"రాధయ్యకి ఎంత స్టాకొచ్చిందో ఎంక్వయిరీ చెయ్. ఎంక్వయిరీ అంటే తెలుసుగా" అడిగాడు కృష్ణారావు. "తెలుసండీ. బిల్లు లేకుండా ఎంత స్టాకొచ్చిందో తెలుసుకోవడం" వినయంగా చెప్పాడు కృష్ణారావు పర్సనల్ సెక్రటరీ. "ఊ.. వెళ్ళు" అన్నాడు. వినయంగా నమస్కరించి వెళ్ళిపోయాడు పర్సనల్ సెక్రటరీ. లెక్కలుచూడ్డంలో సంక్రాంతికి ఏం బహుమతులు పెట్టాలి. ఎలా పెట్టాలి అన్న ఆలోచనల్లో మునిగిపోయాడు కృష్ణారావు.
కృష్ణారావు పట్టణంలో పేరుమోసిన బట్టల వ్యాపారి. కానీ ఈ మధ్య అతడికి రాధయ్య పెద్ద తల నొప్పిగా తయారయ్యాడు. బట్టలు కృష్ణారావు కంటే కొద్ది తక్కువ రేట్లకు అమ్మడం, ఆకర్షణీయమైన బహుమతి స్కీములు పెట్టడంలాంటివి చేయసాగాడు రాధయ్య. అందుకనే అతడి వ్యాపారం బాగా పెరిగి కృష్ణారావును మించిపోసాగాడు.
రాధయ్య వ్యాపారాన్ని ఎలాగయినా దెబ్బతీసి ఈ పట్టణంలో పేరుమోసిన బట్టల వ్యాపారిగా అమాయక ప్రజల్ని అధిక రేట్లతో దోచుకోవాలని కృష్ణారావు గొప్ప పన్నాగం పన్నసాగాడు. "ఈరోజు కృష్ణారావు షాపులో అమ్మకాలెంతో తెలుసుకో. అంతేకాదు సంక్రాంతికి వాడేం బహుమతులు ప్రవేశపెట్టబోతున్నాడో కూడా తెలుసుకో" తన సెక్రటరీతో చెప్పాడు రాధయ్య.
"మీరడుగుతారని తెలిసే ముందుగానే ఆ విషయాలన్నీ సేకరించి వుంచానండీ" అని వివరాలున్న కాగితాన్ని వినయంగా రాధారావు చేతిలో వుంచాడు సెక్రటరీ. "అయితే సంక్రాంతికి మారుతీ కారు బంపర్ బహుమతి ప్రవేశపెట్టబోతున్నాడన్న మాట" అన్నాడు."అవును సార్. ప్రతి రెండు వందల రూపాయల కొనుగోలుకూ ఓ కూపన్ ఇస్తారట" అన్నాడు సెక్రటరీ.
"అలాగైతే మనమూ బంపర్ మారుతీ కారు పెడదాం. కానీ ప్రతి యాభై రూపాయల కొనుగోలుకీ ఓ కూపస్ ఇస్తాం" అన్నాడు రాధయ్య. అంతే మరుసటి రోజు ఆ పథకానికి ప్రారంభోత్సవం జరిగిపోయింది. సంక్రాంతి అమ్మకాల సందడి రాధయ్యషాపులో అధికమయ్యింది. కృష్ణారావుకి రాధయ్యమీద కసి పెరిగింది. అంతే ఫోన్ చేతికి తీసుకొని కొన్ని నంబర్లు తిప్పాడు.
"సార్..." ఆత్రుతగా చెప్పాడు రాధయ్య సెక్రటరీ. రాధయ్య చేతిలో ఫోన్ కొన్ని నంబర్లు తిరిగింది. ఏకకాలంలో రాధయ్య, కృష్ణారావుల షాపుల మీద ఇన్‌కంటాక్సు రైడ్లు జరిగాయి. బిల్లు పుస్తకాలు పట్టుకుపోయారు. గాదెకింద పందికొక్కుల్లా జనాన్ని దోచిన ఆ ఇద్దరు వ్యాపారులు కలసి ఇన్‌కంటాక్సు ఆఫీసరింటికెళ్ళారు. ఆ ఇద్దరు కలవడం ఓ అపూర్వ సంఘటన. ఓ కొత్త ప్లానుకి అంకురార్పణ.
అది తక్కువ ఇది తక్కువ- దానికింత దీనికింత అని వాళ్ళిద్దరి సంక్రాంతి ఆదాయాన్ని పూర్తిగా స్వాహా చేశాడా ఇన్‌కంటాక్స్ ఆఫీసర్. ఆ తర్వాత బిల్లు పుస్తకాలు సంతకం చేసి వాళ్ళకిచ్చాడు. అప్పుడే యాంటీకరప్షన్ బ్యూరో ఇన్స్‌పెక్టర్ ఇన్‌కంటాక్సు ఆఫీసర్ని బట్టల వ్యాపారుల దగ్గర నుంచి లంచం తీసుకున్న నేరానికి అరెస్టు చేశారు.
అతడు లంచం తీసుకునే అరెస్టు చేశారనుకోండి. ముసిముసిగా నవ్వుకున్నాయి గాదె కింద పంది కొక్కులు. ఆ నవ్వు- 'ఇద్దరం కలసి ప్రజల్ని దోచుకుందాం. మనిద్దరం కలిస్తే ఈ పిల్లి లాంటి ఇన్‌కంటాక్సు ఆఫీసర్లు మనకో లెక్క కాదు' అన్నట్టుంది.