Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడపిల్ల కోడెదూడ..

ఆడపిల్ల కోడెదూడ..
, మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (19:59 IST)
జానకి పురిటి నొప్పులతో కేకలు పెడుతోంది. 'అరవకమ్మా! కొద్దిగా ఓర్చుకో! ... కాన్పయిపోతుంది'. అన్నది మంత్రసాని. పుట్టబోయేది ఆడపిల్లా! మగపిల్లాడా! అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు జానకి భర్త కొండయ్య. అదే సమయంలో - 'అయ్యా! దొడ్లో మన ఆవు ఈనిందయ్యా" అని చెప్పాడు పాలేరు.

"ఏం దూడ?" ఆతృతగా అడిగాడు కొండయ్య. "కోడెదూడ" వినయంగా సమాధానం ఇచ్చాడు పాలేరు. "థూ.". ఆవు మగదూడను కన్నదన్న కోపంతో కేకరించి ఉమ్మేశాడు కొండయ్య. అప్పుడే బయటకొచ్చిన మంత్రసాని "మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డను ప్రసవించిందయ్యా" సంతోషంగా చెప్పింది కొండయ్యతో.

"ఛీ.. ఆడపిల్లా...!" అని అసహ్యంగా ఫీలింగు పెట్టాడు కొండయ్య. ఆవు మగ దూడని ఈనిందంటే అసహ్యించుకున్నాడు. భార్య ఆడపిల్లను కన్నా అసహ్యంగా చూస్తున్నాడు. ఈయన మనస్తత్వమేంటో యజమాని వైపు చూస్తూ అనుకున్నాడు పాలేరు. మోతుబరి కొండయ్యే కాదు దాదాపుగా అందరూ తమ పశువులు ఆడదూడను కంటే అవి పెరిగి పెద్దయి మళ్లీ దూడల్ని ఈని పాలిచ్చి డబ్బు సంపాదిస్తాయని ఆశపడతారు.

అలాగే తమకు మాత్రం ఆడపిల్లలు పుట్టకూడదు, మగ పిల్లలే పుట్టాలని కోరుకుంటారు. ఈ వింత మనస్తత్వం మానవులకెందుకు అలవడిందో భగవంతునికే సరిగా అర్ధంకాదు. పాపం పాలేరుకి ఏం అర్ధమవుతుంది.

మహాలక్ష్మిలాంటి కొండయ్య కూతురు సుజాత చిన్నప్పటినుంచీ చివాట్లతోనే పెరిగి పెద్దయ్యింది. కాలం కలసి రాక మోతుబరి కొండయ్య బికారి అయ్యాడు. ఆస్తంతా పోయింది. ఒక్క కోడెదూడ మిగిలింది. పట్నంలో ఉద్యోగం చేస్తున్న కొడుకు- "నాకు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు" అని ఖచ్చితంగా కొండయ్యతో చెప్పేశాడు.

కన్నకొడుకే ఖచ్చితంగా "మిమ్మల్ని చూడాల్సిన బాద్యత లేదు" అనేసరికి ఎంతో కుమిలి పోయాడు కొండయ్య. ఆ సమయంలో - 'నాన్నా! ఆడపిల్లలనే చులకనతో మీరు నన్ను చదివించకపోయినా నాకుగా నేను పలక పట్టుకొని పశువుల కొట్టంలో చేరి దొంగ చాటుగా చదువుకున్నాను.

నేను చదివిన చదువుకు వేల రూపాయలు జీతమిచ్చే ఉద్యోగం దొరక్కపోయినా వందల్లో జీతమిచ్చే ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. పద నాన్నా! పట్నం వెళ్ళిపోదాం," అని తండ్రికి ధైర్యం చెప్పి పట్నం తీసుకెళ్ళింది సుజాత. పట్నంలో చిన్న ఉద్యోగం సంపాదించుకుంది సుజాత.

కొండయ్య చిన్న ఒంటెద్దు బండొకటి సమకూర్చుకొని కోడెదూడని దానికి కట్టి కిరాణా షాపులకు బస్తాలు తోలి కొద్దిగా డబ్బు సంపాదించసాగాడు. "ఒకప్పుడు అసహ్యించుకున్న కోడెదూడ, ఆడపిల్లే ఆసరా అవుతారని నేను ఊహించలేదు. మీరే లేకపోతే నా గతి ఏమయ్యుండేదో?" అనుకున్నాడు కొండయ్య కోడెదూడ వైపు, కూతురు సూజాత వైపు చూస్తూ.

Share this Story:

Follow Webdunia telugu