Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుదిబండ

గుదిబండ
, మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (17:16 IST)
కల్లుపాకలోకి కృష్ణారావు ప్రవేశించాడు!
"దండాలన్నా! దండాలయ్యా!" అంటూ తాగుబోగుతులందరూ అతడికి మర్యాద చేశారు. కృష్ణారావుని తాగుబోతులందరూ ఎంతో గౌరవిస్తారు. అందుకు కారణం సిల్కు లాల్చీ పైజామా ధరించి నోట్ల కట్టతో కల్లుపాకలోకి ప్రవేశించి దానకర్ణుడిలా అందరికీ కల్లు పోయించడమే! కృష్ణారావుకి పెద్దలు సంపాదించిన ఆస్తి బోలెడు వుంది.
"తొందరగా కల్లు కుండ తేరా!" అన్నాడు షాపువాడ్ని.

"రెండో కల్లు కుండ యింకా చెట్ల దగ్గర నుంచి రాలేదయ్యా!" ఎంతో వినయంగా చెప్పాడు షాపువాడు. "వెధవ కల్లు కుండ... ఇంకా రాలేదా? సరే చెట్ల దగ్గరే వెళ్ళి తాగుదాం పదండి" అని కల్లు పాక దగ్గర ఉన్న తాగుబోతుల్ని తీసుకొని చెట్లదగ్గరికి బయలుదేరాడు కృష్ణారావు.

"చూడండి మిత్రులారా! అసలు కల్లు చెట్ల దగ్గరికి వెళ్ళి తాగితేనే బాగుంటుంది. అసలు మీకో నిజం తెలుసా కల్లుకి ఏడు గుణాలు వున్నాయి. అవన్నీ ఎంతో గొప్ప గుణాలు. అందుకనే మనం క్రమం తప్పకుండా కల్లు తాగాలి. అసలా గుణాలు ఏమిటో తెలుసా?...

కల్లు తాగేంతవరకూ కాకిలా చెట్టు చెట్టు దగ్గరకు తిరిగి తాగాలి. తాగిన తర్వాత చిలక పలుకులు పలికి కొంగలా తూలాలి. తర్వాత కొద్దిపైకెక్కాక విభీషణుడిలా న్యాయం చెప్పడం, తర్వాత ధర్మరాజుకన్నా గొప్పగా ధర్మసూత్రాలు వల్లించడం, బాగా కైపెక్కాక దానకర్ణుడిలా పక్కన వున్నవారందరూ ఏది అడిగితే అది ఇవ్వడం ,చివరగా కుంభకర్ణుడిలా నిద్ర పోవడం.

ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టే కల్లుని నేను ఎంతో గౌరవిస్తాను. రండి హాయిగా కల్లు తాగుదాం" అప్పుడే చెట్ల దగ్గర దించిన కల్లు కుండ దగ్గరకు వెళ్ళి అందరికీ సొంత డబ్బుతో పీకలదాకా కల్లు పోయించాడు. ఇలా ప్రతి రోజూ కృష్ణారావు తాగుబోతులకు కల్లు పోయిస్తూనే ఉన్నాడు.

రెండు సంవత్సరాల మత్తుగా గడిచిపోయాయి. కృష్ణారావు ఆరోగ్యంగా, ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతిన్నాడు. కల్లు తాగాలంటే డబ్బు, తపన రెండు లేవు. తాగితే పైకి లేచి నడవలేడు, తాగకపోయినా నడవలేడు.
ఎవరెవరినో నానా రకాలుగా అడుక్కొని రెండు ముంతల కల్లు కుండను కొనుక్కొని తాగాడు. కల్లు కుండ గుదిబండలా తయారై జీవితాన్ని ఎదుగు బొదుగు లేకుండా నాశనం చేసిందని తెలుసు కృష్ణారావుకి. అందుకనే కల్లుపాక దగ్గరికి వెళ్ళే తాగుబోతులతో..

"చూడండి బాబులూ! ఈ కల్లు తాగొద్దు. దీనికి మూడు లక్షణాలున్నాయి. ఒకటి మన గౌరవాన్ని పూర్తిగా హరిస్తుంది. రెండు మనల్ని ఆర్ధికంగా నాశనం చేసి బికారిని చేస్తుంది. మూడు ఆరోగ్యాన్ని క్షీణింపచేసి మృత్యు ఒడిలోకి మనల్ని నెడుతుంది." అన్ని గట్టిగా చెప్పి దగ్గసాగాడు.

Share this Story:

Follow Webdunia telugu