ఈ నెల 25వ తేదీన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కానుంది. కానీ, యూఎస్‌లో మాత్రం ఒక రోజు ముందుగానే అంటే మార్చి 24వ తేదీనే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. మొత్తం 1150కి పైగా స్క్రీన్‌లలో రిలీజ్ చేస్తున్నారు. ఒక భారతీయ సినిమా ఈ స్థాయి లొకేషన్స్‌లలో రిలీజే చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రుఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే, ఈ నెల 24వ తేదీ నుంచే యూఎస్‌లో ప్రీమియర్ షో మొదలవుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌గా చెప్పుకునే యూకేలోని ఐమాక్స్ తెరపై ఈ సినిమా ప్రీమియర్ షోను వేస్తున్నారు. ఇది ఒక రికార్డుగా భావిస్తున్నారు.
కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించగా, ఆయన మనసు దోచిన సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది. కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలువనుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రను పోషించారు.