'ఈడు అంత గోల్డ్ కాదెహే'.. మరోమారు నిరాశపరిచిన సునీల్ (మూవీ రివ్యూ)
సునీల్ హీరో అయ్యాక 'మర్యాద రామన్న'కన్నా విజయం దక్కలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన 'జక్కన్న' డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్లపరంగా నిర్మాతకూ బయ్యర్లకు సేఫ్ అని సునీల్ వెల్లడించారు. అయితే ఇప్పుడు చేసిన 'ఈడ
నటీనటులు:
సునీల్, సుష్మారాజ్, రిచాపనయ్, సునీత్ ఇసార్, సీనియర్ నరేష్, పృథ్వీ, వెన్నెల కిశోర్, పోసాని, అరవింద్ కృష్ణ, జయసుద తదితరులు.
సంగీతం: సాగర్ మహతి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వత్వం: వీరుపోట్ల.
సునీల్ హీరో అయ్యాక 'మర్యాద రామన్న'కన్నా విజయం దక్కలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన 'జక్కన్న' డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్లపరంగా నిర్మాతకూ బయ్యర్లకు సేఫ్ అని సునీల్ వెల్లడించారు. అయితే ఇప్పుడు చేసిన 'ఈడు గోల్డ్ ఎహే' చిత్రం మాత్రం అంతకంటే విజయం సొంతం చేసుకుంటుందని చెప్పాడు. పైగా గతంలో రూమ్‌మేట్ వీరుపోట్ల... దర్శకత్వంలోనే తను నటించడం గొప్పగా చెప్పి సునీల్.. నిజంగానే గోల్డ్ కాదో చూద్దాం.
కథ :
బంగార్రాజు (సునీల్)కు ఎవ్వరూలేకపోయినా ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. తనో అనాథ అయినా కోపం రాదు. అలాంటి బంగార్రాజు ఏ పనిలో చేరినా యజమానికి ఇబ్బందులే. ఓ సందర్భంలో జయసుధను కొందరు కొట్టబోతే బంగార్రాజు ఆమెను కాపాడి.. అమ్మలా సంబోధిస్తాడు. దాంతో చిన్నతనంలో తప్పిపోయిన పెద్దకొడుక్కుగా భావించి చేరదీస్తుంది. జయసుధ చిన్నకొడుకు అరవింద్ కృష్ణ. సూపర్‌బజార్‌ను నడుపుతుంటాడు. అందులోనే పనిచేస్తాడు బంగార్రాజు. అయితే బంగ్రారాజును అక్కడ చూసిన కొంతమంది.. దొంగతనాలు చేసే సునీల్ వర్మ అని అపోహపడి.. కోట్ల విలువజేసే లాఫింగ్ బుద్ధ ఇచ్చేవరకు కిడ్నాప్ చేసిన నీ తమ్ముడిని వదలమని హెచ్చరిస్తారు. దాంతో సునీల్‌వర్మ ఎవరనేది వెతికే ప్రయత్నంలో బంగార్రాజు ఉంటాడు. ఆ తర్వాత సునీల్‌వర్మ తన తమ్ముడే అని తెలిసి ఆశ్చర్యపోతాడు. మాస్క్‌తో తన ఫేస్‌తో ఎందుకి ఇవన్నీ చేస్తున్నాడనేది మిగిలిన కథ.
పెర్‌ఫార్మెన్స్:
సునీల్ ఎప్పట్లానే తన ఎనర్జీతో నటించేశాడు. కామెడీ పంచ్‌లు కూడా బాగానే పేలుస్తూ సునీల్ తన స్థాయికి తగ్గట్టు నటించాడు. హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా పనాయ్ నటనపరంగా ఫర్వాలేదనిపించినా, అందాల ప్రదర్శనతో బాగా మెప్పించారు. షకలక శంకర్ దొంగగా చేసే కామెడీ, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే పృథ్వీ అడల్ట్ కామెడీ, వెన్నెల కిషోర్ టీసీగా చేసే కామెడీ ఇలా ట్రాక్స్‌గా వచ్చే ఈ ఎపిసోడ్స్ అన్నీ బాగానే ఆకట్టుకున్నాయి. ఇక జయసుధ, అరవింద్, నరేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం :
రచయిత దర్శకుడు కావడంతో సంభాషణలపరంగా కామెడీని పండించాడు. కానీ కామెడీ థ్రిల్లర్‌కు సరిపడా మంచి కథను, ట్విస్ట్‌లను పెట్టుకొని వాటితో చేయాల్సిన మ్యాజిక్ చేయలేకపోయాడనే చెప్పాలి. ఆయన రాసిన స్క్రీన్‌ప్లే పకడ్బందీగా లేదు. మొదటి భాగం చూస్తే వీడు వేస్ట్ ఎహే! అనిపిస్తుంది. రెండోభాగం చూస్తేకానీ.. కథేమిటో అర్థంకాదు.. అప్పటికివరకు నరకమే. కొన్నిచోట్ల వీరూ పోట్ల మార్క్ కామెడీ కూడా బాగానే ఆకట్టుకుంది. స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా వేరే స్థాయిలో ఉండేది. సాగర్ మహతి అందించిన పాటల్లో చెప్పుకోదగ్గ పాటలేవీ లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. ఒక్క నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
రొటీన్ కథకు.. మూడు, నాలుగు ట్విస్ట్‌ల చుట్టూ అల్లిన కథే ఈ చిత్రం. కథాగమనంలో ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలు లేవు. నలుగురు కమెడియన్లను పెట్టి సినిమా లాగించేశాడు. కొన్ని ట్విస్ట్‌లు వాటికి ముందు సన్నివేశాలు మినహాయిస్తే మిగతా సినిమా బోరింగ్‌గానే నడిచింది. స్క్రీన్‌ప్లే పట్టులేకపోవడం వల్లే పడుతూ.. లేస్తూ... నత్తనడకగా సాగుతుంది. అసలు సునీల్ హీరోగా మారినప్పట్నుంచీ ఆయన పాత్రలు చూస్తే, అన్నీ ఒకే తరహాలో సాగుతూంటాయి. ఈసారికి ఆ తరహా పాత్ర పూర్తిగా రొటీన్ అయిపోయినట్లే అనిపించింది.
ఇదిలావుంటే అసలు మొదటిభాగం అయ్యేవరకు కథేమిటో అర్థంకాదు. అంతసమయం తీసుకోవడం కూడా వేస్టే. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ పేలవంగా ఉంది. పోసాని కష్ణ మురళితో చేసిన కామెడీ మరీ చెత్తగా ఉంది. విలన్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఇక కథ రీత్యా పుట్టిన కామెడీ కొన్నిచోట్ల నవ్వించింది. ఏది ఏమైనా మంచి కథ ఉండి, అదిరిపోయే ట్విస్ట్‌లు ఉన్నా కూడా వాటన్నింటినీ కలిపే బలమైన స్క్రీన్‌ప్లే లేకుండా వచ్చిన కమర్షియల్ సినిమా. సంభాషణలపరంగా ఏవో నాలుగు నీతి సూక్తులు చెప్పేస్తే గొప్పగా రాసామనుకోవడం భ్రమే. ఇవన్నీ వాట్సప్‌లోనూ వచ్చేస్తున్నాయి. వీరు పోట్లకు ఇంతకాలం గ్యాప్ ఎందుకు వచ్చిందనేది ఈ చిత్రం చూశాక అర్థమవుతుంది.