Publish Date: Wed, 23 Sep 2020 (14:14 IST)
Updated Date: Wed, 23 Sep 2020 (14:16 IST)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.
మోహినీ అవతారం - మాయా మోహ నాశనం
ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు కటాక్షించనున్నారు.
గరుడ వాహనం - సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.