Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుప్పెడు మెతుకుల కోసం...

గుప్పెడు మెతుకుల కోసం...

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

FILE
ఎటు చూసినా ఫెన్సింగ్... సున్నం కొట్టిన హద్దు రాళ్లతో మా ఊరు పొలాలు ఇళ్ల స్థలాలుగా మారిపోయాయి. ఎకరా 70 వేలంటే ఒకనాడు పెదవి విరిచిన జనం... ఇప్పుడు 30 నుంచి 50 లక్షలకు కొనేందుకు ముందుకొస్తున్నారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణా వాదం నేపధ్యంలో రియల్ వ్యాపారులు ఇప్పుడు దక్షిణ కోస్తాపై దృష్టి సారించారు. డబ్బు సంచులతో పొలాలపై వాలుతున్నారు.

ఆ మధ్య రజనీకాంత్ "కథానాయకుడు" సినిమాలో చూపించిన స్టయిల్లో... "నీ పొలం రోడ్డు ప్రక్కనే వుందా... అయితే ఇదిగో 30 లక్షలు... మీ పొలం చెరువు గట్టున వుందా... అయితే ఇదిగో 15 లక్షలు" అంటూ రైతులకు ఎరవేసి భూములను ధారాదత్తం చేసుకుంటున్నారు.

రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండిస్తే... 20 నుంచి 30 బస్తాల ధాన్యం... అదీ సంవత్సరం తర్వాత... విలువ కేవలం 10 నుంచి 15 వేల రూపాయల లోపే. పోలిక నక్కకూ నాగలోకానికి ఉన్నంత. ఇలా బెరీజు వేసుకుని ఉద్వేగపడిన మా ఊరు జనం వరసబెట్టి పొలాల్ని బరికేయడం మొదలుపెట్టారు.

అయితే భూమినే నమ్ముకున్న మా ఊరు బక్కోడు( అతని అసలు పేరే) మాత్రం పొలం అమ్మనంటే అమ్మనని మొండికేశాడు. అదే రోజున నేను మా ఊరుకు వెళ్లటం జరిగింది. పొలం కొనుగోలుదారు... మా ఊరులో కొందరు మధ్యవర్తులంతా కలిసి బక్కోడు ఇంటి ముందు తిష్ట వేశారు. అటుగా వెళుతున్న నేను ఆగి, విషయం తెలుసుకుందామని అతని ఇంటి చూరు నీడన నిలబడ్డాను.

మధ్యవర్తి, "ఏరా బక్కోడా... ఊరందరిదీ ఒకదారి ఉలిపిరికట్టది ఒకదారి అన్నట్టు అందరూ పొలాల్ని అమ్ముకుని టౌన్లో బిల్డింగులు కొనిపారేత్తుంటే... నువ్వుమాత్రం అమ్మనంటావేంది. తాటాకులు లేని ఈ గుఱ్ఱప్పాకలో ఎంతకాలం వుంటావురా... పెద్దోడ్ని సెబుతున్నా... పొలం అమ్మేయ్. మా కంటే ఓ లచ్చ ఎక్కువే ఇత్తానంటున్నారుగా..." అన్నాడు.

తాటినార పేనుతున్న బక్కోడు తుపుక్కున ఉమ్మి... "మీకు ఎనకమాల చాలా ఆత్తిపాత్తులున్నాయ్. నాకేముంది నేల మన్ను పొయ్యిలో బూడిద. అయినా నాకు దెలవకడుగుతాను పొలాల్ని మొత్తం ఇళ్లుగా మార్సేత్తే తిండి ఎట్టా. మన ఆయకట్టులో 700 ఎకరం వుంది. అంతా రాళ్లు... ఇనప తీగలు పాతేశారు. నిరుడు ఈ పాటికి కమ్మగా చల్లగాలితో రెపరెపలాడిన వరినారు ఇయ్యాల లేదు. మీ ఇట్టం వచ్చినట్టు మీరు పొండి... నా పొలం అమ్మేది లేనే లేదు. నా ఘటం వున్నంతవరకూ నా పిలకాయలు గుప్పెడు మెతుకులకోసం ఎతుకులాడకూడదు..." అంటూ మారు మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెర్నకోల భుజాన వేసుకుని పొలంకేసి బయలుదేరాడు.

నిజంగా పొలాలన్నీ సెజ్‌లు, రియల్ ఎస్టేట్ల పేరిట మరో అవతారమెత్తితే... నిజంగా గుప్పెడు మెతుకులకోసం కోట్లకు పడగలెత్తినవారుసైతం పరుగెత్తాల్సిందే కదా...!!

Share this Story:

Follow Webdunia telugu