Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింత సెట్టెక్కీ.. సిగురులు కోత్తుంటే...

సింత సెట్టెక్కీ.. సిగురులు కోత్తుంటే...
WD
మాయదారి సిన్నోడు.. మనసే లాగేసిండు... ఈ పాట ఎన్ని వేలసార్లు మా ఊరు చుట్టు ప్రక్కల మారుమోగిందో నాకైతే గుర్తులేదు. మొత్తమ్మీద మారెమ్మ తిరునాళ్లు వచ్చాయంటే మా ఊళ్లోని ప్రతి ముఠా పోటాపోటీగా ప్రభలు కట్టి... ఆ ప్రభ వెనక మహా దర్పంగా సదరు ఊరు తరలి వచ్చేది. ఇక ప్రభను రూపొందించిన విధానాన్ని... ప్రభపై అమ్మవారి రూపాన్ని రంగు కాగితాలతో చిత్రించే పద్ధతిని చెప్పటంకంటే చూడాల్సిందే.

ఇక ఇప్పుడు ప్రభల ఊరేగింపు గురించి కాస్త వివరిస్తా... మా ఊరి నాలుగు దిక్కులను కలుపుతూ నాలుగురోడ్లు ఉంటాయి. ముసలయ్య దేవర గుడి రోడ్డు, చాపలవారి రోడ్డు, అంకమ్మ దేవర గుడి రోడ్డు, మరొకటి దొరవెంకమ్మ రోడ్డు. వినడానికి విచిత్రంగా ఉన్నా... ఈ రోడ్లంటే తమాషా కాదు. రోడ్డు రోడ్డుకీ ఓ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర చెప్పాలంటే... వెనకటికెవరో చెప్పినట్టు రావూరు చాంతాడంత ఉంటుంది. కనుక దాని గురించి తర్వాత చెపుతా...

ఈ రోడ్ల చివర కొనల నుంచి నాలుగు ముఠాల ప్రభలు ప్రయాణమయ్యేవి. అలా మొదలైన ప్రభల ప్రయాణపు జాతర నాలుగు రోడ్లు కలిసే పోలేరమ్మ గుడి దగ్గరకు వచ్చేసరికి జాతర మిన్నంటేది. మైకులు రణగొణ ధ్వనులు సృష్టించేవి. ప్రభలను ఎడ్ల బండిపై కట్టడం వల్ల మైకు శబ్దాలకు జోడెడ్లు ఓ పట్టాన ఆగేవి కావు. వాటితోపాటు నాలుగు ప్రభలను నిర్వహించే అధినాయకులూనూ. "ఎంత పొగరో"... ఒకరి ప్రభను చూసి ఒకరు కవ్వించుకునేవారు.

ఇక ప్రభలపై మహా ఎట్రాక్షన్ రికార్డ్ డ్యాన్స్. వారి అభినయం గురించి చెప్పాలంటే...ఇప్పటి మన సినీ హీరోయిన్లు చేస్తున్న నాభీ నృత్యాలకు తక్కువ... అప్పటి జయమాలిని, జ్యోతిలక్ష్మి డ్యాన్సులకు ఎక్కువ. మొత్తానికి నాలుగు ముఠాల ప్రభలు ఒకచోటకు చేరిన తర్వాత మైకుల కంఠస్వరాలు నిషా ఎక్కేవి.

ఒక మైకు... మసక మసక చీకటిలో అంటే...
మరొకటి... సింత చెట్టెక్కీ సిగురులు కోత్తుంటే అంటూండేది.
ఇంకొకటి... ఎన్టీఆర్ పాట "గుగ్గుగ్గు గుడిసుంది... అని రెచ్చిపోయేది...
నాలుగోది... ఒక లైలా కోసం... అని నిషాగా దీర్ఘం తీసేది.

రికార్డు డ్యాన్సర్లు సరిగా స్టెప్పులేయటంలేదనీ... వారిని పక్కకు నెట్టి మా ఊళ్లో పక్కా మాస్ కుర్రాడుగా పేరు గడించిన "తరాలు" (అతడి పేరు) స్టేజి ఎక్కి చిందులందుకునేవాడు. మొత్తమ్మీద నాలుగు ప్రభల జాతరతో మా ఊరు మోత మోగేది. చుట్టు ప్రక్కల ఊళ్ల ప్రజలు మా ఊరి ప్రభలను చూసేందుకు పరుగెత్తికొచ్చేవారు( అని అనుకునేవాడిని. కానీ వారు వచ్చేది సింతసెట్టు పాటలకోసం... అని తర్వాత తెలిసింది). చివరికి చిరుదివ్వెలతో ఇంటి దేవతలైన ఇల్లాళ్ల రాకతో ప్రభలు పారిపోయి... భక్తి ముంచుకొచ్చేది. ఇలా... ఎంత చెప్పినా తరగని పల్లె వినోదం.. ఎంతో... ఎంతెంతో...

Share this Story:

Follow Webdunia telugu