవని భక్తుల విశ్వాసం. కల్పవృక్షం కింద శ్రీవారి దర్శనం కలిదోష హరణంగా భక్తులు భావిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వాహన సేవను తిలకించి తరించారు.
కాగా కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువైన స్వామి స్వామివారు నాలుగో రోజైన మంగళవారం ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగారు. ఈ వాహన సేవలో స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వెంకటాద్రికి తరలివచ్చారు.