పెద్దశేష వాహనంపై కనువిందు చేసిన మలయప్ప స్వామి!
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు నాందిగా తొలిరోజైన శనివారం రాత్రి 9 గంటలకు స్వామివారు పెద్ద శేషవాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో శ్రీవారు ఒక్కోరోజు ఒక్కో వాహనంలో విహరిస్తూ సందేశాన్ని ఇస్తూ సర్వమానవాళిని చైతన్యం చేస్తారు. తన దివ్యమనోహర రూపంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తూ సర్వజగత్తుకు తానే మూలకారణం అని చాటి చెపుతారు. పెద్ద శేష వాహనాన్ని దర్శిస్తే సర్వపాపహరణమై పరమపదం సిద్ధిస్తుందని విశ్వాసం. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా వాహన సేవకు ముందు సైన్యంగా గజరాజులు, అశ్వాలు, నందులు కదులుతుండగా భక్తకోటి చేస్తున్న గోవిందనామ స్మరణలు, నృత్యాలతో తిరుమల గిరులు మారుమ్రోగనున్నాయి.