శ్రీవారి నేత్ర దర్శనం... పక్కనే నల్లపిల్లి... ఆ పిల్లి ఇప్పటిది కాదు... స్పెషల్ స్టోరీ

యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు

గురువారం, 24 సెప్టెంబరు 2015 (20:17 IST)
కలియుగ దైవం శ్రీనివాసుడు దర్శనం కనులారా వీక్షించాలంటే అదృష్టం ఉండాలి. అందులోనూ గంటల తరబడి, రోజుల తరబడి ఆయన్నే చూస్తూ డ్రాయింగ్‌ గీయడం పూర్వజన్మ సుక్రుతంగా భావిస్తున్నారు ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌. అప్పట్లోనే సినిమా కలర్‌ ప్రింట్లకు స్కెచ్‌లు వేసేవారు. కాగా, ఇటీవలే శ్రీవారిని పిల్లి దర్శించుకుందని వెబ్‌దునియాలో వచ్చిన వార్తను ఆయన దృష్టికి తీసుకువెళితే.. అది నిజమేనంటూ.. తన అనుభవాన్ని ఇలా వెల్లడించారు.
 
1976వ సంవత్సరం నుంచి తిరుమల దేవస్థానంలో పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా ఉన్న రావుల సూర్యనారాయణమూర్తిగారు నాకు చిరకాల మిత్రులు. దేవస్థానానికి కావలసిన ఆర్ట్‌ వర్క్స్‌ చేయించుకోడానికి నా దగ్గరకు వచ్చిపోతుండేవారు. ఆ విధంగా దేవస్థానంతో నాకు విడదీయరాని సన్నిహిత బంధం ఏర్పడింది. తరువాత కాలంలో సూర్యనారాయణమూర్తిగారు రిటైరైపోయిన ఆ అనుబంధం అలాగే కొనసాగడంతో ఒకరోజున నటుడు మోదుకూరి సత్యంగారి అబ్బాయి ప్రసాద్‌ నాదగ్గరకు వచ్చాడు. 
 
ప్రసాద్‌ చిన్నప్పటి నుంచి ఆర్ట్‌ మీద మంచి ఆసక్తి వున్న యువకుడు కావడంతో అప్పుడప్పుడు మేం చేస్తున్న పోస్టర్‌ డిజైన్స్‌ చూడానికి మా ఆఫీసుకు వస్తుండేవాడు. అలా నాతోనూ, మా స్టాఫ్‌తోనూ అతనికి పరిచయమైంది. కొంతకాలం  తర్వాత ప్రసాద్‌ తిరుపతిలోని టి.టి.డి. ప్రెస్‌లో ఆర్టిస్ట్‌గా స్థిరపడిపోయాడు. 
 
1999వ సంవత్సరంలో ఒక రోజున 'సప్తగిరి పత్రిక ఎడిటర్‌ రామ్మూర్తిగారు, ఈవో వి.వి. వినాయక్‌గారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు' అన్న వార్తను పట్టుకొని మా యింటికొచ్చాడు. ప్రసాద్‌, నేను తిరుపతి వెళ్లి ఈవోగార్ని వారి ఆఫీస్‌లో కలుసుకొన్నప్పుడు ఆయన 'నేను మీ గురించి చాలా విన్నానండి.. ఇప్పుడెందుకు పిలిచానంటే, 1950వ సంవత్సరంలో డి. రాఘవరావుగారు వేసిన స్వామివారి కేలండర్‌ను ఇంతకాలం ప్రింట్‌ చేయిస్తూ వచ్చాం. ఆనాటి నుండి ఈనాటి దాకా అదే కేలండర్‌, ఇప్పుడిక నేత్ర దర్శనం, అర్చనానంతర దర్శనం, పూలంగి సేవా దర్శనం ఇలా ప్రతి దర్శనం ఒక్కొక్క కేలండర్‌ లీఫ్‌గా ప్రింట్‌ చెయ్యాలని నిర్ణయించాం. అందుకు మీరు ముందు నేత్రదర్శనంతో పెయింటింగ్‌ ప్రారంభించాలి. ఆ తర్వాత అన్నీ  వరసగా చెయ్యవలసి ఉంటుంది' అని చెప్పారు.
 
ఈ కథనం మిగిలిన వివరాల కోసం ఈ క్రింది పేజీలపై క్లిక్ చేయండి
 
2వ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

3వ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4
వ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

5వ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీవారి నేత్ర దర్శనం ఎలా ఉంటుంది...?
 
నేత్ర దర్శనం అంటే ఎలా ఉంటుందని నేను ప్రశ్నించినప్పుడు అందుకు ఆయన 'నేత్ర దర్శనం ప్రతి గురువారం మాత్రమే ఉంటుంది. ప్రతి గురువారం మీరు వచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎమిది గంటలవరకు మూల విరాట్‌ దగ్గర కూర్చుని అన్ని వివరాలు గమనించండి. అవసరమైతే స్కెచ్‌లు గీసుకోండి' అని ఒక లెటర్‌ నా చేతికిచ్చి, 'ఈ ఉత్తరాన్ని కొండమీద శేషాద్రికి చూపిస్తే సన్నిధిలో అన్ని ఏర్పాట్లూ అతను చేస్తాడు' అని చెప్పారు. 
 
నాకు నాలుగు గురువారాలైతే స్కెచ్‌లు గీయడానికి సరిపోతుందని మొదటి గురువారం కోసం బుధవారం రాత్రే తిరుమల చేరుకుని గెస్ట్‌ హౌస్‌లో బసచేసి ఉదయాన్నే శేషాద్రిగార్ని కలిసి ఉత్తరం ఇచ్చాను. శేషాద్రిగారు నన్ను గర్భగుడికి తీసుకువచ్చి 'స్వామివారి పాదాల ముందున్న 'కులశేఖరపడి' (మొదటి గడప) వద్ద మీరు కూర్చుంటే డ్రాయింగ్‌ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది  శేషాద్రిగారు అని చెప్పి గర్భగుడిలో ఉన్న ముగ్గురు అర్చక స్వాములకు నన్నప్పగించి వెళ్లిపోయారు.

తిరుమలేశుడిని చూసి ఉద్వేగానికి లోనయ్యా...
 
ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలకూ అక్కడే కూర్చుని స్కెచ్‌లు వేసుకునే అరుదైన అవకాశం రావడంతో నేను తీసుకెళ్ళిన స్కెచ్‌బుక్‌మీద పెన్సిల్స్‌తో స్కెచ్‌లు వెయ్యడం ప్రారంభించాను. మధ్యాహ్నం లంచ్‌ టైమ్‌లో మాత్రం ఒక స్వాములతో బయటకు వచ్చి భోజనం అయ్యాక మళ్లీ నా స్థానంలో నేను కూర్చునేవాణ్ణి. వెళ్లిన రెండు రోజుల్లోనే అక్కడున్న అర్చక స్వాములతో నాకు పరిచయం బాగా పెరిగింది. 
 
స్కెచ్‌లు వెయ్యడానికి వెలుతురు సరిపోకపోయనప్పుడల్లా అక్కడున్న అన్ని దీపాలకూ నూనె పోసి, వత్తులు ఎగదోసి అర్చక స్వాములు నాకు పూర్తిగా సహకరించేవారు. అందులో ఇద్దరు నాకిరువైపులా కూర్చుని నేను గీస్తున్న డ్రాయింగ్‌ను ఆస్తకిగా చూస్తూ ఉండిపోయేవారు. స్వామివారి మూల విరాట్‌కు సరిగ్గా ఐదు అడుగుల దూరంలో ఉన్న మొదటి గడప దగ్గర కూర్చుని ఉన్నప్పుడు నేను ఎక్కడలేని ఉద్వేగానికి లోనయ్యేవాణ్ణి.
 
ఈ అపురూప అవకాశం దొరికినందుకు నా జన్మ ధన్యమైందని ఆనందపడ్డాను. నాకు నిజంగా వేంకటేశుని పరిపూర్ణ అనుగ్రహం వుందనిపించింది. లేకపోతే ఇటువంటి అపూర్వ భాగ్యంరాదు. నేను స్కెచ్‌ వెయ్యడంలో నిమగ్నమైనప్పుడు భక్తులు విసిరే కానుకలు, నాణాలు నా వీపుకు తాకినప్పుడల్లా నా ఒళ్ళు జలదరించేది. భక్తి పారవస్యంతో భగవన్నామస్మరణ చేసి మైమరిచిపోయేవాణ్ణి, నేను కూర్చున్న పాదాల సన్నిధి అన్నమయ్య లాంటి వాగ్గేయకారులెందరో నర్తించి, కీర్తించి, ముక్తిని  పొందిన అతి పవిత్రమైన స్థలం.

గురువారం స్వామివారు ఇలా ఉంటారు...
 
నేత్ర దర్శనం కావడంతో గురువారం రోజున నేత్రాలు ఎక్కువ భాగం కనిపించేలా కస్తూరి తిలకాన్ని సన్నగా, పొడవుగా, అతి చిన్నదిగా పెడతారు. అలంకరణలు కూడా స్వల్పంగా చెయ్యడంతో స్వామివారి దేహభాగాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ముందుగా ప్రతి భాగాన్ని విడివిడిగా, శంఖుచక్రాలూ, అభయ వామహస్తాలూ, కిరిటీ భాగం, వక్షఃస్థలంలో దేవేరులు, వజ్ర కుండలాలూ, యజ్ఞోపవీతం, సాలగ్రామాల హారం పద్మాకారంలో పాదాలు స్కెచ్‌లు వేసుకున్నాను. ఆ తర్వాత మొత్తం పూర్తి విగ్రహాన్ని రెండుమూడు యాంగిల్స్‌లో నాలుగు రకాల స్కెచ్‌లు వేస్తే అక్కడున్న అర్చక స్వాముల్లో ఒకాయన ఈ డ్రాయింగుల్లో ఒకటి కావాలని ప్రాధేయపడ్డాడు. నా అడ్రసు తీసుకుని నేను చెన్నై చేరాక వచ్చి తీసుకెళ్ళాడు.

ఆ నల్లపిల్లి నా ప్రక్కనే కూర్చునేది...
 
అక్కడ నేను డ్రాయింగ్‌ వేస్తున్నంతసేపు ఒక నల్లటి పిల్లి వచ్చి నా పక్కనే కూర్చోవడం నన్నాశ్చర్య పరిచింది. స్వామివారి సన్నిధిలో పిల్లి వుండటం, దాన్ని ఎవరూ ఏమీ చెయ్యకుండా ఊరుకోవడంతో నాకు సందేహం వచ్చి బాగా పరిచయమైన ఒక అర్చక స్వామిని 'ఈ పిల్లి విషయం ఏమిటి? అని అడిగాను.
 
''ఇప్పటికి నాలుగుసార్లు రెండు కొండలకవతల వదిలివేసి వచ్చినా తెల్లారేసరికి తిరిగి ఇక్కడే ఈ పిల్లి ప్రత్యక్షమౌతుంది. ఈ విషయం ఈవోగారికి చెబితే.. దాన్నలా వదిలేయండి. దానికిష్టం వచ్చినప్పుడు వచ్చి పోనివ్వండి. ఎవరూ ఆటంకపరచవద్దు.. అని చెప్పారు. అది గర్భగుడి అంతా తిరుగుతూ రాత్రుళ్లు మాత్రం శఠారి పెట్టి వుండే వెండి పీఠం మీద ఎక్కి నిద్రపోతుంది. ఇది వింటే ఈ పిల్లికి ఏదో జన్మలో స్వామివారితో బంధం వుండి వుండాలి. బహుశా ఏ మహాభక్తుడో ఈ జన్మలో ఇలా స్వామి పాదాల చెంత ముక్తిని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడనిపించింది.
 
శ్రీవారి పెయింటింగ్‌ బయటకు రాలేదు
అయితే.. స్వామివారి స్కెచ్‌‌లు పూర్తయ్యాక.. ఈవో వినాయక్‌గారు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. కొత్తగా వచ్చిన ఈవో ఐవి సుబ్బారావుగారు నేత్ర దర్శనాన్ని కేలండర్‌గా ప్రింట్‌ చేస్తే అది ప్రతి ఇంటికీ చేరుతుందనీ, అపవిత్ర స్థలంలో నేత్ర దర్శనం వుండటం మంచిది కాదనీ, మహాశక్తివంతమైన స్వామివారి దృష్టి ప్రజలకు మేలుకంటే కీడు చేసే ప్రమాదముందని దాన్ని ప్రింట్‌ చేసే ప్రతిపాదనను పక్కకు పెట్టి ప్రస్తుతానికి ఆ పెయింటింగ్‌ను దేవస్థానం మ్యూజియంలో పెట్టారని తెలిసింది... అని ఈశ్వర్‌ గారు వెల్లడించారు. పబ్లిసిటీ డిజైనర్‌గా ఉన్న ఈశ్వర్‌గారు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తదితర అగ్రనటుల పెయింటింగులు, డిజైన్లు వేసేవారు. మచ్చుకు ఈ క్రింది ఆర్ట్ మీకోసం....

వెబ్దునియా పై చదవండి