Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అశ్వవాహనంపై ఊరేగనున్న మలయప్ప స్వామి

Advertiesment
అశ్వవాహనంపై ఊరేగనున్న మలయప్ప స్వామి
, శుక్రవారం, 7 అక్టోబరు 2011 (12:25 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం అఖిలాండ బ్రహ్మాండనాయకుడు మలయప్పస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సర్వాలంకరణాభూషితుడైన శ్రీవారు అశ్వవాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. మలయప్ప స్వామి అశ్వవాహనంపై ఆసీనుడై ఊరేగే వైనాన్ని తిలకించేందు భారీ స్థాయిలో భక్తులు ఏడుకొండలకు తరలి వస్తున్నారు.

ఇప్పటికే ఎనిమిదో రోజైన గురువారం జరిగిన రథోత్సవ వేడుకలో అశేష భక్త జనులు పాల్గొన్నారు. గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామి రథ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని విశ్వాసం.

ఇకపోతే.. ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు (శుక్రవారం) ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేకసేవ జరుగుతుంది.

అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలూ నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం.

చక్రస్నానం జరిగిన రోజు (శుక్రవారం) సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం (ధ్వజావరోహణం) చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu