Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాపం ప్రజలు

పాపం ప్రజలు
, మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (20:18 IST)
హార్ట్‌ అటాక్‌తో హఠాత్తుగా మరణించాడు సహాయ మంత్రి ఈశ్వరయ్య. అతని శవం తలకొరివి కోసం ఎదురుచూస్తూ వుంది. ఈశ్వరయ్య పెద్దకొడుకు చితికి నిప్పంటించబోయాడు. అంతే వున్నట్లుండి ఎగిరిపడి చితిమీద నుండి లేచాడు ఈశ్వరయ్య. చుట్టుపక్కల వున్న ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ప్రజలు అదిరిపడ్డారు."భయపడకండి! నేను బ్రతికి పోయాను" అన్నాడు ఈశ్వరయ్య.

గుండె ఆగినంత పనయ్యింది ఎమ్మెల్యే సూర్యనారాయణకి. "ఎందుకంటే ఈశ్వరయ్య పోర్టుఫోలియో అతనికి ఇస్తానని ప్రామిస్ చేశాడు" ముఖ్యమంత్రి. "అవునయ్యా! నేను బ్రతికిపోయాను. ప్రజలారా! నేనెలా బ్రతికివచ్చానో మీకు చెప్తాను. నన్ను ఇంద్ర లోకం అంటే స్వర్గానికి తీసుకెళ్ళారు గంధర్వులు.

అచ్చట దేవేంద్రుడు కొలువుదీరి వున్నాడు. నేను లా చదివి రాజకీయాల్లో ప్రవేశించానని మీకు తెలుసు. అందుకనే నేను ఇంద్రుడుతో వాదించదలచుకున్నాను. "ఇంద్రా! స్వర్గానికి ఎవర్ని తీసుకొస్తారు?" అని ప్రశ్నించాను. "పుణ్యం చేసిన వాళ్ళను" అన్నాడు. "నేనేం పుణ్యం చేశాను?" అన్నాను. "ఎనలేని ప్రజాసేవే నువ్వు చేసిన పుణ్యం" అన్నాడు.

"మరి అలాగైతే నన్నెందుకు అప్పుడే చంపేశావ్?" అన్నాను, "ఆయుష్షు తీరి వుంటుంది. అయినా ఆ విషయం బ్రహ్మదేవుణ్ణి అడగాలి?" అన్నాడు. "ఎవర్ని అడుగుతావో ఏమో !..నేను మాత్రం యింకా ప్రజాసేవ చెయ్యాలి" అన్నాను. అంతే బ్రహ్మదేవుణ్ణి పిలిపించి మాట్లాడి, అతడు ఒప్పుకున్నాక రంభ, ఊర్వశి, మేనకల డాన్స్ చూపించాడు. అంతే అక్కడ నుండి వదిలి రావాలనిపించలేదు.

అయినా ప్రజల కోసం వచ్చేయాలని నిర్ణయించుకుని వచ్చేశాను" అన్నాడు ఈశ్వరయ్య. అంతే ప్రజలందరూ ముక్తకంఠంతో... "ఈశ్వరయ్య జిందాబాద్! ఈశ్వరయ్య వర్ధిల్లాలి! " అని అరచి అభినందించారు. "అబద్దం- పచ్చి అబద్దం.." అని అరిచాడు సూర్యనారాయణ. కానీ ఎవరికి విన్పించలేదు. ముఖ్యమంత్రి చితినే వేదిక చేసుకొని .."ప్రజలారా! ఈశ్వరయ్యని ఈ క్షణం నుంచే క్యాబినేట్ మంత్రిని చేస్తున్నాను" అన్నాడు...చప్పట్లు చరిచారు ప్రజలు. ఆనందంగా ముఖ్యమంత్రితో కార్లో కూర్చున్న ఈశ్వరయ్య-'నేను చేసిన పాపాలకి నరకం వెళ్ళానని, అక్కడ యమదర్మరాజు కొద్ది గంటలు కూడా భరించలేక బలవంతంగా యమభటులతో భూమ్మీదకి నెట్టించేశాడని ఈ ప్రజలకు తెలియదు పాపం' అనుకున్నాడు నవ్వుకుంటూ.

Share this Story:

Follow Webdunia telugu