నటీనటులు : విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, కె ఆర్ విజయ, సృష్టి దాంగె, మనోబాల
సాంకేతికతః సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణీమ్, సంగీతం : యువన్ శంకర్ రాజా, ఎడిటింగ్ : తీయగు, నిర్మాతలు : విశాల్, దర్శకత్వం : ఎం ఎస్ ఆనందన్.
విశాల్ చేసేవన్నీ విభిన్నమైన కథాంశాలే. ఫ్యాక్షన్ నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు అన్ని కథాంశాలను టచ్ చేశాడు. ఇప్పుడు తాజాగా డిటిజల్ టెక్నాలజీలోనే మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా చేశాడు. అదే `విశాల్ చక్ర`. ఆనందన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
కథ:
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని 73వ దినోత్సవాన్ని జరుపుకునే రోజునే హైదరాబాద్‌లో మంత్రులు, నాయకులు మీటింగ్‌లు పెడతారు. అక్కడ పోలీసు బందోబస్త్ ఎక్కువగా వుంటుంది. సరిగ్గా అదే టైంలో సిటీలో 52 మంది ఇండ్లల్లో దొంగతనాలు జరుగుతాయి. 7కోట్లకుపైగా నగదు అపహరించుకుపోతారు. చేసింది ఇద్దరే వ్యక్తులు. ఈ కేసు పరిశోధించేందుకు కమిషనర్, పోలీస్ ఇన్స్పెక్టర్ గాయత్రీ (శ్రద్ధా శ్రీనాథ్)ను నియమిస్తారు. అప్పటికే మిలిటరీ ఆఫీసర్ చంద్రు అలియాస్ సుభాష్ చంద్రబోస్ (విశాల్) ఈ కేసు దర్యాప్తులో జాయిన్ అవుతారు. చంద్రు ఈకేసును ఎందుకు డీల్ చేస్తున్నాడు? గాయత్రీకి ఇతనికి సంబంధం ఏమిటి? ఫైనల్‌గా విశాల్ నేరస్థులను పట్టుకుని కేసును ఎలా పరిష్కరించాడు? ఈ అంశాలన్నీ తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
విశ్లేషణః
ఆహార్యంరీత్యా విశాల్‌కు ఇటువంటి పాత్రలు కొట్టిన పిండనే చెప్పాలి. ప్రత్యర్థి మైండ్ గేమ్‌ను ఎలా కనిపెట్టవచ్చనే పాత్రలో బాగా సూటయ్యాడు. యాక్షన్‌పరంగా విశాల్ బాగా చేశాడు. శ్రద్ధా శ్రీనాథ్‌ను పోలీసుగా చూడటం కొత్తగా అనిపించింది. ఇందులో మరో కీలక పాత్ర వుంది. రెజనా. ఆమె పాత్ర ఏమిటి అనేది సస్పెన్స్. ఇప్పుడంతా సైబర్ నేరాలే. సాంకేతికత తెలిసినవారు దాన్ని ఎంత బాగా దుర్వినియోగం చేయవచ్చో అభిమన్యుడులో చూపించాడు. ఇందులో సరికొత్తగా చూపించాడు. అయితే ఇందులో సరికొత్త అంశం. డయల్ యువర్ హెల్ప్ యుటిలిటీ సర్వీస్ యాప్ ఎపిసోడ్. దీని ద్వారా ప్రతి మనిషి చరిత్ర వారు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఇంత పెద్ద కథ కాబట్టి, కథనం స్పీడ్‌గా వుంటుంది. ఆ క్రమంలో కొన్ని లోపాలుకూడా వున్నాయి. ఇద్దరే వ్యక్తులు సిటీ మొత్తం ఒకేసారి ఇంచుమించుగా ఎలా దొంగతనాలు చేస్తారనేది లాజిక్ అనిపించదు. ప్రత్యర్థి చెస్ ప్లేయర్ అని తెలుసుకోవడం నుంచి ప్రతి కదలికను హీరో ముందుగానే ఊహించుకునే విధానం సినిమాటిక్‌గా వుంది. అందుకు ఆవేశం, ఆలోచన అనే కాన్సెప్ట్ పెట్టి కన్‌వీన్స్ చేశాడు దర్శకుడు. చివర్లో విలన్‌ను నాకు కన్పించకుండా వుంటేచాలు. లేదంటే నీకు చెక్ పెడతాను అంటాడు. కానీ విలన్ వచ్చి మరీ దొరికిపోతుంది. ఈ లాజిక్ కొద్దిగా అతికినట్లులేదు. అక్కడక్కడా హీరోయిజం రీత్యా మేథావిగా చూపించాడు. విలన్ అంతకంటే మేథావిగా చూపించి మెప్పించాడు. ముగింపులో ఇందుకు సీక్వెల్ వుంటుందనేలా ట్విస్ట్ ఇచ్చాడు.
సీరియస్ మూవీ, మైండ్‌గేమ్ కథనం కనుక రచయిత-దర్శకుడు ఎంఎస్ ఆనందన్ పాటలు లేదా ప్రత్యేక కామెడీ వంటి అనవసరమైన ట్రాక్‌లను జోడించకుండా మంచి ఆకర్షణీయమైన ఆలోచనతో కథను ముందుకు తీసుకెళ్ళారు. ఈ చిత్రం ప్రధాన నటుల ప్రదర్శనలపై ఎక్కువగా ఆధారపడదు, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దర్యాప్తు దృశ్యాలు , యాక్షన్ సన్నివేశాలలో వీక్షకుల దృష్టిని అటెన్షన్ చేయడమే కాకుండా స్క్రీన్ ప్లే యొక్క తీవ్రతను మరింత పెంచింది. ఇలాంటి కథకు కెమెరా పనితనం కీలకం. అది బాగుంది. యాక్షన్ సినిమాలు మైండ్‌గేమ్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది.