Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అది వర్మ మార్క్ "అడవి"!! ఏంటో.. చూస్తారా..?

Advertiesment
అడవి
బ్యానర్ : యూటీవీ మోషన్ పిక్చర్స్, నిర్మాత : రాంగోపాల్ వర్మ, రాణీ స్క్రూవాలా, దర్శకత్వం : రాంగోపాల్ వర్మ, సంగీతం : ఇమ్రాన్, బప్పీ, టుటుల్, నటులు : నితిన్ రెడ్డి, ప్రియాంకా కొఠారి, గౌతమ్ రోడే, ఇశ్రత్ అలీ

సాధారణంగా మనం ఏదైనా కొట్టుకు వెళితే డబ్బులు చెల్లించి సరుకులు తీసుకుంటుంటాం లేదా సరుకులు తీసుకుని డబ్బులు చెల్లిస్తుంటాం. కాని ఇష్టమైన ఐస్ క్రీం బండి వద్ద డబ్బులు చెల్లించి ఐస్ క్రీం తినేందుకు చేతులు చాచినప్పుడు ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి ఖాళీ కోన్ ఇచ్చి వచ్చే సీజన్‌లో ఐస్ క్రీం తీసుకోండి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది..? శుక్రవారం విడుదలైన సినిమా "అడవి"ని చూసిన తర్వాత ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది.

అంటే సినిమాని సగ భాగం చూపించి మరో భాగంలో రహస్యం విప్పుతాం అని చెప్పడం జరిగింది. ఈ సినిమా రెండో భాగం మళ్ళీ తీస్తారో లేదో తేలీదు. మొత్తానికి భోజనంలో కూర మాత్రమే వడ్డించి మిగిలిన అన్నంలోకి పెరుగు తోడుకున్న తర్వాత వేస్తాం అన్న చందంగా అడవి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక కథాపరంగా చూస్తే... అదో అడవి. ఆ అడవిలోకి ఓ చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం వెళతారు. షూటింగ్ సమయంలో కెమెరా చెడిపోతుంది. కొత్త కెమెరా లొకేషన్‌కు వచ్చేందుకు రెండు-మూడు రోజులు పడుతుంది. ఈ రెండు మూడు రోజులు గడిపేందుకు చిత్ర యూనిట్ అంతా కలిసి దట్టమైన అడవులలోకి వెళుతుంది. వారిలో కేవలం సేతు అనే వ్యక్తికి అడవి మార్గం తెలుసు. వారు వెళ్ళేటప్పుడు ఓ విచిత్రమైన శబ్దం వింటారు. ఆ వింత శబ్దం ఎవరిది అన్న విషయం తెలుసుకునేందుకు సేతు వెళ్తాడు. వెళ్లినవాడు తిరిగి రాడు. అతను హత్య చేయబడతాడు.

ఈ సంఘటనతో చిత్ర యూనిట్ సభ్యులందరూ బెంబేలెత్తుతారు. అందరూ చిట్టడవిలో చిక్కుకుంటారు. ఎలాగైనా అడవినుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అనుకోని పరిస్థితుల్లో వారిలో కొందరు చంపబడుతుంటారు. కొంతమంది భయపడి ఆత్మహత్యలు చేసుకుంటారు. చివరికి హీరో, హీరోయిన్లు మాత్రమే మిగులుతారు.

అనుకోకుండా వారు అడవినుంచి బయట పడతారు. చిత్ర యూనిట్‌లో అంతమందిని పొట్టనబెట్టుకున్న ఆ అదృశ్య వ్యక్తి కోసం ప్రేక్షకులు ఉత్కంఠతతో ఎదురు చూస్తుండగానే స్క్రీన్‌పై ఆ అదృశ్య వక్తి గురించి తమ తదుపరి చిత్రం రెండవ భాగంలో చూపిస్తాం అని చావు కబురు చల్లగా చెప్పినట్లు దర్శనమిస్తుంది.

ముందు చిత్రం షూటింగ్ ప్రారంభించండి కథ ముగింపు తర్వాత రాసుకుందామని బహుశా దర్శకుడు రాంగోపాల్ వర్మ మరియు రచయిత భావించి ఉండవచ్చునేమో... అసలు చిత్రం క్లైమాక్స్‌ గురించి ఆలోచించలేదేమో. సినిమాను అర్ధాంతరంగా ముగించేశారు. బహుశా తన సినిమాకు సీక్వెల్ తయారు చేయాలనుకున్నారో ఏమో కాని దాదాపు ఈ అదృశ్య శక్తి లేదా వ్యక్తి గురించి చూపించి ఉండాల్సింది.

చిత్రం గురించి చెప్పాలంటే ఈ సినిమా థ్రిల్లర్ సినిమా. కాని ఇందులో థ్రిల్ కలిగించే అంశాలు ఏమంతగా రక్తి కట్టించలేదు. ఇక్కడ రామ్‌గోపాల్ వర్మ మార్క్ కనపడలేదు. కేవలం ఒకటి- రెండు దృశ్యాలు తప్ప పెద్ద గొప్పగా లేదంటున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం ద్వారా చెప్పదలచుకున్నది ఏమీ లేదు. తమవద్దనున్న కెమెరాతో కేవలం అడవి, ప్రియాంక కొఠారి అందచందాలను చూపించగలిగారంటున్నారు సినిమాకొచ్చిన ప్రేక్షకులు. ప్రియాంక కొఠారి నటనకన్నా నితిన్ రెడ్డి నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసించారు.

కొందరు మాత్రం... రాంగోపాల్ వర్మ సినిమాలు చేస్తే మనసుపెట్టి చేస్తారు. లేదంటే అది "అడవి"లానే ఉంటుందని అని గొణుక్కుంటూ వెళ్లడం కనిపించింది.

Share this Story:

Follow Webdunia telugu