నటీనటులు: బాలకృష్ణ-ప్రగ్యా జైశ్వాల్-శ్రీకాంత్-జగపతిబాబు-నితిన్ మెహతా-పూర్ణ-కాలకేయ ప్రభాకర్-అయ్యప్ప పి.శర్మ తదితరులు
సాంకేతికతః ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్, సంగీతం: తమన్మా టలు: ఎం.రత్నం, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను
చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూశావంటే తట్టుకోలేవ్.. అనే బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ డైలాగ్‌లు ఎలా వుంటాయో మూడోసారి వీరి కలయికలో వచ్చిన అఖండ కూడా అలానే వుంది. పూర్తి డైలాగ్స్, యాక్షన్ ఎక్కువ వున్న ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి అదెలా వుందో చూద్దాం.
కథ:
ఊరి పెద్దకు ఇద్దరు కుమారులు పుడతారు. అందులో ఒకరికి సోయ వుండదు. అప్పుడే ఓ సాధువు (జగపతిబాబు) వచ్చి శివయ్య ఆజ్ఞ అంటూ ఆ పసిగుడ్డును తీసుకెళతాడు. కట్ చేస్తే. మురళీ కృష్ణ (బాలకృష్ణ) అనంతపురంలో పేరుమోసిన రైతు. ధర్మానికి కట్టుబడి వుండేవాడు. ఎవరు తప్పుచేసిన శిక్షించి మనిషిగా మార్చేస్తాడు.అలా కొందరు ఫ్యాక్షనిస్టులను మార్చేస్తాడు. ఆ ఊరికి కలెక్టర్ గా ప్రగ్యా జైశ్వాల్ వస్తుంది. ఊరిలో మురళీ గురించి తెలుసుకుని అతన్ని ప్రేమించి పెండ్లి చేసుకుంటుంది. ఓ పాప పుడుతుంది.
మరోవైపు ఊరిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైనింగ్ పేరుతో భూమిని ఇష్టారాజ్యంగా తవ్వే రౌడీ వరదరాజులు (శ్రీకాంత్) ఆపేరుతో యురేనియం దందా చేస్తుంటాడు. ఇతనికి ఓ స్వామిజీ ముసుగులో మరో రౌడీ అండ. ఊరివారంతా వరదరాజుల దందాను వ్యతిరేకించడంతో కలెక్టర్ వ్యతిరేకిస్తుంది. దాంతో వరదరాజులు ఆమె కుమార్తెను చంపడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి సమయంలో అఘోరా (బాలకృష్ణ) వచ్చి కాపాడతాడు? ఆ తర్వాత పరిణామాలు ఏమిటి? చివరికి ఎటువంటి ముగింపు ఇచ్చాడు? అన్నది సినిమా.
విశ్లేషణ:
బాలకృష్ణ బోయపాటి యాక్షన్ ఎపిసోడ్లకు నందమూరి అభిమానులు విజల్స్ వేయవలసిందే. అంతకు తగినట్లుగానే బాలకృష్ణను చూపించాడు. రెండో పాత్ర అఘోరాలో పూర్తిగా శివుడు ఆజ్ఞను శిరసావహించే పాత్రలో రక్తికట్టించాడు. ఈ క్రమంలో ధర్మాన్ని కాపాడేందుకు యుద్ధమే చేయాల్సి వస్తుందనే లాజిక్‌ను చెబుతూ కథను నడిపాడు. సినిమాటిక్‌గా కొన్ని సన్నివేశాలు వున్నా అఘోరా పాత్ర కాబట్టి ఫ్రీడం తీసుకుని పాత్ర డిజైన్ చేశాడు దర్శకుడు. బాలకృష్ణ అఘోరా పాత్ర సూపర్ మేన్‌లా వుంటుంది. అతనికి చావంటే భయంలేదు. అలాంటి పాత్రను ఎంతమంది కత్తులతో పొడిచినా, తుపాకులతో పేల్చినా అవేవీ ఆయనకు అంటవు. ఆఖరికి మంత్రతంత్రాలు చేసే శర్మ పాత్ర కూడా అవే చేయలేవు. ఇవన్నీ ఎలా తీశాడనేది చూడాలంటే తెరపై చూడాల్సిందే.
లెజెండ్‌లో చెల్లెలు, మరదలు సెంటిమెంట్ వున్నట్లే అఖండలో చైల్డ్ సెంటిమెంట్ వుంది. అదే అఘోరాను ఊరికి రప్పించేలా చేస్తుంది. ఇంటర్‌వెల్ బ్యాంగ్ కూడా లెజెండ్లా అనిపిస్తుంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ వినయవిధేయరామా తరహా చాలా క్రూరంగా వుంటాయి. కథపరంగా చూసుకుంటే మనిషి నాశనం కోరుకునే ఓ రౌడీ స్వామిగా మారితే అతడ్ని శిక్షించడానికి అంతే ఇదిగా అఘోరా పాత్ర శిక్షిస్తుంది. మొదటి భాగంలో మురళీ పాత్ర కథ నడిపితే సెకండాఫ్ మొత్తం అఘోరా పాత్రే నడుపుతుంది.
ఇందులో దేవాలయాల గురించి వాటి నిర్మాణం గురించి కొన్ని వివరాలు తెలియజేస్తాడు ఇప్పటి జనరేషన్‌కు. అదేవిధంగా హైందవ ధర్మం ఎలా వుంది ఏమి చెప్పింది అనేది కూడా టచ్ చేశాడు. అహింసే పరమ ధర్మం అని చెప్పారు. కానీ ఆ ధర్మానికి నష్టం జరిగితే హింస చేయమనేది దాచి పెట్టారంటూ వేదాల్లో వున్న విషయాన్ని ఇక్కడ దర్శకుడు తెలియజేశాడు. అందుకే హింస చేయాల్సి వస్తుందనే లాజిక్‌గా డైలాగ్ లు కూడా వున్నాయి.
ఈ సినిమాలో వినోదం ఆసించడం కష్టం. కేవలం పర్యావరణ, ధర్మం, అధర్మం వీటిపైనే కథ నడుస్తుంది. ఇందుకు ఉపయోగపడ్డ పాత్రలు, కలుషితమైన పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ ను చీల్చి చెండాడే వాడే అఘోరా పాత్ర. అఖండ అనే పాత్ర తనను కాపాడమనేవారి దగ్గరకు వెంటనే వస్తుంది. అది సినిమాటిక్‌గా చూపించినా లాజిక్‌గా వారికి కొన్ని శక్తులంటాయి. వాటి ప్రభావం వుంటుందనే విషయాన్ని లైట్‌గా టచ్ చేశాడు. ఇక ముగింపు సన్నివేశంలో హింస మామూలుగా వుండదు. అది బాలయ్య ఫ్యాన్సే నచ్చుతుంది.
బాలయ్య ఎలా వుండాలో అలా చూపించాడు. పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మిగిలిన పాత్రలు అంతే శ్రీకాంత్ పాత్ర విలన్‌గా కొత్త ప్రయోగం. సాథువుగా జయగపతిబాబు మెప్పించాడు. ఈ సినిమాకు రీరికార్డింగ్ కీలకం. దాన్ని హైలైట్ చేస్తూ బాగా చేశాడు థమన్. ప్రగ్యా జైశ్వాల్ గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు. ఆమె ప్రతిదానికీ ఆశ్చర్యంతోనో.. భయంతోనో చూస్తూ కనిపించడం తప్ప చేసిందేమీ లేదు. ఈ సినిమాలో దర్శకుడు బిల్డప్ షాట్‌ను యథేచ్చంగా వాడేసుకున్నాడు.
కెమెరామన్ సి.రామ్ ప్రసాద్ గ్రాండ్ విజువల్స్ తో మెప్పించాడు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడా రాజీ పడలేదు. సినిమా అంతటా భారీతనం కనిపిస్తుంది. రత్నం మాటలు మాస్ ను మెప్పించేలా సాగాయి. కేవలం బాలయ్య ఫాన్స్ కోసమే సినిమా తీసినట్లుగా వుంది. ఇది ఏమేరకు ఆదరణ చూపుతుందే ప్రేక్షకులు తీర్పు ఇవ్వాలి.