Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్‌.వి.కృష్ణారెడ్డి ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు ఎలా ఉందంటే.. రివ్యూ

Organic Mama's Hybrid alludu
, శుక్రవారం, 3 మార్చి 2023 (13:52 IST)
Organic Mama's Hybrid alludu
నటీనటులు: సోహెల్, మృణాళిని రవి, రాజేంద్ర ప్రసాద్, మీనా, వరుణ్ సందేశ్, రష్మీ, సునీల్, అలీ, అజయ్ ఘోష్, సప్తగిరి, ప్రవీణ్, పృధ్వి, రాజా రవీంద్ర, కృష్ణ భగవాన్, వైవా హర్ష, హేమ, సన, సురేఖావాణి
 
సాంకేతికత: దర్శకుడు : ఎస్ వి కృష్ణా రెడ్డి, నిర్మాతలు: కోనేరు కల్పన, సంగీత దర్శకులు: ఎస్ వి కృష్ణా రెడ్డి, సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్, ఎడిటర్: ప్రవీణ్ పూడి
 
దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి 2014లో యమలీల2 సినిమా చేశాక మరలా మెగా ఫోన్‌ పట్టి చేసిన సినిమా ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు. ఈసారి బిగ్‌బాస్ ఫేమ్‌ సోహైల్‌ను హీరోగా ఎంచుకున్నాడు. నిర్మాతగా సి.కళ్యాణ్‌ భార్య కల్పన వ్యవహరించారు. మరలా కుటుంబకథా చిత్రాలను తీయడానికే వచ్చానని చెప్పిన కృష్ణారెడ్డి తీసిన సినిమా ఈరోజే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
కొండపల్లి బొమ్మలు తయారుచేసే సూర్య, హేమల కొడుకే విజయ్‌ (సోహైల్‌). తను గొప్ప దర్శకుడు అవ్వాలనుకుంటూ పగటి కలలు కంటుంటాడు. అందుకు తగినట్లుగా రెండు చెత్త సినిమాలు తీశాడనే పేరుకూడా తెచ్చుకుంటాడు. తండ్రి తిట్టులు తట్టుకోలేక తన బుర్ర ఉపయోగించి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో కొండపల్లి బొమ్మలు అమ్మేలా ప్లాన్‌ చేస్తాడు. అక్కడ కోటీశ్వరుడైన ఆర్గానిక్‌ వ్యాపారం చేసే వెంకట రమణ (రాజేంద్రప్రసాద్‌) కూతురు హాసిని (మృణాలిని రవి) పరిచయం కావడం అది పెండ్లివరకు దారితీయడం జరుగుతుంది. అందుకు వెంకట రమణ ససేమిరా అంటాడు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల వల్ల సునీల్‌ అనే నిర్మాత ముందుకు రావడంతో దుందుభి అనే సినిమా తీస్తాడు. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
ఎస్‌.వి. కృష్ణారెడ్డి తనకు తెలిసిన ఫార్మెట్‌లో కథను రాసుకుని తీశాడు. కుటుంబ సంబంధాలు, కష్టాలు, సుఖాలు అన్నీ ఇందులో కనిపిస్తాయి. మధ్యతరగతి అబ్బాయి పెద్దింటి అమ్మాయిని ప్రేమించడమనేది కథ. ఎన్నో సినిమాలు వచ్చినా తనకు తెలిసిన విధంగా తీసి ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగానే టైటిల్‌ పెట్టాడు. అందుకు తగినట్లుగా సన్నివేశాలు రాసుకున్నాడు. ప్రేక్షకుల్ని ఎంట్‌టైన్‌ చేసేవిధంగా లాజిక్‌గా సన్నివేశాలు చూపించాడు. కానీ రెండు సన్నివేశాల్లో అవి శృతిమంచినట్లుగా అనిపిస్తాయి.
 
హీరోపరంగా సోహైల్‌ బాగానే చేశాడు. యాక్షన్‌ చేయగలను అని నిరూపించుకున్నాడు. మృణాళిని ఓకేలా అనిపిసుఏ్తంది. మిగిలిన పాత్రలు పరిధి మేరకు నటించాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా అజయ్‌ ఘోష్‌ అతని అసిస్టెంట్‌గా ప్రవీన్‌ ఎంటర్‌టైన్‌ చేశారు. ఇంటర్‌వెల్‌ ముందు వెంకట రమణ తన కూతురుకోసం తీసుకునే క్లాస్‌ లెంగ్తీగా వుంటుంది. అదే రీతిలో మా అమలాపురం వాళ్ళు అనేది కూడా ఎక్కువసార్లు రావడంతో ఎబ్బెట్టుగా వుంది.
 
ఎంటర్‌టైన్‌ చేసే భాగంలో సెస్సేషనల్‌ కోసం మీడియానూ, ఇప్పటి దర్శకులు నిర్మాతకు కనీసంకథ కూడా చెప్పకుండా మేనేజ్‌ చేసి ఒప్పించడం వంటి వాటిపైనా, అమలాపురం వాల్ళు అతి మంచివాళ్ళు అన్నరీతిలో సెటైర్‌ వేయడం విశేషం.  దర్శకుడుగానే కాకుండా సంగీతం, మాటలు, స్క్రీన్‌ప్లే, పాటలుకూడా రాయడం విశేషం. క్రొంగొత్తగా లేకపోయినా వినడానికి పాటలు బాగానే వున్నాయి. మాటలు కూడా పర్వాలేదు. అయితే 2023లో సినిమాను ఇప్పటి తరం కూడా చూసేలా తీశానని చెబుతున్న దర్శకుడి ప్రతిభ ఈ సినిమాకు వర్తించదు. చాలా సాహసం చేసి తీసిన సినిమా. తనను తాను నిరూపించుకునేందుకు చేసిన సినిమాలా అనిపిస్తుంది. హీరో పాత్రలో దర్శకుడిగా రెండు ప్లాప్‌లు తీసినట్లు, నిర్మాతకు కథకూడా చెప్పకుండా సక్సెస్‌ చేసినట్లు సినిమా తీరును  చూపించాడా! అన్నట్లుగా వుంది.
 
ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లు తీయగలను అన్నట్లుగా.. ఇందులో అజయ్‌ఘోష్‌ పాత్రలో చూపించే ప్రయత్నం చేశాడు. అమెరికాలో వున్న ఆయన కొడుకు కనిపెట్టిన ఓ యాప్‌ వల్ల అజయ్‌ఘోష్‌లోని మూడ్‌నుబట్టి పాట ఆటోమేటిక్‌గా రావడం అనేది కొత్త ప్రక్రియ. ఇంత చెప్పిన దర్శకుడు ఇప్పటి జనరేషన్‌కు తగినట్లుగా కథను ఆవిష్కరించలేకపోయాడు. అందుకేనేమో ఓ సన్నివేశంలో పాత ఫార్మెటే కానీ మావాడు కొత్తగా చెబుతాడంటూ.. పెండ్లి చూపుల సందర్భంగా ఓ డైలాగ్‌ వుంటుంది. దర్శకుడు తన గురించి కూడా ధైర్యంగా చెప్పుకునే పనిచేశాడు. 
 
కథ పాతదే. ఇలాంటివి ఓటీటీకి వర్కవుట్‌ అవుతాయి. పలు సీరియల్స్‌కూడా ఆసక్తికరంగా వస్తున్న తరుణంలో వాటికి తగినట్లుగా ట్విట్ట్‌లు లేకుండా పాతచింతకాయ పచ్చడిలా సినిమా తీశాడు. పాత చింతకాయ ఆరోగ్యానికి పనికివస్తుంది. అటువంటివారు ఈ సినిమాను చూడొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు గుండెపోటు