Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొగుళ్లు (మగాళ్లు) జిందాబాద్..

Advertiesment
మొగుళ్లు (మగాళ్లు) జిందాబాద్..

జ్యోతి వలబోజు

WD
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురా
జంకు గొంకు లేక సాగిపొమ్మురా…

అని పాడుకుంటూ పన్నెండు గంటలు నిర్విరామంగా ఆఫీసులో పని చేసి, వంచిన నడుము ఎత్తకుండా కష్టపడి , బస్సులలో నిలబడి రాలేక... లోను తీసుకుని కొనుక్కున్న బైకు ఉన్నా కూడా... ఈ వెధవ ట్రాఫిక్కులో ఇరుక్కుని( నా పావు జీవితం రోడ్లపైనే గడిపేస్తూ) ముక్కుతూ మూల్గుతూ బాస్‍ని, ప్రభుత్వాన్ని, నా పెళ్ళాన్ని, పోలీసును, కనపడ్డవాళ్ళందరినీ తిట్టుకుంటూ, ఈసురోమంటు ఇంటికి చేరుకున్నాను. బట్టలు మార్చుకుని , మొహం కడుక్కుని శ్రీమతి ఇచ్చిన కాఫీ తాగి కుర్చీలో కూలబడ్డా. ఏం బ్రతుకురా ఇది. వెధవ మగ జన్మ. ఆ దేవుడు మగవాడై ఉండి మాకు ఇన్ని కష్టాలా? ఇంత కూడా సింపతీ లేదా? పుట్టినప్పటినుండి ఇదే డైలాగ్ " వాడికేంటి మగాడు" అంటారు అందరు.

చిన్నప్పటినుండే బ్రెయిన్ వాషింగు మొదలవుతుంది. " ఒరేయ్! ఈ ఇంటిని నువ్వే చూసుకోవాలి. అక్కా, చెల్లెళ్ల పెళ్ళీ పేరంటాలు, అమ్మానాన్నను బాగా చూసుకోవాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి" అని బాగా ప్రిపేర్ చేస్తారు అందరూ కలిసి. భవిష్యత్తులో ఇవన్నీచేయాలని చిన్నప్పటినుండే బాగా బ్యాటరీ చార్జ్ చేస్తారు. ఆడపిల్లలకంటే ఎక్కువ స్వాతంత్ర్యం, డబ్బులు ఇస్తారు. కాని మార్కులు తగ్గితే మాత్రం వీపు విమానం మోతేనంటారు. ఇదే మాటలు అమ్మాయిలకెందుకు చెప్పరు. వాళ్లనేమో హాయిగా సుకుమారంగా పెంచుతారు.

స్కూలుకొచ్చి ఏడో క్లాసు దాటగానే IIT, EAMCET అని వాళ్ళే నిర్ణయించేసి బందిలదొడ్డిలోకి పశువులను తోలినట్టు మమ్మల్ని తోలేస్తారు. అఫ్‌కోర్స్ అమ్మాయిలు కూడా మాతో పాటు ప్రతీ దానికి సై అంటు వచ్చేస్తున్నారులెండి. కాని వాళ్లు కంపల్సరీగా చదివి ఉద్యోగాలు చేయాలన్న కండిషన్ ఏమీ లేదు. ఇష్టంలేకుంటే హాయిగా ఇంట్లో కూర్చుంటారు. మగాళ్ళు మాత్రం చచ్చినట్టు ఉద్యోగం చేయాల్సిందే. ఇంట్లో వారి కోరికలు అవసరాలు తీర్చడానికి.

పైగా "ఉద్యోగం పురుష లక్షణం" అంటారు. పొగుడుతున్నారా,ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నారా?... అనేది మెల్లగా అర్థమవుతుంది. మొత్తమ్మీద పెళ్ళి అనే బంధిఖానా తప్పదు. ఒకవేళ పెళ్లి "వద్దు" అంటే చదువైపోయింది, ఉద్యోగం వచ్చింది. ఇంకా ఏం వెలగబెట్టేది ఉంది అని మెడకు పెళ్లాం అనే గుదిబండను కట్టేస్తారు. అంతే... ఇక జీవితాంతం మరో ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడకూడదు. అందాన్ని చూడడం, ఆనందించడం తప్పా?? ప్చ్..

మగపిల్లాడు పుట్టగానే నర్సు, అమ్మతో "కంగ్రాచ్యులేషన్స్ !వారసుడు పుట్టాడు. " అంటుంది. ఐపోయింది నాపని. వారసుడు అంటూ ఉన్నాలేకున్నా వారి ఆస్థిపాస్తులు, అప్పులు, బాధ్యతలు అంటగట్టేస్తారు. పుడుతూనే స్కూల్లో, కాలేజీల్లో కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకుంటే తల్లితండ్రులను అభినందిస్తారు. మీరు అదృష్టవంతులు. మంచి కొడుకును కన్నారు. మీ పేరు నిలబెడతాడు" అని.ఇక నా గొప్పేంటంట ఇక్కడ. పెళ్ళిలో అందరూ మా ఆవిడను మెచ్చుకుంటారు. "అదృష్టవంతురాలివి. మంచి మొగుడు దొరికాడు." నేనేమన్నా పారేసుకున్న పెన్సిల్‍నా దొరకడానికి. అదేంటో నన్ను మాత్రం ఎవ్వరూ మెచ్చుకోరు.ఇన్ని కష్టాలు పడి, చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాకూడా. కష్టం ఒకరిది. అభినందనలు వేరొకరికీనా. మగాడు అంటే కుటుంబాన్ని పోషించడానికే ఉన్నాడని అందరూ కలిసి ముద్ర వేస్తారు.

జీవితంలో పాతిక వంతు అమ్మ చెప్పినట్టు వినాలి. ముప్పాతిక వంతు పెళ్ళాం చెప్పినట్టు వినాలి. లేకుంటే తేడాలొచ్చేస్తాయి. ముచ్చటకి పెళ్ళాం పిలుపులు చూడండి ఎలా ఉంటాయో. మొదటి సంవత్సరం - ప్రియా , డార్లింగ్ ,, రెండో సంవత్సరం - ఏవండి (గోముగా), మూడో సంవత్సరం -ఏమండోయ్. ఎక్కడున్నారు( కాస్త ప్రేమగా) ,, ఐదేళ్ళ తర్వాతనుండి ఫిక్సెడ్‍గా ఒకే పిలుపు - ఏమయ్యో! ఎక్కడ చచ్చావ్?.. మొగుడనే గౌరవం లేకుండా చప్రాసీని పిలిచినట్టు ఒరే, రా అని పిలవడం, అదేమంటే ఏమవుతుంది. ఇప్పుడంతా మోడర్న్ అంటారు. అసలు నన్నడిగితే ఈనాటి ఇల్లాలికి ఇంటా బయటా స్వాతంత్ర్యం ఎక్కువైంది. పెళ్ళి చేసుకునేది మొగుడనే క్యారెక్టర్‍ని వేపుకు తినడనికేమో అని కొన్నిసార్లు సందేహం కలుగకమానదు. అన్నింటికీ ఆర్గ్యూమెంట్స్. గట్టిగా మాట్లాడితే చాలు... వాళ్ళ ఆయుధం తీస్తారు. అదే ఏడుపు. ఆడవాళ్ళు ఏడ్చి గెలుస్తారనేది అక్షర సత్యం. ఇది నాకూ అనుభవమే.

ఇంట్లో హాయిగా నీడపట్టున ఉండి, టీవీ సీరియళ్ళు , సినిమాలు, మహిళామండళ్లు, కిట్టీ పార్టీలు. ఎటూ తోచకుంటే షాపింగ్. వీటన్నింటికీ బోలెడంత డబ్బు కావాలి. ఏతావాతా నా జేబుకు పెద్ద బొక్క పడుతుంది. గానుగెద్దులా ఎండనక, వాననక కష్టపడి ఇంటికొచ్చిన మొగుడికి సపర్యలు చేయడం నామర్దాగానూ, నామోషీగానూ ఫీలవుతారు . కాస్త కోప్పడితే భర్త రాచి రంపాన పెడుతున్నాడని, ఇంటిపనుల్లో, వంట పనుల్లో అస్సలు సాయం చేయరని కంఫ్లైంట్లు.. ఎప్పుడూ చూసినా మొగుళ్ల మీద ఏడుపే ఈ ఆడాళ్ళకి. ఇంకా చెప్పాలంటే నేటి స్త్రీలు హోం డిపార్టుమెంట్‍తో సరిపెట్టుకోకుండా ఫైనాన్స్ కూడా హస్తగతం చేసుకుంటున్నారు. వామ్మో! ఎలా బ్రతికేది. ఇంటి ఖర్చులు, వాళ్ల ఖర్చులు, షాపింగులు అన్నీ మా డబ్బుతోనే చేస్తూ ,,, పైగా మామీదే ఆరోపణలు.

వారమంతా చచ్చే చాకిరి చేస్తామా !. ఆదివారం కాస్త విశ్రాంతిగా ఉందామంటే అదేదో సినిమా చూసి ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని మొదలెట్టారు. అటువంటి సినిమాలను తీసే ప్రొడ్యూసర్ , డైరెక్టర్లను అనుకోవాలి. ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు. పూర్వంలోలాగా పనిమనిషి లేకుండా ఏ ఇల్లాలు ఉంటోంది? రోట్లో పిండి రుబ్బుతున్నారా. బట్టలు ఉతుకుతున్నారా...? అన్నింటికి ఆటోమేటిక్ మెషిన్లు ఉన్నాయిగా. అంత సోమరుల్లా తయారయ్యారు ఆడాళ్ళు. అందరూ ఆడాళ్ళనే అయ్యో పాపం అంటారు. ఏం. మగాళ్లకి కష్టాలుండవా? వాళ్ళని అయ్యో అనరే? ఆఫీసులో పని ఎక్కువగా ఉండి రాత్రి ఆలస్యంగా వస్తే అయ్యో పాపం వాళ్ళాయన ఎప్పుడూ ఆలస్యంగానే వస్తాడు. ఆమె ఇంట్లో ఒక్కతే ఉంటుంది. ఎంత కష్టమొచ్చింది. అంటారు గాని, ఆ మొగుడిని మాత్రం అయ్యో పాపం,. ఎంత కష్టపడుతున్నాడు తన భార్యను సుఖపెట్టడానికి అనరు కదా. ఏం సంపాదించేదంతా నాకోసమేనా?...అని అంటే... ఏం మాట్లాడుతున్నారంటారు.

కానీ పెళ్ళిలో పది నిమిషాలు బుట్టలో కూర్చుని వచ్చే ఆడవాళ్ళు జీవితాంతం మొగుడిని బుట్టలో పడేసి ఉంచుతారు. ఐనా తప్పదు. ఆ దేవుళ్లకే తప్పలేదు ఈ తిప్పలు. లక్ష్మీదేవి మహావిష్ణువు కాళ్ల దగ్గర ఎందుకు కూర్చుంది. ఆయన చేసే పనులన్నీ గమనించడానికే. పార్వతీ దేవి శంకరుని సగభాగం ఆక్రమించేసి తను చెప్పినట్టు ఆనంద తాండవమాడిస్తుంది. ఇక సరస్వతి దేవి తక్కువ తిందా బ్రహ్మగారి నాలుక మీద కూర్చుండి తను చెప్పినట్టు మాట్లాడిస్తూ ఉంది. వాళ్ల కష్టాల ముందు నేనెంత వాణ్ణి. తనివితీరా ఏడుద్దామన్నా అదృష్టం లేదు. ఏమంటే ఆడంగి వెధవలా ఏడుస్తున్నాడంటారు. పైగా ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదంట. ఎవరా అన్నది? వాణ్ణి తీసికెళ్ళి హుస్సేన్‌సాగర్‍లో వినాయకుడితో పాటు ముంచేయాలి.

నాకు తెలీకడుగుతా పెళ్ళిరోజు, పుట్టినరోజులు గుర్తుంచుకోరని ఎప్పుడు మగాళ్ళ మీద ఆడిపోసుకుంటారు. ఆఫీసులో మా బాస్‌గాడు ఎంత చంఢాలమైన వాడో వాళ్ళకు తెలుసా? హాయిగా ఏసిలో కూర్చుని కంప్యూటర్‌లో టిక్కు టిక్కు మంటు ఉంటామని కుళ్ళుకుంటారు. ఎప్పుడు మగాళ్లే బహుమతులు ఇవ్వాలా? పెళ్ళాలు ఇస్తే ఏం మునిగిపోతుంది. ఇంటి ఖర్చులకోసం ఇచ్చిన డబ్బులుంటాయి (మనవే కదా) అందులోంచి కనీసం జలుబు చేసినప్పుడు ముక్కు తుడుచుకోడానికి నాలుగు రుమాళ్ళు కొంటారా? లేదు. ఖర్మ . ఏం చేస్తాం? ఆ శ్రీకృష్ణుడికే తప్పలేదు ఈ (పెళ్ళాల) తిప్పలు. సత్యభామతో తన్నులు కూడా తిన్నాడు పాపం. ఒక్క పెళ్ళాంతోనే చస్తున్నాం. ఎనిమిది మంది పెళ్ళాలను ఎలా మెయింటేన్ చేశాడో ఆ మహానుభావుడు. పద్మ అవార్డులు, చక్ర అవార్డులన్నీ కలిపి ఆయనకే ఇచ్చేయాలి.

ఇంకో విషయం …. చిన్నప్పుడు బయటకు వెళుతుంటే అమ్మఅడుగుతుంది.. ఎక్కడికెళుతున్నావు అని… పెళ్ళయ్యాక పెళ్లాం అడుగుతుంది .. ఎక్కడికెళుతున్నావు అని... చచ్చాక అందరూ అడుగుతారు నాకు తెలుసు... .. ఎక్కడికెళుతున్నావు. అని. నా ఇన్సూరెన్స్ డబ్బంతా నా పెళ్ళానికే ఇచ్చాగా, ఇంకా నేనెక్కడికెళితే ఏంటంట? ఇప్పుడు కూడా నన్ను వదలరా?

ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే…

కష్టాలు ఆడాళ్ళకే కాదు .. మగాళ్ళకీ ఉన్నాయి అని. ఊరుకుంటుంటే భార్యల ఆగడాలు శృతి మించుతున్నాయి. కాబట్టి అందరం ఏకమై సంఘం పెట్టుకుని , ఏం చేయాలని డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే ఈ ఆడాళ్ళు మగాళ్లని నూనే లేకుండానే వేపుకు తింటారు …. ఇక సంఘం అంటారా... దానివల్ల పేద్దగా ఒరిగేదేమీలేదు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటే కాస్త మనశ్శాంతి.

ఆడవాళ్ళకే బాధిత సంఘాలు, మహిళామండలి సమితిలు ఉండాలా? భర్తలు పెట్టుకుంటామంటే అదోలా చూస్తారేంటి. జంధ్యాల సినిమాలో బ్రహ్మానందంలా? మా గోడు వినేది ఎవరూ???

Share this Story:

Follow Webdunia telugu