Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగోళ్లం... యిడిపోబోతన్నామంటగా...?

తెలుగోళ్లం... యిడిపోబోతన్నామంటగా...?
FILE
తెలుగు నేల... తెలుగు పల్లెలు.. తెలుగు పొలాలు... రాష్ట్ర విభజనపై మాట్లాడుకుంటున్నాయి.
ఏమిటీ..? ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయా...? అదీ విభజనపైనా.. అనుకునేరు.
తెలుగునేలపై పారాడుతున్న ఏ గడ్డి తీగనడిగినా ఈ మాట నిజమని చెపుతుంది.

విభజనకోసం సాగుతున్న ఉద్యమాల సమయంలో ఓ మిత్రుని పలుకరిద్దామని సాగరతీర సమీపంలోని ఓ పల్లెకేసి బయల్దేరాను. ఎక్కిన బస్సు పల్లెకేసి పరుగుతీస్తోంది. మనసు ఊరుకోక.. ప్రక్కనే ఉన్న తోటి ప్రయాణికుడిని... "మాస్టారూ... రాష్ట్ర విభజనపై మీరేం చెపుతారు...? అనడిగాను. అతను కోపంగా నావైపు తిరిగి మళ్లీ కిటికీలోంచి బయటకు చూడసాగాడు.

మరోసారి ఒత్తిపట్టి అదే విషయంపై అడుగుదామనుకున్నా.. సాహసించలేకపోయాను. మిన్నకున్నాను. ఇంతలో అతనులో అతనే ఏదో గొణుగుతున్నాడు. ఆ తర్వాత కాస్త స్వరం పెంచి, "విడిపోతే లాభం ఎవరికి..? కలిసి ఉంటే నష్టం ఎవరికి...? ఈ విషయం చెప్పండి మేష్టారూ...?" అని నాకే ప్రశ్న వేశాడు. ఏం చెప్పాలో తెలియక చూస్తుండిపోయాను.

అతనే మళ్లీ అందుకుని, "ప్రజలకు మాత్రం కాదు. ఎవరికి లాభం కావాలో వాళ్లే చేసుకుంటారు. ఫలితం వాళ్లే అనుభవిస్తారు. ఒక్కటి చెపుతా వినండి మేస్టారూ... వ్యాపారం చేసేవాడు, ఏదో ఒక ఫలితాన్ని ఆశించే కదా చేస్తాడు. ఒకవేళ తన వస్తువు అమ్ముడు పోకపోతే ఏం చేస్తాడు...? ఏదైనా చేసి దాని ద్వారా ప్రయోజనాన్ని దక్కించుకోవాలనుకుంటాడు. మీకు అర్థమైందనుకుంటా..." అని తన దిగాల్సిన స్టేజి రావడంతో దిగి వెళ్లిపోయాడు.

అతను చెప్పిన మాటలు వెనుక ఉన్న అర్థమేమిటా అని ఆలోచిస్తుండగానే నేను వెళ్లాల్సిన పల్లె రానే వచ్చింది. పిల్ల కాలువ ఒడ్డున "పల్లె వెలుగు" పచ్చ బస్సు ఆగింది. బస్సు దిగి తెల్లగా ఉన్న పంట కాలువ ఒడ్డుకు చేరుకుని దోసిలితో కాసిన్ని పంట నీళ్లు తీసుకుని ముఖాన్ని తడుపుకున్నా. హాయిగా ఉంది. పైకి చూసిన నాకు లోకం పచ్చగా కనిపించింది.

పల్లెను చేరుకోవాలంటే మరో కిలోమీటరు దూరం నడవాలి. చేతి సంచిని సంచిని భుజానికి తగిలించుకుని కాలువ ఒడ్డున ఒండ్రుమట్టిలో నడక ప్రారంభించాను. ఇంతలో గొఱ్ఱె పిల్లలను తోలుకుంటూ ఓ యువకుడు నాకు దగ్గరగా వచ్చాడు. నేను అతనివంక చూసేలోపే...

" అయ్‌గోరూ... ఎటు బోవాలా...?" అనడిగాడు
" అదే... కనపడే ఊరుకే.. " అన్నాను

"మీకు దెలుసో లేదో... ఈ కాలవకట్ట అవకాడ, ఇవకాడ ఊరోళ్లు పోట్టాడుకుని తలకాయలు బగలగొట్టుకున్నారు. ఇది జరిగి వారం గావత్తాంది. ఆయాల్ట్నించి ఈయాల్టి దాకా అవకాడ కాలవగట్టు మడిసి ఇవకాడకొస్తే, ఇవకాడవాళ్లు తన్ని తరంగొడతన్నారు. మా కాలవగట్టమీన నడవొద్దని బాదుతున్నారు" అని చెప్పుకుంటూ పోతున్నాడు.

ఆ కుర్రాడి మాటలు విన్న నాకు లోలోపల కాస్త భయం వేసింది. ఇంతలో అతనే అందుకుని.. "ఇంతకీ మీరు కాలవకట్ట ఇవకాడకెళ్లాలా... అవకాడకా...? అవకాడ మడిసైతే మరి నేనెల్లొత్తాన"న్నాడు.

"లేదు బాబు. నేను కాలువ ఇవతలికే వెళ్లాలి" అని, "ఇంతకీ గొడవెందుకు జరిగింది...?" అనడిగాను.

"మరేం లేదండీ... సింపులే. అప్పుడెప్పుడో కాలవ అవకడ, ఇవకడా కలిపి ఇవకడ పల్లెపోళ్లు గట్టుమీన సరికి (సర్వి) సెట్లు నాటారు. సెట్లు పెద్దయ్యాయి. కోతకు రాంగాన్నే కట్టకివకాడ జనం కత్తులు తీసుకుని అవకాడకెళ్లారు నరుక్కొచ్చుకుందామని. ఈ యిసయం దెలుసుకున్న కాలవకట్టకు అవకాడ జనం గుంపుగా వొచ్చి కర్ర నరుకుతున్న జనాన్ని యీరబాదుడు బాదారు. కట్ట మాయేపు ఉంది కమ్మట్టి సెట్లు గూడా మాయే అని అందర్నీ ఇవతల కట్టకు తరిమిగొట్టారు.

ఈ సంగతి దెలుసుకున్న ఇవకాడ జనం ఉమ్మడిగా బోయి వాళ్లమీన పడితిరి. ఊరువాడా గోలగోల. ఆనక పోలీసోళ్లు జీబుల్లో దిగారు. కర్రలు యిరిగాయి. ఆనక తీరుపులు. ఇట్టా జరుగుతుండగానే మద్దెమద్దెలో కట్టమీద ఆళ్ల మడిసి కానోడెవడైనా కనబడితే బాదుడే బాదుడు. అందుకే అవతల కట్ట మడిసి ఇవతలికి- ఇవతలి కట్ట మడిసి అవతలికి బోటల్లా.

నాకు దెలవకడుగుతా... మన తెలుగోళ్లు గూడా యిడిపోదామని ఇట్టాగే గొట్టుకుంటున్నారంటగా...?" అంటూ నా జవాబుకోసం ఎదురు చూడకుండా పంటపొలంలో దిగిన గొఱ్ఱె పిల్లలను రోడ్డుపైకి తోలుకువచ్చేందుకు పరుగెత్తాడా కుర్రాడు.

కుర్రాడి మాటలు వింటూ మెల్లగా నడుస్తున్న నాకు... ఎప్పుడూ తనివితీరా నవ్వుతూ ఆహ్వానించే ఆ రెండు పల్లెలు ఈసారి ఎందుకనో నవ్వడం లేదు.... భోరున ఏడుస్తున్నట్లుగా కన్పించాయి.

Share this Story:

Follow Webdunia telugu