కన్నుల పండుగగా బ్రహ్మాండనాయకుని చిన్నశేష వాహనం!
కలియుగ దైవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీవారు చిన్నశేష వాహనంపై ఊరేగారు. సర్వాంగా సుందరంగా అలంకారభూషితుడైన శ్రీనివాసుడు.. చిన్నశేష వాహనంపై ఆశీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటి జనులకు దర్శనమిచ్చారు. దివ్యాభరణాలు ధరించిన దేవదేవుడు.. ఐదు తలల చిన్నశేషునిపై విహరించారు. ఆ సమయంలో భక్త బృందాలు చేసిన హరినామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగిపోయాయి. స్వామివారికి సాయంత్రం 7 గంటల నుంచి వూంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు హంస వాహనంపై శ్రీవారు ఊరేగుతారు.