Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ మొహానికి రెండు లక్షలు కుమ్మరించాం...

Advertiesment
నీ మొహానికి రెండు లక్షలు కుమ్మరించాం...
"రమా! మన పెళ్ళయి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయింది. మన బాబుకు కూడా ఊహ బాగా తెలుస్తోంది. అయినా కూడా నీ గయ్యాళితనం మాత్రం తగ్గడం లేదు. కనీసం ఇక నుంచైనా నువ్వు మాటిమాటికీ నామీద విరుచుకుపడకుండా వుండేందుకు ప్రయత్నించు" అంటూ ప్రకాష్ భార్యను రాత్రి బెడ్‌రూమ్‌లో అర్ధించాడు.

"ఏం? ఎందుకు వుండాలి? నీ మొహానికి రెండు లక్షలు కుమ్మరించాడు మా నాన్న. ఇప్పటికీ ఇంటికి కావలసిన అవసరాలన్నీ మానాన్నే తీరుస్తున్నాడు. ఇంకెవరైనా అయితే నీ బోడి గుమాస్తా మొహానికి పదివేలు కూడా ఇచ్చి వుండరు. నోరు మూసుకొని పడుకో టైం పదిగంటలవుతోంది" అంటూ గదమాయించింది శూర్పణఖలాంటి రమ తన భర్త ప్రకాష్‌ను.

"ఏరా ప్రకాష్ ఎన్ని రోజులు రా నీ హైదరాబాదు క్యాంప్?" ప్రశ్నించాడు అతని స్నేహితుడు కిరణ్.
"రెండు రోజులేరా" అన్నాడు‌.
"ఇంకో రెండు రోజులు ఉండొచ్చుగా?" అన్నాడు కిరణ్.
"అమ్మో ఇంకేమైనా వుందా రేపు సాయంత్రానికి ఇంటికి వెళ్ళకపోతే నా తోలు ఒలిచేస్తుందిరా మా ఆవిడ."
"అయితే ఇప్పటికీ మీ ఆవిడలో మార్పేమీ రాలేదా? పోనీ మీ ఆవిడ దేనికి భయపడుతుందో ఈ ఐదు సంవత్సరాలలో ఏమయినా తెలుసుకున్నావా?"అని కిరణ్ అడిగాడు.

"మా ఆవిడ దేనికీ భయపడదురా? ఈ ఒక్క దానికి తప్ప..."
"అయితే ఫ్లాష్ లాంటి ఐడియా చెప్తాను నీ చెవి ఇటివ్వు"..
"నో ... నేనలా చేయలేనురా కిరణ్! ఇంకేదయినా మార్గం ఉంటే చెప్పు".
"సరే ఇంకో మార్గముంది... ఇలాగైనా చెయ్యి. అదీ రేపు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడే చెయ్యి".
"మా గయ్యాళి కనుక మారితే నీ మేలు ఈ జన్మలో మరిచి పోనురా"అన్నాడు ప్రకాష్.

"ఏం ఇంత ఆలస్యమయింది?" అంటూ ఇంట్లోకొచ్చిన భర్తను నిలదీసింది రమ.
"నోర్ముయ్!" అంటూ లోపలకు వెళ్తున్న ప్రకాష్ వద్ద ఏదో వాసన గమనించి వెంటనే బెడ్‌రూమ్‌లో బట్టలు మార్చుకుంటున్న భర్త దగ్గరకు పిల్లిలాగా వెళ్ళి...
"ఏమండీ! తాగుడంటే నాకు చచ్చేంత భయమండీ దయచేసి మీరు ఇంకెప్పుడూ తాగవద్దండీ. ప్లీజ్..." అంటూ బ్రతిమిలాడింది రమ.
"నీ గయ్యాళితనం పూర్తిగా మానుకుని సజావుగా వుండేటట్లయితే నేనూ ఇకమీదట తాగను. నువ్వు మారకుంటే నేనూ మారేది లేదు" అన్నాడు ప్రకాష్.

అప్పటినుంచి రమ గయ్యాళితనం అంతా అణగారి పోయింది. ఆ తరువాత ఒక రోజు చాకలికి బట్టలు వేసేటప్పుడు భర్త షర్టు జేబులో లెటర్ కనిపిస్తే అది చేతికి తీసుకుని, బట్టలు చాకలికి వేసి లెటరు ఎవరికబ్బా పైన అడ్రసు కూడా రాయలేదు... అనుకుంటూ చింపి చూసింది రమ.

"డియర్ కిరణ్! నువ్వు ఇచ్చిన మందు ఐడియా మా గయ్యాళిపైన బాగా పనిచేసింది. ఆరోజు సాయంత్రం ట్రైన్ దిగిన వెంటనే బ్రాందీ షాప్‌కి వెళ్ళి మందు కొనుక్కొని షర్టుపై చల్లుకొని ఇంటికి వెళ్ళి అరిచేసరికి రమ కాళ్ళ బేరానికి వచ్చింది. పాపం పిచ్చిది తాగుడు నాకు అసహ్యమని తెలుసుకోలేదు. మళ్ళీ హైదరాబాద్ వచ్చినపుడు స్వయంగా కృతజ్ఞతలు తెలుపుతాను- నీ ప్రకాష్"

సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన ప్రకాష్ "రమా! కాఫీ తీసుకురా" అంటూ అరిచాడు.
"నీ మొహానికి సాయంత్రం కాఫీ ఒకటి తక్కువ..." అంటూ ఒక్కసారిగా దెయ్యం విరుచుకు పడ్డట్లు భర్తపై విరుచుకు పడింది గయ్యాళి రమ.

Share this Story:

Follow Webdunia telugu