Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేడమీది గది

మేడమీది గది
, మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (20:18 IST)
శంకరయ్య గారి మేడమీది గదిలో రవి, రాకీలు అద్దెకుంటున్నారు. శంకరయ్యగారి ఏకైక కూతురు క్రాంతి. చాలా అందగత్తె. రవి, రాకీలు ఇద్దరూ ఆ అమ్మాయిని తెగ ప్రేమించేస్తున్నారు. రవి ఒక్కడే రూంలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన మధు... "రవీ! ఏంట్రా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?" అంటూ ప్రశ్నించాడు.

"ఏం లేదురా మధు! నా హృదయరాణి క్రాంతి లేకపోతే నేను బ్రతకడం చాలా కష్టంరా" అంటూ సినిమా స్టైల్లో చెప్పాడు. అప్పుడే రూంలోకి వస్తున్న రాకీ.. రవి మాటలు విని - "ఒరేయ్ యిడియట్! క్రాంతి నీ హృదయరాణా? అసలు ఆమెతో ఎప్పుడైనా మాట్లాడావా? అసలు క్రాంతంటే ఎవరనుకున్నావ్? ఈ రాకీకు కాబోయే భార్య" అంటూ గుండె మీద ఓసారి చేయించుకుని, "రాత్రింబవళ్ళూ ఆమె కోసమే తపిస్తూ నిద్ర పోకుండా డైరీలు మీద డైరీలు నింపేస్తున్నది,, పిచ్చి గీతలనుకున్నావా అవన్నీ నా క్రాంతి నాలో రేపిన అపురూప భావాలు "- అంటూ రాకీ తన తరపున ప్రేమను నాటకీయ పక్కీలో వ్యక్తంచేశాడు.

"అబ్బో! నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నట్లు, ఏదో మంచినీళ్లకు, వీక్లీలకు వెళ్ళి అడగడమేగా, ఎప్పుడన్నా అరగంట ప్రేమ కబుర్లు మాట్లాడావా?" కవ్వింపుగా అన్నాడు రవి. "నేను ప్రేమ కబుర్లు చెప్పినా, చెప్పకున్నా ఆమె నాకెప్పుడో మనసిచ్చేసింది. నా హృదయం నిండా ఆమే వుంది "ఆవేశంగా అన్నాడు రాకీ. "ఆమె నన్ను ప్రేమిస్తోంది".

"కాదు, నన్ను" యిలా రవీ, రాకీ లిద్దరూ వాదించుకుంటుంటే విసుగెత్తిన మధు, "ఒరేయ్ బాబూ! ఆపండ్రా మీ గోల. మీ రూంకి రావాలంటేనే భయమేస్తుంది నాకు. అయినా విధి లేక వస్తున్నాను" అన్నాడు విసుగ్గా. అప్పుడే రూంలోకి అడుగు పెట్టిన శంకరయ్య... "బాబూ రవీ, రాకీ .!.ఈ నెలాఖరుకి రూం ఖాళీ చేసేయండి. ఆ తర్వాత రూంతో మాకు అవసరం వుంది" అన్నాడు మెల్లగా.

"అయ్య బాబోయ్! కొంపదీసి మేం క్రాంతిని ప్రేమిస్తున్న విషయం ఈయనగానీ గమనించాడా!" అని రవి, రాకీలిద్దరూ ఒకేసారి భయపడ్డారు మనస్సులో ...అయినా మాటల్ని కూడదీసుకుని... "మేం ప్రతి నెలా రూం రెంట్ సక్రమంగానే చెల్లిస్తున్నాం కదండీ!" అన్నారిద్దరూ మెల్లగా. "రెంట్ కోసం కాదు బాబూ! పై నెల క్రాంతి పెళ్ళి.

పెళ్ళయిన తర్వాత అల్లుడుగారు యింటికి వచ్చినపుడు ప్రత్యేకంగా వుండడానికి గది కావాలి కదా! ఏం బాబూ మధు, నీకు సపరేట్ గది అక్కరలేకపోతే వీళ్ళను వుండమంటాను "అన్నాడు మధు వైపు తిరిగి. "అంటే?" అంటూ రాకీ, రవిలిద్దరూ ఒకేసారి శంకరయ్యను ప్రశ్నించారు. "అంటే ఏముంది బాబూ! ఈ మధు నా కాబోయే అల్లుడు "అన్నాడు శంకరయ్య. నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు రవి, రాకీలు.

Share this Story:

Follow Webdunia telugu