అది నిండు పున్నమి వేళ... ఆ సమయంలో విష్ణుసౌందర్యకి హఠాత్తుగా మెలుకువ వచ్చింది. బయట పిండారబోసినట్లు పున్నమి వెలుగులు వెదజల్లుతుంటే తన గదిలో మాత్రం చీకటి తాండవిస్తోంది. ఆ చీకట్లోకి విష్ణు సౌందర్య తొంగిచూసింది... పాతికేళ్ళ పరువాలు నిండిన జీవితం ఆమె ఎదుట నిలబడి వెక్కిరింతగా నవ్వుతోంది. ఉద్యోగం చేసీ చేసీ రిటైరైపోయిన తండ్రి ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళకి చేసిన అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయి మూడో కూతురి పెళ్ళి గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాడు.
తల్లి మాత్రం వుండబట్టలేక దీని పెళ్ళి సంగతి ఏమీ అనుకోరేవిటండీ అంటూ అప్పుడప్పుడూ నిలదీస్తుంది. ఈ మాట వినినప్పుడల్లా పెదవిచాటు నుండి విరక్తిగా నవ్వుకుంటుంది సౌందర్య. అప్పుడప్పుడూ ఆమెకు అనిపిస్తూ వుంటుంది. ఎవరినయినా ప్రేమిస్తేనో? లేక ఎవరితోనయినా లేచిపోతేనో? అని. ప్చ్... అలాటి దౌర్భాగ్యుడు కూడా ఎవరూ తారసపడలేదామె జీవితంలో.
గదిలో ఏవో గుసగుసలూ, నిట్టూర్పుల చప్పుళ్ళూ వినిపించడంతో ఊపిరి బిగబట్టి వినసాగింది సౌందర్య. ఊ... యిటు తిరుగు... తండ్రి గొంతు. అబ్బబ్బ వుండండీ సౌందర్య లేస్తుంది... తల్లిమారాం చేస్తోంది.
అది ఎప్పుడూ వుండేదేగా.. మనం ఎంతకాలమని దూరంగా వుంటాం? ఉన్నది ఒక్కగది.. ఈ ముద్దులచప్పుడు సౌందర్య గుండెలమీద సమ్మెటపోట్లు పడినట్టుగా వుంది. అయితే సౌందర్యకిదేమీ కొత్తకాదు. తల్లిదండ్రుల్ని ఇంతకాలమూ కేవలం విచక్షణా రహితులుగానే ఊహించింది. కానీ వారి శృంగారానికి తను అడ్డంగా వుందని ఇప్పుడే తెలుసుకుంది. అందుకే ఇంట్లో నుండి తక్షణం వెళ్ళిపోయే మార్గం ఏమిటా... అని వెతకసాగింది.
కానీ ఎలా? ఎలా? ఎప్పుడు... అప్పుడు గుర్తొచ్చాడామెకు కాము. వాడి పేరు కామేశ్వర్‌రావు. అయితే అంతా వాణ్ణి కాము అంటూ పిలుస్తుంటారు. బలిష్టమైన శరీరం, రోజుకు అయిదో, పదో సంపాదించుకుందుకో రిక్షా| అంతకు మించి వాడివి అంటూ చెప్పుకోవడానికి మరేమీ లేవు.
ప్రతిరోజూ తమ ఇంటిముందున్న చెట్టుకిందే వాడు రిక్షా పెట్టుకుంటాడు. ఇన్నాళ్ళూ వాడి మీద తనకా ఆలోచలే కలగనందుకు తనను తాను తిట్టుకుంది సౌందర్య. వాంఛతో పొంగుతున్న తన శరీరాన్ని అదుపులో పెట్టగలిగే మగాడి కోసం కాదు. మృగంలాంటి సంఘాన్నుండి రక్షణ ఇవ్వగలిగితే చాలు... సౌందర్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
తన కులాన్ని, భేషజం నిండిన తన ఇంటి వాతావరణాన్ని చూసి కాము తనని కాదంటాడేమో. అతడు మనసు పడేలా చేయి తండ్రీ.. అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థించింది సౌందర్య.