Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిలట్రీవారికీ తప్పని కమసకాయ దెబ్బలు

మిలట్రీవారికీ తప్పని కమసకాయ దెబ్బలు
WD
మా ఊరు వినాయక చవితి పండుగ ఉత్సవం తీరే వేరు. సహజంగా ప్రతి ఇంట పెద్దలు, చిన్నారులు వినాయక విగ్రహానికి పూజాది కార్యక్రమాలు చేసి కానించేస్తుంటారు. అయితే మా ఊర్లో వినాయకచవితి అంటే.. సందడే సందడి. చవితి పండుగకు వారం ముందే ... మా ఊరు పిల్లలందరూ సందడి చేసేవారు. కమసకాయలు ( తెల్ల ఉల్లి ఆకారంలో ఉండే ఒక రకమైన కాయలు) బస్తాలకొద్దీ పీకి ఇంటికి చేర్చేవారు.

అసలీ కమసకాయలేమిటీ.. అనుకుంటున్నారా...? తెల్ల ఉల్లి ఆకారంలో ఉండే ఈ కాయలు మా ఊరు మెట్ట పొలాలైన ఉమ్మడి బొందలు, ఏడెకరాల దిబ్బ అని పిలువబడే కొన్ని చోట్ల మాత్రమే దొరికేవి. వాటిని పీకి... జాగ్రత్తగా మా ఊరు రోడ్డు ప్రక్కన ఉన్న చెట్ల మాటునో... గుంతల్లోనే దాచి ఉంచేవారు. చవితినాడు ఈ కాయలతో రోడ్లపై వెళ్లేవారికి దేహశుద్ది చేసేవారు. ముఖ్యంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు అటుగా వస్తే అంతేసంగతులు.

బాపట్ల సూర్యలంకకు మా ఊరు కూతవేటు దూరంలో ఉంటుంది. అంతకుముందు రోజు వరకూ మిలటరీ వాళ్లన్నా.. వారి వాహనాలన్నా భయపడే పిల్లలు చవితి రోజున మాత్రం సింహాలవుతారు. సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషనుకు వాహనాల్లో వెళ్లే మిలట్రీ అధికారులను సైతం మా ఊరు పిల్లలు వదిలేవారు కాదు. వారిపైనా కమసకాయల వర్షం కురిసేది.

మిలట్రీవారు ఎక్కువమంది ఉత్తరాదివారు కావడంతో... హిందీలో ఏదేదో మాట్లాడేవారు. వారి మాటలు మాకు అర్థమయ్యేవి కావు. చివరికి తమ వాహనాలను కాసేపు ఆపి... బండి దిగి... నవ్వుతూ కమసకాయల దెబ్బలను తింటూనే.. గణేశునికి దణ్ణం పెట్టి సాగేవారు. అప్పుడు తెలియలేదు కానీ, దేశమాత కోసం వారు ఎటువంటి దెబ్బలనైనా తింటారని ఇప్పుడర్థమవుతుంది. ఆ సంగతి అలా ఉంచితే...

ఇక రోడ్డుపై వెళ్లే పాదచారుల వీపులపై కమసలు నాట్యం చేసేవి. దెబ్బ ఎటునుంచి తగిలిందని వెనక్కి తిరిగి చూస్తే... ఒక్కరూ కనిపించేవారు కాదు. ఎందుకంటే.. పిల్లలందరూ తూటి చెట్ల చాటున నక్కి.. ఈ పని ప్రారంభించేవారు. పిల్ల చేష్టలకు కొందరు ఆగ్రహించినా... మరికొందరు నవ్వుకుంటూ వెళ్లిపోయేవారు.

ఈ కమసకాయలతో కొట్టడం వెనక ఓ చరిత్ర ఉన్నది. అదేమంటే... పండుగరోజున ఎవరైతే ఈ కమసలతో దెబ్బలు తింటారో... వారికి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు రావనే విశ్వాసం ఉంది. అందువల్లనే ఈ ఆచారం కొనసాగుతోందని మా నానమ్మ చెప్పగా విన్నాను. అందువల్లనో ఏమోగానీ రోడ్డుపై వెళ్లేవారు కొందరు చెట్లచాటున నక్కి ఉన్న పిల్లలను పిలిచి మరీ కొట్టించుకునేవారు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న వినాయకుని పందిట్లో ఫలహారం సేవించి వెళ్లేవారు. అలా మా ఊర్లో మొదటి పండుగ ఉత్సవం మొదలయ్యేది.

Share this Story:

Follow Webdunia telugu