Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలియని నిజం

తెలియని నిజం
"అయ్యా! తమరి దర్శనార్ధం ఒక వ్యక్తి వచ్చి వున్నాడు. లోపలకు పంపమంటారా?" ఆరడుగుల ఆజానుబాహుడు వంగి వంగి మరీ వినయంగా చెప్పాడు రెవెన్యూమంత్రి రంగారావు గారితో. చెక్క ఊయలమీద కూర్చుని వున్న రంగారావు రెండునిమిషాలు ఆలోచించి "వచ్చిందెవరు? ఏం పని మీద వచ్చాడు?" అన్నాడు.

"తమ నియోజక వర్గానికి చెందిన వ్యక్తే . ఊరు కృష్ణాపురం. పేరు రామయ్య. వచ్చిన పని తెలియదు. మీతోనే విన్నవించుకోవాలంటున్నాడు" చెప్పాడా ఆజానుబాహుడు.. "ఆ రాగి చెంబులోని మంచితీర్ధం కంచుగ్లాసులో పోసివ్వు" స్టూలు మీదున్న రాగి చెంబువైపు చూస్తూ చెప్పాడు మంత్రి. సెక్రటరీ ఇచ్చిన గ్లాసు చేతికి తీసుకొని తాపీగా త్రాగి త్రేన్చి-

"వచ్చినతన్ని లోపలకు పంపించు" అన్నాడు మెల్లగా.
రంగారావుగారు దాదాపు గాంధేయవాదిలా వుంటారు. పత్రికల్లో విలేఖర్లు ఆయన మంచితనాన్ని నిరాడంబరత్వాన్ని గూర్చి ఆర్టికల్స్ రాస్తుంటారు.
"దండాలయ్యా! " వినయంగా నమస్కరిస్తూ కుటీరం లోపలికి వచ్చాడు రామయ్య. అతడి వెంటే నిల్చున్నాడు సెక్రటరీ.

"నువ్వు కృష్ణాపురం రామయ్యవు కదూ!" కళ్ళజోడు సవరించుకుంటూ అడిగాడు.
"అవునయ్యా! తమరి గెలుపు కోసం రాత్రింబవళ్ళు కష్టపడిన విషయం తమరికి గుర్తుండే వుంటుంది." అన్నాడు ఆనందంగా.
"ఊర్లో మనవాళ్ళందరూ బాగున్నారా? అయినా ఏం పని మీద వచ్చావు?" నెమ్మదిగా అడిగాడు.
"అయ్యా! నాకున్నది రెండెకరాలు అనాధీనం భూమి. దాని పక్కనే వున్న వందెకరాలు ఎవరో గణపతిరావంట ఆయన పట్టా చేయించుకున్నాడు.

ఇప్పుడు నా రెండెకరాలు కూడా ఆయనే ఆక్రమించుకున్నాడు. అడిగితే నీకు దిక్కున్నచోట చెప్పుకో? అన్నాడు. నాకున్న ఆధారం ఆ రెండెకరాలే స్వామీ!" అన్నాడు ఏడుస్తూ.
"రెవెన్యూ వాళ్ళకు చెప్పుకున్నావా?" ప్రశ్నించాడు మంత్రి.
"చెప్పుకున్నానయ్యా! ఆ పొలం పట్టా గణపతిరావుగారి పేరు మీద వుంది. అందులో నువ్వు అడుగుపెడితే పోలీసులు అరెస్టు చేస్తారు, వెళ్ళు అని కసురుకున్నారయ్యా" అన్నాడు బాధగా.

"రామయ్యా! నీకు తప్పకుండా సహాయం చేస్తాను . జరిగిందంతా మా సెక్రటరీతో చెప్పు. అర్జీ రాసిస్తాడు. క్రింద వేలిముద్ర వేసి ఇవ్వు. పొలం నీకు వచ్చేటట్లు నేను చేస్తాను" అని హామీ ఇచ్చాడు.
రామయ్య అర్జీ రాయించి వేలి ముద్ర వేసి మంత్రిగారికి ఇచ్చాడు. ఆయన దానిని పూర్తిగా చదివి రంగారావు
"రామయ్యకు వంద రూపాయలు చార్జీలకు ఇచ్చి పంపు" అన్నాడు సెక్రటరీతో.
సెక్రటరీ ఇచ్చిన వంద తీసుకొని "వస్తానయ్యా! మీరే సాయం చెయ్యాలయ్యా!" అని వెళ్ళిపోయాడు రామయ్య.

బస్సెక్కి ఇంటికెళ్తున్న రామయ్య పొలం చేతికొచ్చినంత ఆనందపడిపోతూ సంబరపడసాగాడు. కానీ పాపం అతనికి తెలియని నిజం ఒకటుంది. ఆ నిజం కనీసం పత్రికల వాళ్ళకు కూడా తెలియదు. అదేమిటంటే రంగారావు గాంధేయవాది కాదు. బ్రాందేయవాది. అతడి రాగి చెంబులో వుండేది మంచితీర్ధం కాదు మేలురకం ఫారిన్ బ్రాందీ.

ఇంకో నిజం రామయ్య పొలం ఆక్రమించుకున్న గణపతిరావు రంగారావు బావమరిదికి బినామీ దారుడు. అన్నింటికంటే ఘోరమైన నిజం రామయ్యకు మంత్రిగారి సెక్రటరీ రాసింది అర్జీ లెటరు కాదు. అతడి పొలం గణపతిరావుకు అమ్ముతున్నట్లు రాసిన విక్రయ పత్రం. రేపు ఒకవేళ మళ్ళా రామయ్య వచ్చి అడిగితే
" రాజయ్యా! నువ్వే పొలం అమ్మేశావు నేంనేం చేయగలను చెప్పు?" అని మంచిగా అందరిముందూ తప్పించుకోగలడు రంగారావు.

Share this Story:

Follow Webdunia telugu