తిరుమల గిరుల్లో వెలసి భక్తుల మొక్కులు తీర్చుతున్న కోనేటి రాయుని ఆనందనిలయ అనంత స్వర్ణమయ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి బుధవారం శంఖుస్థాపన చేయనున్నారు. ఈ పథకం కింద శ్రీవారి ఆలయంలో జయవిజయుల నుంచి లోపల ఆలయం మొత్తం, అలాగే ఆలయం వెలుపల కూడా బంగారుతాపడం చేస్తారు.
ఇందుకోసం తితిదే పాలకమండలి రూ.వంద కోట్లను ఖర్చు చేయనుంది. ఈ పథకం పనులను ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తారని తితిదే ఛైర్మన్ డి.ఆదికేశవులు నాయుడు వెల్లడించారు. దీనిపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకాన్ని బుధవారం తిరుమలకు రానున్న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు.
కాగా, ఆలయ ఆళ్వార్ తిరుమంజనంలో శ్రీవారి ఆలయ గోడలకు అభిషేకించే సుగంధ ద్రవ్యాల వల్ల గోడలు పటిష్టంగా వుంటాయని, జయవిజయుల తర్వాత ఆలయం లోపల కూడా బంగారుతాపడం చేయడం వల్ల ఆ పటిష్టత దెబ్బతింటుందని ఇప్పటికే సంప్రదాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండడాన్ని పాత్రికేయులు ఛైర్మన్, ఈవోల దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ఈవో స్పందిస్తూ నిపుణులతో చర్చించే తుది నిర్ణయం తీసుకుంటామని సమాధానం చెప్పారు. ఆలయగోడలపై గత రాజులు చెక్కించిన శాసనాలను బంగారుతాపడంతో మరుగుపరచడం ధర్మవిరుద్ధం కాదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా, శాసనాలను కంప్యూటరీకరిస్తామన్నారు. అలాగే.. ఆనందనిలయ అనంత స్వర్ణమయ పథకానికి ఒక కేజీ బంగారాన్ని గానీ, అందుకు సరిపడ నగదును గానీ విరాళంగా ఇవ్వొచ్చని ఛైర్మన్ తెలిపారు.
ఇలాంటి దాతలకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని సంవత్సరాల పాటు కల్పిస్తామని ఈవో రమణాచారి తెలిపారు. ఈ పనులకు ఎవరైనా బంగారం ఇస్తే వారి వివరాలను తిరువాభరణం పుస్తకంలో నమోదు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.