Vaishnav Tej, Rakul Preet
గొర్రెల కాపరి కుటుంబ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా `కొండపొలం`. `ఉప్పెన` తరువాత వైష్ణవ్ తేజ్ నటిస్తున్న రెండో చిత్రమిది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి స్పందన వచ్చింది. ఇటీవల విడుదల చేసిన `ఓబులమ్మ, ఫస్ట్ సాంగ్ తో కీరవాణి తన మార్క్‌ను చూపించారు దాంతో కొండపొలం ఆడియోపైనా అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.
ఇక సోమవారం నాడు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో సినిమా కథ ఏంటి? దేని గురించి చెప్పబోతోన్నారనే క్లారిటీని ఇచ్చారు. ట్రైలర్‌ను చూస్తుంటే కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా ఉండబోతోందనిపిస్తోంది.
ట్రైలర్‌లో ఏముందంటే!
హైద్రాబాద్‌లో ఉద్యోగ వేటలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇవ్వడం, అక్కడ అతనికి అవమానాలు ఎదురవడం కనిపిస్తోంది. ఆయన కుటుంబ నేపథ్యం, గొర్రెల కాపరి కావడం, తల్లిదండ్రులు చదువుకోకపోవడం వంటి కారణాలను లేవనెత్తి కించపరుస్తుంటారు. కానీ ఆ వృత్తినే ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు. నల్లమల అడవులన్నీ నాకు తెలుసు..ఇక నేను ఎక్కడకి వెళ్లను..అదే నా ఇన్‌స్టిట్యూషన్ అని ఫిక్స్ అవుతాడు.
కటారు రవింద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) తన తాత మాట ప్రకారం తండ్రితో కలిసి కొండపొలం అనే ఊరికి వెళ్తాడు. అక్కడ నీటి వసతి ఉండదు. కానీ అక్కడే మేకలు, గొర్రెలను పెంచాలి. క్రూర మృగాల నుంచి వాటిని కాపాడే బాధ్యతను అతను తీసుకుంటాడు. ఇక అక్కడే అతని ప్రేయసి ఓబులమ్మ పరిచయమవుతుంది.
అడవిలోని క్రూర మృగాల కంటే ఘోరమైన, దారుణమైన మనుషులుంటారు. వారి వల్ల రవీంద్ర ప్రయాణం ఎంతో కష్టంగా మారుతుంది. వారి నుంచి ఎన్నో ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వారితో రవీంద్రకు ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేదే కథ.
కొండపొలం స్టోరీ లైన్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి సబ్జెక్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడంలో క్రిష్ నైపుణ్యం అందరికీ తెలిసిందే. జ్ఞాన శేఖర్ తన కెమెరాతో అద్బుతమైన దృశ్యాలను చూపించారు. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం అందరికీ గుర్తుండిపోయేలా ఉంది.
వైష్ణవ్ తేజ్‌కు ఈ పాత్ర సరిగ్గా సరిపోయింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో అందంగా కనిపించింది. ఈ జంట చూడటానికి ఎంతో ఫ్రెష్‌గా, కొత్తగా ఉంది. కొండపొలం చిత్రం అక్టోబర్ 8న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.
సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన నవల నుంచి ఈ కథను తీసుకున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాంకేతిక బృందంః దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి, నిర్మాత: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, సంగీతం : ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వీఎస్, కథ : సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి, ఎడిటర్ : శ్రావన్ కటికనేని, ఆర్ట్ : రాజ్ కుమార్ గిబ్సన్.