Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్ని జేసినా... నా పర్వతాలు.. పర్వతాలే..!!

ఎన్ని జేసినా... నా పర్వతాలు.. పర్వతాలే..!!

Venkateswara Rao. I

WD
ముసురుపట్టిన కాలం. జోరున వర్షం. దానికితోడు ఎముకలు కొరికే చలి. కార్తీక మాసం ప్రారంభంలో వచ్చిన ఈ ముసురువాన వారంరోజులైనా తగ్గిన పాపాన పోలేదు. ఏడు రోజులు వరుణుడు తిష్టవేసే సరికి పర్వతాలు ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవలేదు.

"ఎదవ వాన. రమ్మనప్పుడు రాదాయే.. వద్దన్నప్పుడు మేత్రం ఇట్టా వచ్చి పొట్టలో మంట బెట్టుద్ది. ఏ పనీ దొరకదయ్యె... కాసింత గంజినీళ్లు తాగి పడుందామన్నా కాసుకోడానికి గంజిగింజలు లేవాయే" అనుకుంటూ... " ఓసేయ్ మంగే... వారం కిందటే రైలు కట్టకవకాడ సెరువు గట్టునానుకుని ఉన్న అయ్యగోరు పొలం పనికెల్దామంటే మునగదీసుకుంటివి.

ఇప్పుడు జూడు. తింటానికి తిండి లేకపాయె.. కూకునే సోటు దొరక్కపాయే. నువ్ మేత్రం ఆ మూలన పడి మూలగతంటవి. ధర్మేసుపత్రికెళ్దామన్నా సేతిలో సిల్లిగవ్వ గూడా లేకపాయె. ఇపుడేంజేయాలో తెలవకపాయె. నీ మూలుగు యిని నాకు కాలుజెయ్యి ఆడకపోతుండే.." అంటూ మంగమ్మ పడుకుని ఉన్న మంచంపై వానచినుకులు పడకుండా ఓ తాటిఆకు తెచ్చి కప్పే ప్రయత్నం చేయసాగాడు పర్వతాలు.

శక్తినంతా కూడదీసుకున్న మంగమ్మ మూలుగుతూ... " ఓ మడిసోవ్... అంటే నీకు కోపమొసద్దేమోగానీ, పనొద్దు.. గినొద్దు.. నా రెక్కల్లో సత్తవ లేదు.. పిల్లోడు కాడికెళ్దామని నీకు పదిరోజుల ముంగటే జెప్పా. అయినా నా మాటేనాడే ఇంటే. ఇపుడు జూడు సేతుల్తోపాటు కాళ్లలో గూడా సత్తవ పాయె. కాలు దీసి కాలెయ్యలేకపోతుంటనయె. నువ్విప్పుడేం సేత్తావో నాకు దెల్వటల్లా.." అంటూ నిట్టూర్చింది మంగమ్మ.

"ఎహె... ఆపెహ.. ఆపు. టౌన్లో ఆళ్లే గోచిపాతంత ఇంట్లో ఒకళ్లమీన ఒకళ్లన్నట్టుగా ఉంటిరి. అందులో మనంబోయి ఇరుక్కోవాలా.. ఆడికి వత్తన్న డబ్బులే ఆడికి సాలకపోతుండె. మనమెల్లి అక్కడేం సేత్తాం. నేలమన్ను పొయ్యిలో బూడిద. ఈ ఎదవ వాన రేపైనా కాత్త తెరిపిత్తే ఏదో ఒక దారి తెలత్తాది" అన్నాడు పర్వతాలు.

ఆ రోజు పస్తులతో ముగిసి పోయింది. ఉదయాన్నే వాన లేకపోవడంతో శక్తినంతా కూడదీసుకుని ఏదైనా పని దొరకబుచ్చుకుని గింజలు తెద్దామని వెళ్లాడు పర్వతాలు.

పర్వతాలు అటు వెళ్లగానే కొడుకు చుక్కయ్య వచ్చాడు. మంగమ్మ పరిస్థితి చూశాడు. పక్కనే ఉన్న ముక్కాలి పీటను లాక్కుని కూచుంటూ..." ఏమ్మా.. వంట్లో ఎట్టాగుందీ. అయ్య మాత్రలేమైనా తీసుకురాలేదా. ఆయనెప్పుడూ ఇంతే.. రోగమొత్తే మందూ మాకూ అనడు. ఆయన పనేందో.. ఆయనేందో.." అని అటుఇటూ తేరిపార చూసి.. " టౌన్లో మేముంటన్న ఇల్లు అద్దె రెండు రెట్లు సేసారు. దాన్ని కట్టలేక సత్తన్నాం. రాత్తిరి నా పెళ్లాం నేను గలిసి ఓ ఆలోసన జేశాం. నీ పేర్లో ఉన్న ఆ 20 సెంటు పొలం అమ్మినవ్ అనుకో.. అక్కడ ఓ మాద్దిరి ఇల్లు పడతది. అట్టాగే మీకీడ తాటాకుతో మంచి కప్పూ పడతద్ది. మీరొచ్చినా ఆడ ఉండలేరు కమ్మట్టి ఈడే పెసిడెంటుగారితో మాట్టాడి నాలుగు తాడిసెట్ల ఆకులిమ్మని అడగతా. నువ్వేమంటావేంది." అంటూ మూలుగుతున్న మంగమ్మ సమాధానం కోసం ఎదురు చూడసాగాడు చుక్కయ్య.

ఇంతలో పర్వతాలు వచ్చాడు. "ఎప్పొడొచ్చావ్ రా సుక్కా" అంటూ... "అమ్మేయ్.. లేలే... ఇయాల్టికి వారమైందే నీ కడుపులో మెతుకుబడి. లేసి ఇదిగో ఈ వణ్ణం కాత్త తిను. కడుపు సల్లబడి కాత్తి ఓపికొసద్ది.." అంటూ మెల్లగా ఆమెను మంచంలో నుంచి పైకి లేపి అన్నం ముద్దలను నోటికి అందించాడు పర్వతాలు.

వారంరోజుల రోగంతో సతమతమవుతూ అన్నం లేక పస్తులుంటున్న తమ ఆకలిని తీర్చాలన్న కనీస ఆలోచన లేని చుక్కయ్యకేసి చూసింది మంగమ్మ. చుక్కయ్య మాత్రం సమాధానంకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మంగమ్మ సమాధానం చెప్పలేదు. మనసులో మాత్రం " నా పర్వతాలు... పర్వతాలే" అని కళ్లు మూసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu