గరుడ వాహనంపై వైకుంఠేశ్వరుడు... మట్టి పాత్రలో నైవేద్యం ఇష్టం...!!
, ఆదివారం, 23 సెప్టెంబరు 2012 (14:48 IST)
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి శ్రీ వేంకటేశ్వరస్వామి గరుడసేవ వాహనంపై అశేష భక్తజనకోటికి దర్శనమిచ్చారు. ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాదిమంది తిరుమాడ వీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో బారులు తీరుతారు. గరుడ వాహనంపై వేంకటేశ్వరుని దర్శించుకున్నవారికి దివ్యమైన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. స్వామివారు భక్తవల్లభుడు స్వామివారు భక్తవల్లభుడు అనేందుకు సాక్ష్యం ఆయనకు రోజూ పెట్టే నైవేద్యం మట్టి కుండలో పెట్టడం. వజ్ర, వైఢూర్యాలు పొదిగిన పాత్రలున్నాయి. ఆ పాత్రలను మిగిలిన వాటిలో ఎన్నింటిని వాడినా నైవేద్యం దగ్గరకి వచ్చేసరికి మట్టి పాత్రలోనే పెట్టాలి. అది భీముడనే కుమ్మరి భక్తికి మెచ్చి స్వామి ప్రసాదించిన వరం. నిరంతరం స్వామివారి నామస్మరణలోనే గడిపేవాడు ఆ కుమ్మరి. బంకమట్టితో పాత్రలు చేస్తున్నా ఆ చేత్తోనే పూలు, తులసీ దళాలు స్వామికి సమర్పిస్తుండేవాడు, అది తొండమాన్ పరిపాలన చేస్తున్న కాలం. ఆ రాజు స్వామికి అత్యంత భక్తుడు. తనకన్నా స్వామికి భక్తుడు లేడని ఆ చక్రవర్తి అనుకునేవాడు. కాని స్వామి ఒకరోజు ఆ చక్రవర్తిని భీముని వద్దకు తీసుకువెళ్ళి ఆ కుమ్మరి మట్టి కుండలో నివేదించిన సంకటి తిన్నాడు. అది చూసిన చక్రవర్తి భగవత్ తత్త్వం అర్థంచేసుకుని, భీముడు చేసిన మట్టి పాత్రలోనే నైవేద్యం ఏర్పాటు చేశాడు. నాటి నుండి మట్టి పాత్రలోనే నైవేద్యం పెట్టే ఆచారం వచ్చింది. ఆ కుమ్మరి భక్తికి తానెంతగా ప్రీతి చెందిందీ శ్రీవేంకటేశ్వరుడు స్వయంగా వ్యక్తీకరించిన క్షణం అది.