Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నా.. ఇంకెక్కడి ఎగసాయం...?!!

అన్నా.. ఇంకెక్కడి ఎగసాయం...?!!

Venkateswara Rao. I

PTI
మొన్న తెలంగాణా జిల్లాల్లో జరిగిన ఉపఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర సమితి గెలుపు గుర్రాలపై పరుగెట్టింది. ఆ పార్టీ అలా పరుగు తీయడంతో మా ఊరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒకాయన ఓ ఆటో రిక్షాకు సరిపడే టపాసులను ఊరంతా దద్దరిల్లేలా కాల్చిపారేశాడు. ఇంతకీ అంతట ఆనందం ఎందుకయా అంటే.... ఆయన భూ వ్యాపారం చేసేది రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరి.

ఉప ఎన్నికలకు ముందు వరకూ.... తెలంగాణా గనక అపజయం పాలైతే.... తాను ముసుగేసుకోవలసిందేనని తెగ బాధపడిపోయాడు. ఇప్పుడేమో పరిస్థితి అతనకి అనుకూలంగా మారిందట. ఆ ఆనంద సమయంలో తాను మా ఊరిలో ఓ గుడిని కూడా నిర్మించి ఇస్తానన్నాడు.

ఈ సంబరాలు జరిగి 3 నెలలు దాటింది. నిన్ననే మా ఊరి నుంచి ఓ ఫోన్ కాల్. ఫోనులో మా పొలం పక్కనున్న ఓ రైతు కుశల ప్రశ్నల సంగతి అటుంచి, "అన్నా మా ఎకరం తోక పొలం ఇప్పుడెంతో దెలుసా....? ముప్పై లచ్చలు. మొత్తం మూడుంబాతిక కోటి పలకతాంది. హైడ్రేబేడోళ్లు వచ్చి తెగ తిరగతన్నారు. ఈ పొలాల్ని ఆనుకున్న కొత్తగాలవ అవకాడ సమద్రం పక్కనే హార్బరు వత్తందంట. అందుకే ఆళ్లు కొనిపారేత్తున్నారు. మా నాన్న ఎకరం రెండు కోట్లుకైతే ఇచ్చేద్దామని అంటున్నాడు." అని గుక్క తిప్పుకోకుండా చెప్పేశాడు.

తిరిగి నేను "మరి వ్యవసాయం...?" అన్నాను. ఇంకెక్కడి ఎగసాయం... అంతా ప్లాట్లు సేసేత్తంటే... అన్నాడు. అంటే నా చిన్నప్పుడు నేను తిరిగిన పిల్ల కాలువ పంట నీరు ఇక ప్రవహించదు. కూలీల పొలం పనులతో పచ్చపచ్చగా కళకళలాడే పొలాలు... ఇక నుంచి రాళ్లు.. రప్పలు... కట్టడాలతో రూపు మారిపోతుంది. అందుకే అనుకుంటున్నా... కనీసం ఈ సీజనులో చివరిసారిగా ఒక్కసారైనా మా ఊరి పంట పొలాలను చూసొద్దామని.

Share this Story:

Follow Webdunia telugu