మలయప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన గరుడోత్సవానికి రంగం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం జరిగే శ్రీవారి గరుడోత్సవంలో భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు గరుడోత్సవానికి వెల్లువల్లా వస్తారని టీటీడీ భావిస్తోంది.
ముఖ్యంగా 1.15లక్షలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చునని టీటీటీ యంత్రాంగం అంచనా వేస్తోంది. గరుడోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదనంగా మూడువేల మంది సిబ్బందిని వినియోగించేందుకు తితిదే నిర్ణయించింది. అంతేకాకుండా భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమాడ వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అణువణువును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
ఇకపోతే గరుడోత్సవంలో పాల్గొనే భక్తులు దేవదేవుని వాహన సేవలో మాత్రం దర్శించుకుని తిరుగు ప్రయాణం చేపట్టాలని టీటీడి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా గరుడోత్సవానికి అనంతరం స్వామివారిని దర్శించే కార్యక్రమాన్ని భక్తులు వాయిదా వేసుకోవాలని తితిదే వెల్లడించింది. ఇలా భక్తులు సహకరించడం ద్వారా రద్దీని నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ అధికారులు వివరణ ఇస్తున్నారు.