శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హుండీ ఆదాయం కోట్ల సంఖ్యలో సమకూరిందని టీటీడీ ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా, వెంకన్నకు హుండీ ద్వారా ఏడు రోజుల్లో 11.00 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని ఆదికేశవులు వెల్లడించారు.
తిరుమలలో బుధవారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత బ్రహ్మోత్సవాల్లో 9 రోజులకు 8.77 కోట్ల రూపాయలు మాత్రమే సమకూరిందని గుర్తు చేశారు.
బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారని ఆదికేశవులు తెలిపారు. గత ఏడాది ఉత్సవాలకు 5.50 లక్షల మంది యాత్రికులు రాగా, ఈసారి వారానికే 5.30 లక్షల మంది శ్రీవారిని దర్శించుకొన్నట్లు తెలిపారు.
మలయప్ప ఉత్సవాల్లో పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం అనేక సదుపాయాలను కల్పించామని ఆదికేశవులు అన్నారు. ఇందులో భాగంగా నిత్య అన్నదానం పథకం ద్వారా 12 లక్షల మందికిపైగా భోజన వసతి కల్పించామని తెలిపారు. ఆర్టీసీ ద్వారా ఈ ఏడాది 50 వేల మంది గతం కంటే అదనంగా తిరుమలకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా రూ.340 కోట్ల వ్యయంతో తిరుమల గిరులపై తాగునీటి పథకం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైందని ఆదికేశవులు వెల్లడించారు. బుధవారం తిరుమలలో దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకరరావు సమక్షంలో బ్రహ్మోత్సవాల అభినందన సభ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వెంకన్న బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా టీటీడీ సిబ్బంది పనితీరును, కృషిని కొనియాడారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించాలనే 81 సంవత్సరాల కోరిక ఈ వయస్సులో తీరిందని మంత్రి జువ్వాడి ఆనందం వ్యక్తం చేశారు. నవంబర్ 2న జరిగే నాలుగో విడత కల్యాణమస్తులో 20 వేల జంటలకు వివాహాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి జువ్వాడి తెలిపారు.
ఇదిలా ఉండగా, శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి (గురువారం)తో పరిసమాప్తం కానున్నాయి. గురువారం సాయంత్రం జరిగే ధ్వజావరోహణ కార్యక్రమంలో వెంకన్న ఉత్సవాలు పూర్తవుతాయి. బ్రహ్మోత్సవాల చివరిరోజైన గురువారం స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు.