దాదాపు వంద సబ్జెక్ట్స్ విన్నమీదట ఒకదాన్ని ఓ.కె చేశారు నిర్మాత దర్శకులు. అయితే అనివార్య కారణాల వల్ల ఆఖరి దృశ్యం మరోలా రూపొందించాల్సి వచ్చింది. సూర్యాస్తమయం అవుతూ ఉండగా... బింబం మధ్యలో ఉన్నట్లు కాకి నిలబడి ఉంటుంది. అదే క్లైమాక్స్ దృశ్యం. నిజానికి నెలరోజుల నుంచి కథనంలో ఎలాంటి మలుపులు తీసుకు రావాలో చర్చిస్తూనే వున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఫైనలైజ్ అయ్యారు. కేవలం వాళ్ళకు అడ్వాన్సులు ఇవ్వడమే తరువాయి. అంతా ఓకే అయ్యింది. కానీ క్లైమాక్స్ ఎన్నిరకాలు చెప్పినా నిర్మాతకు, దర్శకునికి ఇద్దరకీ నచ్చలేదు.
"చూడండి డైరెక్టర్ గారూ! నిరంజన్ డేట్స్ దగ్గర పడ్డాయి. ఎలాగైనా రెండురోజుల్లో క్లైమాక్స్ పరిష్కారం చెయ్యాలి. నిరంజన్ ఎంత బిజీ హీరోనో మీకు తెలియటం లేదు. అతని డేట్స్ పోతే మళ్ళీ దొరకవు" అన్నాడు నిర్మాత. "ఏమండీ రచయితగారూ! ఏమంటారు మీరు?" అన్నాడు రచయితవైపు చూసి. "రెండు రోజులు అవసరం లేదండీ. తప్పక రేపే ఫైనలైజ్ చేసేస్తాను" అన్నాడు రచయిత.
"ఓకే అలాగైతే రేపే టెక్నీషియన్స్‌కి, ఆర్టిస్టులకు అడ్వాన్సులు యిచ్చేస్తాను" అని. "చూడవయ్యా! రామ్మూర్తి...రేపు ఉదయం బ్యాంకుకువెళ్ళి క్యాష్ డ్రా చెయ్" అని ప్రొడక్షన్ మేనేజర్ కమ్ అల్లుడికి చెప్పి చెక్ మీద సైన్ చేసి యిచ్చాడు మాధవరావు. నిర్మాత మాధవరావుగారి ఆఫీసులో క్లైమాక్స్ చర్చ జరుగుతోంది. టేబుల్ మీద సూట్‌కేసులోని పది లక్షల రూపాయలు ఎప్పుడు అడ్వాన్సులుగా మారుదామా అని ఎదురు చూస్తున్నాయి.
రచయిత కష్టపడి చెప్పిన ప్రతి క్లైమాక్స్ దర్శకుడికి నచ్చడం లేదు. "సార్! నేనో మంచి క్లైమాక్స్ చెప్పనా?" అన్నాడు ఆఫీస్ బాయ్ రాజు వినయంగా. అతడికి మాధవరావుగారి దగ్గర పదేళ్ళ అనుభవం ఉంది. ఎన్నో స్టోరీ డిస్కషన్స్ వినివున్నాడు. "సరే చెప్పు!" అన్నాడు మాధవరావు.
వెంటనే ఫ్యాంటుజేబులోంచి ఫిస్టల్ బయటకు తీసి.. "ఎవరు కదిలినా కాల్చేస్తాను" అని టేబుల్ మీది సూట్‌కేసుని పదిలక్షలతో సహా తీసుకొని.. "ఇదే మీ కథకు క్లైమాక్స్!" అంటూ వెళ్ళిపోయాడు ఆఫీసు బాయ్ రాజు! ఇలా నోట్లు... హీరో డేట్లు ఖర్చయిపోవటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు దర్శక నిర్మాతలు. తమ బాధను బయటకు చెప్పుకోలేక చివరికి "కాకి"తో క్లైమాక్స్ పని కానించేశారు మరి.