Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నగ్నసత్యం

నగ్నసత్యం
, మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (20:02 IST)
ఆనందం... బాధ...సంతోషం...విచారం. అన్ని భావాలూ కలగలిసిన విచిత్ర వాతావరణం. అరుదైన ఆ వాతావరణం అనునిత్యం అక్కడ తిరుగాడే జాతికి సర్వ సాధారణం . కొత్తవారికి మాత్రం ఆశ్చర్యం, ఆతృతపడేవాళ్ళు కొందరు ఆనందపడేవాళ్ళు కొందరు. పిలుపు కోసం ఎదురుచూసేవాళ్ళు కొందరు దగా చేయగలిగామన్న ఆనందంతో మరి కొందరు...ఎందరో.

నల్లకోట్ల చాటున దాచుకున్న పలురకాల ప్రశ్నలు సమాధానాలు. నల్లకోట్లకే సలహాలిస్తున్న పక్షులు. చిట్టడవిలో పొదలచాటున కుందేళ్ళ కోసం నక్కిన నక్కల్లా...విచిత్రారణ్యంలో డబ్బు కోసం నల్లకోట్ల వెనకాల నక్కిన నక్కజిత్తుల జేబులు. రకరకాల మనుషులు...పలురకాల వ్యక్తిత్వాలు!

సినిమాల్లో చూపించే కోర్టు సీన్లకి నిజజీవితంలో ఇప్పుడు కళ్ళారా చూస్తున్న ఈ కోర్టుసీనుకి ఎంతో తేడా. సినిమాల్లో కోర్టులెంతో పరిశుభ్రంగా అందంగా వున్నట్టు కనిపిస్తాయి. న్యాయవాదులందరూ కొత్త నల్లకోట్లు వేసుకుని వుంటారు. కానీ ఇక్కడ కొందరు కొత్తకోట్లు, నలిగిన కోట్లతో ఇంకొందరు, అక్కడక్కడా చిరిగిన కోట్లతో కూడా మరికొందరు.

సుళ్ళూరుపేట కోర్టు భవనం పాతదే అయినా కోర్టు ఆవరణ మాత్రం ఎంతో పరిశుభ్రంగా వుంది. పిలుపు కోసం ఎదురుచూస్తూ ఓ మూల నిలబడ్డాను. అసహనంగా వాచీ చూసుకున్నాను. పదకొండయ్యింది! "అమ్మో! ఈ రోజు ఆఫీసుకు లీవు కూడా పెట్టలేదు. మేనేజరు ఈ పాటికి కల్లుతాగిన కోతి నిప్పుల్లో దూకినట్లు ఎగురుతూ వుంటాడు."

ఛఛ.. మేనేజరుగారిని కల్లుతాగిన కోతితో పోల్చానేమిటి? ఆయన చాలా పద్దతయిన మనిషి. ఆయన కల్లెందుకు తాగుతాడు. అసలాయనకి కల్లు తాగాల్సిన కర్మేముంది. వెధవది.. నాలాంటి వాడికే..."ఏయ్! తర్వాత పిలవబోయేది నిన్నే. మేజిస్ట్రేట్ గారి ముందు వినయంగా చేతులు కట్టుకొని మరీ నిల్చో.

ఆయన చాలా మంచివాడు. తప్పయిపోయిందని వినయంగా ఒప్పేసుకున్నావంటే వంద ఫైనేస్తాడంతే. మా దగ్గర చెప్పినట్టు మేజిస్ట్రేటుగారి దగ్గర కూడా తలతిక్కగా సమాధానాలు చెప్పకు. అలా చెప్తే ఆయనకు మహా చిరాకు. ఫైనుతో కూడా మూడ్నెల్లు శిక్షేసినా ఆశ్చర్యపడనవసరంలేదు".


అంటూ ముందు జాగ్రత్తగా హెచ్చరించాడు అనుభవశాలి అయిన ఎక్సైజు కానిస్టేబుల్. ఐదేళ్ళ క్రితం ఉద్యోగంలో చేరేవరకూ తాగుడంటే ఏంటో నాకు తెలియదు. మొదటి జీతం తీసుకున్నరోజున పార్టీ ఇవ్వాల్సిందే అని కొలీగ్స్ నలుగురు పట్టుబడడం, సరేనని హోటల్‌కు వెడదామంటే.. "హోటలా! భలేవాడివి గురూ!. వెట్ పార్టీ ఇవ్వాల్సిందే. బారుకెళ్ళక తప్పదు." అంటూ నలుగురూ ఏకగ్రీవంగా తీర్మానించడం, నెల్లూరు పట్టణాన బార్లకి ఏ మాత్రం కరువులేదు కనుక ఓ బార్లో దూరడం, కొలీగ్స్ బలవంతంమీద ఆ రోజో పెగ్గు పుచ్చుకోవడం, అది మొదలు ఎవరో ఒకరి బలవంతంమీద అప్పుడప్పుడు పుచ్చుకోవడం నుంచి ఎప్పుడయినా నేనూ ఇంకొకర్ని బలవంతంపెట్టే స్థితికి ఎదిగాను.

ఇప్పుడు మద్యపాన నిషేధం పుణ్యమా అని దాదాపు సంవత్సరం రోజుల్నుంచి ఇచ్చి పుచ్చుకోవడాలకి దూరంగా వుంటున్నాను. రెండ్రోజుల క్రితం పేకమిష్ అరియర్స్ పదివేల రూపాయలు నాచేతికి రావడం పెద్ద తప్పయిపోయింది. అవి వస్తాయని నేను ఊహించలేదు కనుక ఆనందపడ్డాను. అంతే. "నీ ఆనందాన్ని మాక్కూడా పంచిపెట్టాల్సిందే" అని తీర్మానించేశారు కొలీగ్స్.

బార్లన్నీ రెస్టారెంట్లుగా మారిపోబట్టి .."ఏ రెస్టారెంటుకి వెడదాం" అనడిగాను. "రెస్టారెంటుకి లాభంలేదు" అన్నారు."మరైతే!" అనుమానంగా అడిగాను. "ఆరంబాకానికెళ్ళి ఆనందాన్ని పంచుకుందాం" అన్నారు నలుగురూ ఒకేసారి. "ఆరంబాకానికా !:" "అవును గురూ!. ఉదయాన్నే మద్రాసు కెళ్ళే ఫస్టు బస్సెక్కామనుకో ఆరున్నరకంతా ఆరంబాకంలో వుంటాం.

బెడ్ కాఫీ దగ్గర నుంచి టిఫిను, భోజనం అన్నీ మందే. ఆనందంగా అనుభవించి సాయంత్రం ఆరు గంటలకు అక్కడ బస్సెక్కితే తొమ్మిదికి అందరం నెల్లూరులో వుంటాం. దట్సాల్" చెప్పాడొకడు. "వెరీగుడ్ అయిడియా !..ఉదయం నుంచి సాయంత్రం వరకు హాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు" అన్నాడింకొకడు ఉషారుగా. "ఆరంబాకం మనకు దగ్గర్లో వుండడం, అది తమిళనాడు కావడం నిజంగా మన అదృష్టం" ఎంతో సంతోషపడ్డాడు మరొకడు.

"పిక్నిక్‌కి వెళ్ళినట్టు వుంటుంది. ఎంజాయ్ చేసినట్టు వుంటుంది." అంటూ ముగ్గుర్నీ సమర్ధించాడు. నాలుగవ వ్యక్తి. నాకూ మనసులో పుచ్చుకుని ఆనందించాలన్న కోరిక అంతర్లీనంగా దాగుండడం వల్ల సరేననక తప్పలేదు. "మరైతే ఆరంబాకం ప్రోగ్రాం ఎప్పుడు పెట్టారు?" అని అడిగాను.

"ఆరంబాకం ఏమన్నా అమెరికానా? వీసా పాస్ పోర్టులు తీసుకుని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోవడానికి , ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఆలస్యం చేస్తే తమిళనాడులో కూడా మద్యపాన నిషేధం చేయొచ్చు. కనుక రేపెలాగూ ఆదివారం ,ఉదయాన్నే ఫస్టు బస్సుకి వెళ్ళిపోదాం. రాత్రికి తిరిగి రావచ్చు." అంటూ ఆతృతపడ్డాడొకడు.

"వెరీగుడ్ ఐడియా చాలా బాగుంది. మరైతే ఉదయాన్నే మన ప్రయాణం ఏమంటావ్?" ముగ్గురూ ఒకేసారి అడిగారు. "నేనెందుకు కాదంటాను". ఆదివారం తెల్లవారుజామున లేచి నలుగురు కొలీగ్స్‌తో కలిసి బస్సెక్కాను. తెల్లవారుజామున లేవడం అలవాటు లేకపోవడం వల్ల బస్సుకదలడంతోటే కళ్లు మూతపడ్డాయి.

"సూళ్ళూరుపేట వచ్చింది. దిగండి అంతా" అన్న కండక్టరు అరుపుతో కళ్ళు తెరిచాను.

"కాఫీ టిఫిను చేసే వాళ్ళుంటే దిగండి సార్. బస్సు పది నిమిషాలాగుతుంది". హోటల్ కుర్రాడు కాబోలు బస్సు చుట్టూ తిరుగుతూ అరుస్తున్నాడు. హోటల్‌కెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తాగొద్దామనిపించి పైకిలేచాను. "ఎక్కడికి గురూ! లేచావు?" అడిగాడొక కొలీగ్. "కాఫీ తాగుదామని" అన్నాను. "కాఫీయా! ఛ.. ఈ రోజు కూడా కాఫీయేంటి?. కాఫీ బదులు ఎంచక్కా ఓ పెగ్గు లాగించావనుకో! బెడ్ పెగ్గుతో ప్రారంభించినట్లుంటుంది". సలహా ఇచ్చాడింకొకడు.

"కరెక్ట్ ..ఓ అరగంట ఓపిక పట్టు గురూ!" అని మరొకరు చెప్పడంతో తప్పనిసరై కూర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత బస్సు కదిలింది. బస్సు తడ చెక్ పోస్టు దాటిన తర్వాత .. "ఇంకో ఐదు నిముషాల్లో ఆరంబాకం వచ్చేస్తుంది" ఆనందపడుతూ నలుగురూ ఒకేసారి చెప్పారు.

ఆరంబాకం దగ్గర పడుతుందని తెలిసే సరికి నాలోకూడా ఏదో అవ్యక్తానందం దాదాపు సంవత్సరం తర్వాత సంతృప్తిగా పుచ్చుకోబోతున్నానన్న తహతహ మనసుని మత్తెక్కించి ఆనందపరుస్తోంది. ఆరంబాకంలో దిగుతూ వుంటే ఆకాశ యానం చేసి అమెరికాలో దిగుతున్నానంత ఆనందపడ్డాను. రోడ్డుమీద ఎక్కడ చూసినా జనం. జాతర్లలో, తిరునాళ్లల్లో తిరుగుతున్నట్టుగా జనం. తూలుతున్న జనం.

తూలుతూ,తూగుతూ తిరుగుతున్న జనం. రోడ్డుకిరువైపులా తట్టలో, బుట్టల్లో ఎండు చేపలు, పచ్చి చేపలు, బతికి ఎగురుతున్న చేపలు. ముక్కులు మూసుకోవాల్సినంత నీచు వాసన!. పొయ్యిల మీద బాండళ్ళతో వేపుతున్న చేపలు, వేగుతున్న చేపలు , ముక్కుపుటాలకు ఘాటుగా తగులుతున్న వాసన! తమిళంలో రాసివున్న అక్షరాలు అర్ధంకాకపోయినా ఎర్రటి రంగు గోడలతో భయంకరంగా కనిపిస్తున్న దాన్ని బట్టి పోలీసు స్టేషనని అర్ధమైంది.

పోలీసుస్టేషను పక్కనే "ఫైవ్ స్టార్ వైన్స్" అని తెలుగు, ఇంగ్లీషు, తమిళంలో ఆకర్షణీయంగా రాసిన పెద్ద బోర్డు, మరింత ఆకర్షణీయంగా పేర్చబడ్డ మద్యం సీసాలు!. దాని సరిగ్గా ఎదురుపక్క అవతల వైపు "తమిళ నాడు వైన్స్ "అన్న బోర్డు. "ఏ షాపుకెళ్దాం?" రెండు బోర్డుల వైపు మార్చిమార్చి చూశాక నన్నడిగారు కొలీగ్స్.

"తాగడానికి ఏదైనా ఒకటే కదా .పేరు బాగుంది ఫైవ్ స్టార్ కే పోదాం "అన్నాను. "అయితే ఆలస్యం దేనికి. పదండి". అన్నారు షాపు దగ్గరకు వెళ్ళి వెళ్ళక ముందే .".రాండి సార్ ..రాండ్యా" సర్వసాధారణంగా ఇక్కడకొచ్చి తాగేది తెలుగాళ్ళేనని కాబోలు తమిళయాస కలిపినా తెలుగులోనే ఆహ్వానించాడు షాపు ముందున్న కుర్రాడు. "యన్నావేణుం సార్?" (ఏం కావాలి సార్) షాపులోనివాడు మాత్రం తమిళంలోనే అడిగాడు.

"మెక్డోవెల్ విస్కీ చెప్పేదా?" నన్నడిగాడొక కొలీగ్. "నీ ఇష్టం" అన్నాను, "ఓకే ఒక యమ్‌సీ ఫుల్" అన్నాడు. "మీర్దా షాపు వెనక్కి పోండి సార్. నాన్దా తీసుకుని వోస్తాను. తిండానికి చాపలామన్నా గావాల్నా?" అడిగాడు కుర్రాడు. "ఇప్పుడు చిప్సుంటే చాలు పట్రా .. చాపలూ గట్రా మధ్యాహ్నం చూడొచ్చు." అన్నాడొక కొలీగ్.

బాటిలూ, చిప్సూ వచ్చాక ఓపన్ చేసి గ్లాసుల్లో పోసి తలా ఒక గ్లాసు తీసుకున్నాం. ప్రతిరోజూ కాఫీతో మొదలయ్యే దినచర్య ఈ రోజు కార్కు ,సోడా కలిపిన విస్కీతో మొదలవుతోందీ. పరగడుపున తాగేసరికి ఏదోలా అనిపించింది. దాదాపుగా సాయంత్రం నాలుగ్గంటల వరకూ ఏం తిన్నామో, తూలుతూ తిరుగుతున్న జనాల్లో మాత్రం కలిసిపోయాం. వెగటనిపించే నీచువాసన తెలియడం లేదు.

ఓ రెండు గంటల సేపు రోడ్ల మీద తిరిగిన తిర్వాత నెల్లూరు బస్సొస్తే అందరం ఎక్కేసాం. బస్సు కదిలింది. చెక్ పోస్టు దగ్గర ఆగింది. కాకీ డ్రస్సు వేసుకున్న నలుగురు బస్సెక్కి పెట్టే పేడా సోదా చేయసాగారు. వాళ్ళని చూసి వుండబట్టలేక "య్యేంటి,, మ్మిర్ర్ షేసేది..". అనడిగానొక కాకీ డ్రస్సతన్ని. "తాగిందికాక, నోర్మూసుకొని కుక్కినపేనులా కూర్చోకుండా వాగుతావా!. దిగరా రాస్కేల్!" అంటూ నా చొక్కా పట్టుకుని పైకి లేపాడు వాడు.

"య్యేయ్..ఏంట్రా ..నా షాక్కా పట్టుకుంటావ్?" అన్నాను కోపంగా. నాకు సపోర్ట్ రావలసిన నా కొలీగ్స్ కుక్కిన పేనుల్లా నోరు మెదపకుండా అలాగే కుర్చుండిపోయారు. నాలుగు కాకీ చొక్కాలు కలిసి నన్ను బస్సులోంచి బలవంతంగా స్టేషన్‌కు లాక్కెళ్ళారు. అప్పటికే తూలుతున్న నాలాంటి నలుగురుతో కలిసి లాఠీ పూజ చేశారు. మత్తు పూర్తిగా దిగిపోయింది.

"ఏయ్.. నిన్ను పిలుస్తోంటే ఎక్కడాలోచిస్తున్నావ్? వెళ్ళు వెళ్ళు చేతులు కట్టుకుని వినయంగా సమాధానం చెప్పు "అంటూ ఎక్సైజ్ పోలీసు చెప్పడంతో తల విదిలించుకుని కోర్టు లోపలికెళ్ళి బోనులో చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాను. "నీ పేరు?" అడిగారు మేజిస్ట్రేట్ గారు. "మురళీకృష్ణ" ఎంతో వినయంగా చెప్పాను. "నిన్న ఆరంబాకంలో తాగావా?"

"తాగాను సార్" ఎవరన్నా వింటారన్న సిగ్గుతో తల వంచుకుని మెల్లగా చెప్పాను. "వంద రూపాయలు ఫైను కట్టి వెళ్ళు" అన్నారు. 'సార్..తమరేమనుకోనంటే ఒక్క మాట. ఇక్కడికి దగ్గరలో వున్న ఆరంబాకానికి వెళ్ళి తాగితే లేని తప్పు లేక అక్కడే తాగి వుండిపోయి వుంటే లేని తప్పు ,ఇక్కడ మనవాళ్ళు తాగితే మాత్రం లేక అక్కడి నుంచి తాగివస్తే మాత్రం తప్పెలా అవుతుంది సార్ వాళ్ళూ, వీళ్ళూ ,నేనూ అందరం భారతీయులమే గదా సార్.

అందరికీ ఒకే న్యాయం వుండాలికదా సార్' అని మేజిస్ట్రేట్ గారిని అడగాలనుకున్న మాటలు మద్యం మత్తు లేనందువల్ల కాబోలు ఎవరో నొక్కిన్నట్టుగా గొంతులోనే ఆగిపోయాయి.

Share this Story:

Follow Webdunia telugu