Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెకిలి వెధవ... వాడితో తిరగకు

వెకిలి వెధవ... వాడితో తిరగకు
WD
శ్రీ రంగనాధంగారంటే కాలేజీలోని విద్యార్థినీ విద్యార్థులకందరికీ ఎంతో గౌరవం మరియు భయం అని కూడా చెప్పవచ్చు. ఆయనను చూసి భయపడడానికి కారణం క్లాసు బయట, కాలేజీ బయట ఎక్కడైనా విద్యార్థులు తిరుగుతుంటే వాళ్ళని పిలిచి ఏవేవో నీతులు చెప్పి పంపుతుంటాడు. ఆయన చెప్పేది మంచే అయినా విద్యార్థులు వాటిని శ్రీరంగనీతులని అంటూ వుంటారు.

శ్రీ రంగనాధంగారు ముదిరిన బ్రహ్మచారి. ఇంట్లో ఒక్కరే వుంటారు. వంటా వార్పూ అన్నీ ఆయనే స్వయంగా చేసుకుంటూ వుంటారు. ఓ రోజు తన ఇంటి ప్రక్కనే ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న కవితను పిలిచి... "ఏమ్మా కవితా ఎలా సాగుతోంది నీ ఉద్యోగం?" అని ప్రశ్నించాడు.

నా ఉద్యోగం గురించి ఈయనకు ఎందుకు ఇంత శ్రద్ధ వచ్చిందబ్బా? అని మనస్సులో అనుకొన్న కవిత "బాగానే సాగుతోంది సార్.. ఈ మధ్యనే జీతం కూడా కాస్త పెంచారు. ఉద్యోగం చేస్తూనే మరో టెక్నికల్ కోర్సు చేస్తున్నాను. అందులో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను " అంది.

"అలాగే ప్రయత్నించు. అంతేకానీ ఆ వెధవ కిరణ్‌గాడితో మాత్రం తిరగకు. వాడు అసలు మంచి వాడు కాదు. వెకిలి వెధవ. వాడిని మార్చాలని ఎంతో ప్రయత్నించాను. అయినా జరగలేదు. ఎప్పటికైనా వాడు మారి మంచి పేరు తెచ్చుకుంటే ఎంతబాగుంటుందో..." అంటున్న ఆయనకు అడ్డు తగులుతూ కవిత...

"సార్ చదువుకోమని సలహా యిచ్చారు మంచిది. అంతేకానీ అతనుతో మాట్లావద్దనడానికి మీరెవరు? ఇలా పర్సనల్ విషయాల్లో కూడా మీ సలహాలు ఇవ్వడం ఏమీ బాగాలేదు" అంటూ ఆయన సమాధానాన్ని ఎదురు చూడకుండా విసవిస వెళ్లిపోయింది కవిత.

ఇలా అందరికీ శ్రీరంగనీతులు చెప్పే రంగనాధం ఉన్నట్లుండి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. దీంతో ఆయన విద్యార్థులతోపాటు కవితా ఊపిరి పీల్చుకున్నారు. తమకు శ్రీరంగ నీతుల బెడద వదిలినందుకు ఎంతో సంతోషపడ్డారు.

కాలం గడుస్తోంది. కాస్త సుస్తీగా ఉన్నందుకు పట్నంలోని హాస్పిటల్ కు బయలుదేరాడు శ్రీరంగనాధం మాస్టారు. ఆ ఊరు అంతకుముందు తాను చదువు చెప్పిన ఊరు కావడంతో తనకు తెలిసినవారు ఎవరైనా కనబడతారేమోనని చూశాడు. మహిళల వార్డు వద్ద తనకు పరిచయమైన ముఖం కనబడేసరికి అటుగా వెళ్లాడు.

మాస్టారును గమనించిన కవిత ముఖం చాటేసేందుకు ప్రయత్నించింది. అయినా వదలని మాస్టారు.... " ఏమ్మా కవితా... నిన్ను చూసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. కోర్సు పూర్తి చేశావా? ఉద్యోగం ఎలా ఉంది?" అంటూ ఆప్యాయంగా అడిగాడు.

"ఆ రోజు మీమాటలు నాకు విసుగు తెప్పించాయి. కానీ ఆ మాటలు విననందువల్ల నా జీవితం నాశనం అయ్యింది. మా ఇద్దరి సంగతి కంపెనీలో తెలియడంతో మమ్మల్ని ఉద్యోగం నుంచి తప్పించారు. అతను నన్ను వదిలేసి ఎంచక్కా వాళ్ల సొంత ఊరుకు చెక్కేశాడు..." అంటూ భోరున విలపిస్తున్న ఆమె వైపు అవాక్కయి చూస్తుండిపోయాడు పాపం రంగనాధం.

Share this Story:

Follow Webdunia telugu