బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ ఉదయం వేంకటేశ్వర స్వామి మోహినీ రూపంలో దంతల పల్లకిలో తిరుమాడ వీధులలో విహరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీ ఒంటరిగా విహారానికి రాదు కాబట్టి మోహినీ రూపంలోని స్వామి వెంట శ్రీ కృష్ణస్వామి మరో పల్లకిపై వేంచేశారు.
స్త్రీలు ధరించే అన్ని రకాల ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. వరద భంగిమలో కనిపించే స్వామివారి కుడిహస్తం మోహినీ రూపంలో అభయహస్త ముద్రతో ఉంది. స్వామివారికి పట్టుచీర, కిరీటంపైన రత్నఖచితమైన సూర్యచంద్ర సావేరి, నాసికకు వజ్రఖచిత ముక్కుపుడక, బులాకి, శుంఖుచక్ర స్థానాల్లో రెండు వికసించిన స్వర్ణకమలాలు ఉన్నాయి.
బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవలన్నీ వాహన మండపం నుండి తిరుమాడ వీధుల్లో తిరిగితే... మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. బల గర్వితులు, అహంకారులు కార్యఫలితాన్ని పొందలేరని, వినయవిధేయతలతో భగవంతుడిని ఆశ్రయించినవారే ముక్తిసోపానాలను పొందగలరని ఈ వాహన సేవలోని పరమార్థం.
సమస్త జగత్తు తన మాయలోనే ఉందని తనను ఆశ్రయించిన భక్తులు మాత్రమే మాయను జయించి తనను చేరుకోగలరని మోహినీ రూపంలో స్వామివారు సందేశమిస్తున్నారు. దేవదేవుడికి జరిగే వాహన సేవలన్నిటిలోనూ అలంకరణాలు మారినప్పటికి మోహినీ అవతారంలో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు జరగవు. శ్రీవిల్లి పూత్తూరు నుండి తీసుకొచ్చిన తమలపాకుల చిలుకలను స్వామివారి వాహనానికి అలంకరించారు.