Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది...

మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది...
WD
"పూజ్యులైన తండ్రిగార్కి, మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది. మేము యిచ్చట క్షేమం. మీ ఆరోగ్యం సరిగా లేదని తెలిసింది. మీరు అనుమతించిన యెడల మిమ్మల్ని పెద్ద హాస్పిటల్‌లో చూపించేందుకు మీ అల్లుడు సిద్దంగా వున్నారు. మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను. మీ కుమార్తె లత" ఉత్తరాన్ని పూర్తిగా చదివిన మాధవయ్య ఒక చిన్న నిట్టూర్పు విడిచాడు.

"మాధవా! యింకా పట్టింపులు ఎందుకురా... ! హాయిగా వెళ్ళి నీ కూతురు దగ్గర వుండవచ్చు కదరా! నువ్విదే పరిస్థితిలోవుంటే రోజురోజుకీ అనారోగ్యంతో క్షీణించడమే తప్ప మరేమీ వుండదు. వెంటనే నువ్వు లతకు లెటర్ రాయి. నీ అల్లుడు కూడా చాలా మంచివాడు" అన్నాడు స్నేహితుడు రామ్మూర్తి.

"ఏనాడైతే నా నిర్ణయాన్ని కాదని వేరేవాడిని పెళ్ళి చేసుకుందో ఆనాడే దానికీ నాకూ వున్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఇక నేను వాళ్ళతో కలిసే ప్రసక్తే లేదు" స్థిరంగా చెప్పాడు మాధవయ్య.

"మాధవా! ఒక్కసారి నువ్వు పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించు. ఆ రోజుల్లో నువ్వు మీ తల్లిదండ్రుల్ని కట్నాన్ని కాదని నిన్ను నమ్ముకున్న సీతను ఆదర్శంగా వివాహం చేసుకున్నావు. చనిపోయేంతవరకూ సీత తల్లిదండ్రులు కాని మీ తల్లిదండ్రులు కానీ మీతో కలవలేదు. అయినా మీరు ఎంతో అన్యోన్యంగా వున్నారు. మీకు పుట్టిన లతను అల్లారుముద్దుగా పెంచారు. కానీ లత దురదృష్టం పదేళ్ళకే తల్లిని పోగొట్టుకోవలసి వచ్చింది. అయినా దాన్ని ఆ లోటు తెలియకుండా పెంచావు."

"అలా పెంచాను కాబట్టేరా ఈ బాధ" మధ్యలో అందుకుని చెప్పాడు మాధవయ్య.
"బాధ ఎందుకురా? దానికి యిష్టమైన వాణ్ణి చేసుకుంది . అది దాని యిష్టం."
"నా యిష్టాయిష్టాలతో పనిలేదంటావా ?"
"మాధవా! నువ్వు ఒకప్పటి మీ తల్లిదండ్రుల్లానే ఆలోచిస్తున్నావా?" కొంచెం కోపంగా ప్రశ్నించాడు రామ్మూర్తి.

"ఎందుకు ఆలోచించకూడదు ప్రస్తుతం నేనూ ఓ తండ్రినేగా" మూర్ఖంగా అన్నాడు.
"మాధవా! చీకటిలోనే వుండాలని ప్రయత్నించకు ఒక్కసారి వెలుగులోకి రా" అన్నాడు.
"నన్ను కాదన్న లత నా కూతురు కానేకాదు . కనీసం నా శవాన్ని చూసే అర్హత కూడా దానికి లేదు" కోపంగా అన్నాడు మాధవయ్య.
"తరం మారింది. తండ్రిగా నువ్వూ మారావ్ అంతే" అనుకుంటూ వెళ్ళిపోయాడు రామ్మూర్తి.

Share this Story:

Follow Webdunia telugu