నటీనటులు: తేజ సజ్జా, ఆనందీ, దక్ష నగర్కర్, రఘు బాబు, గెటప్ శ్రీను, హర్షవర్ధన్, హేమంత్, హరి తేజ.
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: అనిత్, గీతం: మార్క్ కె రాబిన్, నిర్మాతలు: రాజ్ శేఖర్ వర్మ, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.
సినిమా కథను ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ వర్తమాన కాలపరిస్థితులను బట్టి కథను మార్చుకుని దానికి కొన్ని వినోదం దినుసులు జల్లితే పదిమందికి రుచి తెలుస్తుంది. కనుక దర్శకుడి విజన్ అనేది వెండితెరపై ఆవిష్కరించేందుకు సినిమాలు పుట్టుకొస్తాయి. అవి అందరినీ ఆలోచింజేలా చేస్తే ఆహా! అనిపించుకుంటారు. తెలుగులో అలా అనిపించాలనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రశాంత్ వర్మ జాంబి అనే పాయింట్‌ను తీసుకుని ఏవిధంగా ఆవిష్కరించాడనేది ఈ సినిమా.
కథ: మారియో (తేజ్ సజ్జా) హైదరాబాద్‌లో వీడియో గేమ్ డిజైనర్. తండ్రికి (హర్షవర్థన్) నచ్చకపోయినా ఈ రంగంలోనే తను ఆహా! అనిపించుకోవాలనుకుంటాడు. అలాగే ఓ వీడియో గేమ్ డిజైన్ చేస్తాడు. మిలియన్ డౌన్‌లోడ్స్ అయ్యేసరికి గేమ్‌లో బగ్స్ ఏర్పడతాయి. దానికి సాల్వ్ చేయాలంటే స్నేహితుడు వుండాలి. ఆ స్నేహితుడు కర్నూల్‌కు పెళ్ళి చేసుకుందామని వెళ్ళిపోతాడు.
అందుకోసం తన ఇద్దరు స్నేహితులతో మారియో కర్నూలు వస్తాడు. వచ్చీ రాగానే అక్కడి పరిస్థితి పగలూ ప్రతీకారాలతో తన స్నేహితుడైన పెండ్లికొడుకును బలిపశువు చేస్తున్నారని గ్రహిస్తాడు మారియో. కానీ ఆ విషయాన్ని చెప్పినా స్నేహితుడు పట్టించుకోడు. ఇలాంటి టైంలోనే ఆ ఊరిలో జాంబిలు (మనుషులను పీక్కుతినే మృగాలు) దాడి చేస్తాయి. వారంతా పెండ్లి ఇంటిపై దాడిచేస్తారు. ఆ తర్వాత ఏమయింది? మారియా తనతోపాటు తనవారిని వారినుంచి ఎలా తప్పించుకున్నాడనేది మిగిలిన కథ.
విశ్లేషణ: మనుషులు జాంబీలుగా మారడం, నరమాసంభక్షులుగా మారడం అనేది మనకు కొత్తే. అయినా పురాణాల్లో రాక్షసజాతి అనేది వుంది. ఇంచుమించు అలాంటిదే. ఈ తరహాలో హాలీవుడ్ సినిమాలు చాలానే వచ్చాయి. దాదాపు 200 సినిమాలు వున్నాయి. అయితే వాటిని బేస్‌చేసుకుని బర్నింగ్ ఇష్యూ అయిన కరోనా వైరస్‌ను జోడించి కథను రాసుకోవడం దర్శకుడు ప్రతిభకు నిదర్శనం. అదికూడా రాయలసీమకు చెందిన రెండు ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య పగలు, ప్రతీకారాలకు ఈ అంశాన్ని రంగరించి వినోదాత్మకంగా తీసుకురావడం కొత్త ప్రయోగం.
నటనాపరంగా: ఇంద్ర సినిమాలో బాలనటుడి నుంచి `ఓబేబీ`తో సమంత మనవడిగా నటించిన తేజ్ సజ్జా ఈ కథకు సరిపోయాడు. కర్నూలులో రెండు గ్రూపుల నాయకులు, వారి అనుచరులు కూడా చక్కగా ఇమిడారు. `కసిరెడ్డి`గా జబర్‌దస్త్ శ్రీను చేసే హడావుడి, రెండు చేతులూ పోగొట్టుకున్న 30 ఇయర్స్ ఫృథ్వీ ఎపిసోడ్, శోభనం సీనులో తన భార్య జాంబీగా మారిందని తెలీయకుండా కంగారు పడిపోతున్న మిర్చీ సంపత్ అమాయకత్వం కథను వినోదం వైపు మల్లించాయి. కరోనా వేక్సిన్‌కు మందు కనిపెట్టాలని ప్రయత్నంలో మనుషులపై సైంటిస్ట్ (త్రిపురనేని గోపీచంద్)గా సూటయ్యాడు.
టెక్నికల్‌గా:
కథనంలో సాగే నేపథ్యం సంగీతం, కెమెరా పనివిధానం కథకు బలంగా నిలిచాయి. పాటలపరంగా `గో కరోనా… గోగో` పాటలో కరోనాతో పుట్టిన దీపాలు వెలిగించడం, ప్లేట్‌తో సౌండ్ చేసి కరోనాను గో అనడం వంటి సన్నివేశాలను చక్కగా వుపయోగించాడు దర్శకుడు. అయితే యాక్షన్ ఎపిసోడ్ కాస్త ఎక్కువగా అనిపించింది.
పనితనం:
- దర్శకుడు తన విజన్‌ను మొదటి షాట్‌తో చూపించాడు. పావురం ఎగురుతుండగా మెరుపు మెరిసి ఆ ధాటికి పడిపోయి ఓ గుడి కొలనులో పడి లేచి ఎగురుతుంది. మరలా పతాక సన్నివేశం దానికి లింక్ చేస్తూ తీసిన విధానం ఆయన ప్రతిభకు నిదర్శనం.
-జాంబి విరుగుడుకు గుడిలోకి వచ్చిన హీరో అందరినీ గుడిలోకి వచ్చేలా శంఖాన్ని ఊదడం లాజిక్కుగా వుంది.
-హీరో పాత్రను కూడా వయస్సుతగినట్లుగా చూపించి యాక్షన్ చేయగలడు నిరూపించాడు. అసలు హీరోకూ కర్పూలుకు వున్న లింక్‌నుకూడా సరైన టైంలో రిలీవ్ చేశాడు.
-యాక్షన్ ఎపిసోడ్ దాదాపు 16 నిముషాలు వుంటుంది. చూడ్డానికి ఎక్కువనిపించేలోగా మధ్యలో శ్రీను వంటి పాత్రలతో వినోదం పండించాడు.
-త్రిసూలంతో నాయిక, గదతో.. హీరో, గన్ తో హీరో స్నేహితురాలు.. చేసే యాక్షన్ విన్యాసాలు కూడా బాగుంటాయి.
-అయితే గెటప్ శ్రీను మొదట్లో ఒంటికన్నువాడిగా చూపించి, జాంబిలను భయపెట్టే క్రమంలో ఆ విషయాన్ని మర్చిపోయాడు దర్శకుడు. అలాగే హీరోయిన్ తండ్రిని జాంబిలు ముట్టడిస్తాయి. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి బతికివస్తాడు.
-ముగింపులో అన్నపూర్ణమ్మతో కూడా పన్ చేయించాడు. ఊరిలో అంతా అల్లుడు (హర్షవర్ధన్) పెండ్లిపీటల మీదనుంచి లేచిపోయాడని అనుకున్నారేకానీ ఇంటిలో పనిమనిషి కనిపించడంలేదని ఎవ్వరూ అనుకోలేదంటూ సాగే సన్నివేశం బాగుంది.
ఇలా తను ఏంచేసినా నెక్ట్్స లెవెల్‌లో సినిమా వుండాలని తరచూ చెబుతుండే దర్శకుడు ప్రశాంత్ వర్మ అదే స్థాయిలో సినిమా తీసి మెప్పించాడనే చెప్పాలి. అలాగే వినోదానికి కూడా ఢోకా లేకుండా తీశాడు. అతను నమ్మకం ఏమంటే దీనికి సీక్వెల్‌గా వుంటుందనే ట్విస్ట్ కూడా ఇవ్వడం విశేషం.