కొరటాల వినాయక్, దొంగ శ్రీనుల 'సోడ గోలీసోడ'... రివ్యూ రిపోర్ట్
'సోడ గోలీసోడ' నటీనటులు : మానస్, నిత్యా నరేష్, కారుణ్య, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, అలీ, గౌతంరాజు తదితరులు; సంగీతం : భరత్, నిర్మాత : భువనగిరి సత్య సింధూజ, దర్శకత్వం : మల్లూరి హరిబాబు. విడుదల తేదీ :
'సోడ గోలీసోడ' నటీనటులు : మానస్, నిత్యా నరేష్, కారుణ్య, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, అలీ, గౌతంరాజు తదితరులు; సంగీతం : భరత్, నిర్మాత : భువనగిరి సత్య సింధూజ, దర్శకత్వం : మల్లూరి హరిబాబు.
విడుదల తేదీ : 16 ఫిబ్రవరి, 2018
బాలనటుడిగా పలు చిత్రాలు చేసిన మానస్.. కథానాయకుడిగా చేసిన సినిమా 'సోడ గోలీసోడ'. నటుడిగా తనేంటో నిరూపించుకున్నా... కథానాయకుడిగా నిలబడటానికి పలు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసారి మాస్ అంశాన్ని తీసుకుని చేశాడు. డాక్టర్ అయిన భువనగిరి సత్య నిర్మాతగా మారారు. కొత్త దర్శకుడు మల్లూరి హరిబాబు దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారమే విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ :
ఇండస్ట్రీలో పెద్ద దర్శకుడు కావాలని దర్శకుడు కొరటాల వినాయక్ (అలీ) తాపత్రయం. అందుకు జువ్వా ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ని స్థాపించి సినిమా తీయాలని చూస్తాడు. దానికోసం అప్పుల పాలవుతాడు. అయితే అతడి నిరీక్షణ ఫలించి కోటి రూపాయలు పెట్టే నిర్మాత దొరుకుతాడు. కానీ ఆ మొత్తం సరిపోదని ఇంకా ఎవరైనా పార్టనర్‌గా కలిస్తే బాగుంటుందనే వెదుకుతున్న సమయంలో దొంగ శ్రీను(మానస్) వారితో చేతులు కలుపుతాడు. ఊర్లో దొంగతనాలు చేసి దొంగ శ్రీనుగా ముద్రపడిన అతను ఊరి ప్రెసిడెంట్ కూతురు ప్రేమ కోసం తను హీరో అవ్వాలని హైదరాబాద్ వస్తాడు. అయితే తన విషయాన్నీ పక్కనపెట్టి పెద్ద కోటీశ్వరుడినని నమ్మించి సినిమా ప్రారంభం అయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత శ్రీను గురించి తెలుసుకోవడంతో మళ్ళీ సినిమాకు బ్రేక్ పడుతుంది. మరి ఆ సినిమాని కంప్లీట్ చేయడానికి శ్రీను, కొరటాల వినాయక్ ఎలాంటి కష్టాలు పడ్డారు? చివరకు ఆ సినిమా పూర్తయ్యిందా? ఊరిలో తన ప్రేయసి దృష్టిలో హీరో అయ్యాడా? లేదా? అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
కథాపరంగా చాలా సింపుల్ కథ. దాన్ని ప్రెజెంట్ చేసే విధానం కీలకమైంది. కొత్త దర్శకుడు కావడంతో కొంచెం తడబడ్డాడు. నటుడిగా మానస్ శ్రీను పాత్రలో ఒదిగిపోయాడు. డ్యాన్స్, నటనలోనూ మంచి పరిణతి కనబరిచాడు. తను ప్రేమించిన అమ్మాయి అడిగే ప్రశ్నలకు అతను పలికించిన హావభావాలు బాగున్నాయి. ప్రేయసిగా నిత్య నరేష్ ఫర్వాలేదు. ఇక దర్శకుడు కొరటాల వినాయక్ పాత్రలో అలీ కూడా మెప్పించాడు. నిరుద్యోగులను మలేషియా పంపిస్తూ పబ్బం గడుపుకునే బ్రోకర్‌గా బ్రహ్మానందం సరిపోయాడు. ఇంకా చమ్మక్ చంద్ర, జబర్దస్ ఆది, కష్ణభగవాన్, ఫిష్ వెంకట్, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. నవ్వించడానికి ప్రయత్నం చేసారు. కారుణ్య తన పాత్ర మేరకు నటించింది.
ముజీర్ మాలిక్ అందించిన ఛాయాగ్రహణం సినిమాకు మరింత ఆకర్షణగా మారింది. భరత్ అందించిన సంగీతం కూడా ఫరవాలేదు. భువనగిరి సత్య నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇందులో యువతకు చక్కటి సందేశాన్నిస్తూ దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయమే. దాన్ని సినిమాటిక్‌గా చూపించేసి అర్థంతరంగా ముగించేశాడు. చివరల్లో వాయిస్‌వోవర్‌ను ఆర్.పి. పట్నాయక్ ఇచ్చాడు. స్వశక్తితో ఎదగాలని యువతకు సందేశం ఇస్తూ వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. కానీ స్క్రీన్‌ప్లేపరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింతగా బాగుండేది. తొలి ప్రయత్నం అయినా సందేశంతో తీశాడు. ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని చేయాల్సిన అవసరం వుంది.