కుడిచేత్తో ఆమె చెక్కిళ్ళు స్పృశిస్తూ ఊహాలోకాల్లో విహరిస్తున్న రవికి ఎడమ చేతిలోని సిగరెట్ చివరికంటా కాలి వేళ్ళను చురుక్కుమనిపించగానే వాస్తవంలోకి అడుగు పెట్టాడు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శం రవి, రాధల దాంపత్యం అని చుట్టుప్రక్కల ఫ్లాట్స్‌లోని వారు కూడా ఎంతో గొప్పగా చెప్పుకునే విశేషం. నిజంగా కూడా వారిది అన్యోన్య దాంపత్యం. వారిది ప్రేమ వివాహం. ఆ అన్యోన్య దాంపత్యం వారంరోజుల నుంచి కొద్దిగా పెడ మొఖం అయింది. పెళ్ళికి కొద్ది ముందుగా వారి జీవితంలోకి తొంగి చూస్తే...
అవి రవి తిరుపతిలో కాలేజీ చదివే రోజులు. ఎంతో అల్లరి చిల్లరగా స్నేహితులతో తిరుగుతూ కూడా చదువు విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా బి.ఎస్.సి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. ఎమ్.ఎస్.సి రెండో సంవత్సరం చదివే రోజుల్లో ప్రక్క ఇంటి మాస్టారుగారి కూతురు రాధతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఎమ్.ఎస్.సి పూర్తి అయ్యేప్పటికి స్థిరమైన ప్రేమగా మారింది. అయినా రవి చదువు మాత్రం పాడవకుండా ఎమ్.ఎస్.సి ఫస్ట్ క్లాస్‌తో పూర్తి చేశాడు.
ఎలాగైనా రాధను పెళ్ళిచేసుకోవాలన్న పట్టుదలతో రవి ఇంట్లో పెద్దలను ఒప్పించి మాస్టారుగారింటికి సంబంధం కోసం పంపితే మాస్టారుగారు "డబ్బుకు నేను తక్కువేమో గానీ కులానికి తక్కువకాదు. కనుక వేరే కులంలో మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయను" అని కులం మీద ఓ అరగంట లెక్చరిచ్చి పంపాడు. గత్యంతరం లేక రవి మిత్రుల సహాయంతో రాధను వివాహం చేసుకున్నాడు.
చదువుకున్న కొడుకు ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడని రవి తండ్రే వారి సంసారానికి కావలసినవన్నీ ఏర్పాటుచేశాడు. అప్పుడే రవికి బొంబాయిలో పెద్ద కంపెనీలో చీఫ్ కెమిస్టుగా ఉద్యోగం వచ్చింది. రాధతోసహా రవి మకాం బొంబాయిలోని ఓ ఫ్లాటులోకి మార్చాడు.
సెలవు రోజుల్లో ఎంతో జాలీగా రాధతో సిటీలంతా తిరుగుతూ, క్రొత్తగా రిలీజ్ అయిన ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ సాయంకాలం మంచి హోటల్‌లో డిన్నర్ ముగించి ఇంటివద్ద సుఖంగా కాలం గడిపేవారు. అలా సంతోషంగా కాలం గడుపుతున్న సందర్భంలో తాను తల్లికాబోతున్నానని తెలుసుకుంది రాధ. ఆసంతోష వార్త ఎంత తొందరగా రవి చెవిలో వేద్దామా అని సాయంకాలం వరకు నిరీక్షించిన తర్వాత రవి ఇంట్లో అడుగు పెట్టగానే అతన్ని పెనవేసుకుని గుసగుసగా చెప్పింది. రవి విసుక్కుంటూ "రెండు సంవత్సరాల వరకు వద్దన్నాను కదా? ఉదయం డాక్టర్ వద్దకు వెళ్ళి అబార్షన్ చేయించుకుందాం" అన్నాడు.
అందుకు రాధ మనస్సు ఏకీభవించలేదు. అదే వారిద్దరి పోట్లాటకు మొదటి ఘట్టం. వారంరోజులు ఎడమొఖం పెడమొఖంగా వారి సంసారం జరిగిన తర్వాత "నీ నిర్ణయం మార్చుకోవా?" అన్నాడు రవి. బదులుగా రాధ "నా నిర్ణయం మారదు. మీకు ఇష్టం లేకపోతే" తర్వాత ఏమి మాట్లాడుతుందో కూడా వినకుండా బయటకు వెళ్ళాడు రవి.
రెడ్‌లైట్ ఏరియాలో ఓ ఇంటిముందు నిలబడ్డం చూసి "రా గురూ! చాలా గంటలుగా ఎవరూ తోడులేక బోర్ కొడుతోంది" అని ఓ సుందరి ఆహ్వానించింది. రోజూ నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఎంతో బోర్ రాధ అనుభవిస్తుంటుంది కదా ఓ పాపో, బాబో రాధకు తోడుగా ఉంటే కాలక్షేపంగా ఉంటుందని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సిగరెట్ పీక చురుక్కుమన్పించడంతో వాస్తవంలోకి వచ్చాడు.
పూలు మరియు స్వీట్ ప్యాకెట్స్‌లో ఇంటికి రావడం చూసి "ఇవన్నీ ఎందుకండీ?" అని రాధ ప్రశ్నిస్తుంటే పుట్టేది బాబా? పాపా? అని ఆలోచిస్తూ, రెండు చేతుల్తో ఆమె చెక్కిళ్ళను స్పృశిస్తూ "నీ శ్రీమంతానికోయ్" అన్న రవి పెదాలను ముద్దాడుతూ గట్టిగా కౌగిలించుకుంది.