రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు.
సాంకేతికతః
సినిమాటోగ్రఫి: సాయి శ్రీ రామ్, సంగీతం: అచ్చురాజమణి, రచనా సహకారం: ఆదినారాయణ, కథ: ఎస్. క్రిష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్, మాటలు: మిర్చికిరణ్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్. క్రిష్ణ, స్క్రీన్ ప్లే, సమర్పణ, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి, దర్శకత్వం: అనీష్.
రొటీన్ కథలకు కాస్త భిన్నంగా వుండేలా కొత్త దర్శకులు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నానికి మరో దర్శకుడు తోడయితే ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. దానితోపాటు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర అంటే మరింత అంచనాలు వుంటాయి. అలా అనిల్‌రావిపూడి పర్యవేక్షణలో తయారైన సినిమానే గాలి సంపత్. శివరాత్రికి విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథః
అది ఆహ్లాదకరమైన అరకు ప్రాంతం. రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు తండ్రీకొడుకులు. గొంతుకు గాయమై తండ్రి అందరిలా మాట్లాడలేడు. `ఫ..ఫి..ఫో..` అనేవే ఆయన మాటలు గాలిరూపంలో వస్తాయి. వాటిని తర్జుమా చేయడానికి పక్కింటి సత్యకు అలవాటైపోతుంది. శ్రీవిష్ణుకు ట్రక్ ఓనర్ అవ్వాలనే కోరిక. అందరికీ తలలో నాలుకలా వుండే శ్రీవిష్ణు బేంక్ మేనేజర్ ను ఎలాగోలా ఒప్పించి రుణం తీసుకుంటాడు. అది కూడా వారంలో ఇచ్చేలా కండిషన్. రాజేంద్రప్రసాద్‌కు నటన అంటే ప్రాణం. వచ్చిన బాషతోనే తన నటనావిశ్వరూపం స్టేజీ పోటీల్లో చూపించి ఫస్ట్‌ప్రైజ్ కొట్టాలని కాంక్ష. ఈక్రమంలో శ్రీవిష్ణు తెచ్చిన 5లక్షలు ఆయన తండ్రి లేపేస్తాడు. ఇదిసరిపోదన్నట్లు తన కొడుకుప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి సంబంధం చెడగొడతాడు. దీంతో విరక్తిచెందిన శ్రీవిష్ణు తన తండ్రిని ఘాటుగా తిట్టి ఆవేశంగా బయటకు వస్తాడు. ఆ తర్వాత రోజు ఇంటికి వచ్చిన శ్రీవిష్ణుకు తండ్రి కనిపించడు. ఇలాంటి వాడు చచ్చినా పర్లేదు అనుకున్న శ్రీవిష్ణుకు తన తండ్రి ఎందుకిలా మారాడు? తన కోసంఎటువంటి త్యాగం చేశాడో తెలుస్తుంది. ఆ తర్వాత శ్రీవిష్ణు ఏంచేశాడు? అసలు కనిపించకుండా పోయిన రాజేంద్రప్రసాద్ ఏమయ్యాడు? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణః
ఇది పూర్తిగా రొటీన్ కథకు భిన్నమైనదే. విడుదలకుముందునుంచి అనిల్‌రావిపూడి, శ్రీవిష్ణు చెప్పినట్లు సరికొత్తగా అనిపిస్తుంది. పాత్రలపరంగా రాజేంద్రప్రసాద్ జీవించాడు. ఈ సినిమాకు ఆయన హైలైట్. రాజ్‌కపూర్ చేసిన మూకాభినయం తరహాలో ఆయన మెప్పించాడు. ఒన్‌మేన్ షో అన్నమాట. పాత్రపరంగా ఆరోగ్యం సరిగ్గాలేని పాత్రకు శ్రీవిష్ణు బాగా సూటయ్యాడు. కొత్తగా చేసిన లవ్‌లీ ఓకే. మిగిలిన పాత్రలనీ పరిధిమేరకు నటించారు.
సాంకేతికంగా చూసుకుంటే సినిమాటోగ్రఫీ ఇలాంటి కథకు కీలకం. ఆది చక్కగా వుంది. సంభాషణలపరంగా `పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా ప్రేమగా కరెక్ట్ చేస్తారు..అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దొళ్లు ఏం చేసినా ఊరికే చిరాకులు వచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపిగ్గా ప్రేమగా అడగాల్సింది సార్ అంటూ సాగే మాటలు, సన్నివేశం బాగున్నాయి. ఇంకోవైపు డబ్బున్న అమ్మాయి, పేదింటి పిల్లోడు మధ్య ప్రేమకథ సాగితే ఆకట్టుకునే సంభాషనలు వుండాలి. అవి ఇందులో చూపించాడు. ప్రతి అమ్మాయికీ డబ్బున్నోడు కావాలి.. లేకపోతే ఫారినోడు కావాలి. డబ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డబ్బే ఇస్తాడు. టైమ్ ఎక్కడి నుంచి ఇస్తాడు? అంటూ శ్రీవిష్ణు చెప్పె డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇందులో రాజేంద్రప్రసాద్ కేవలం ఫిఫీ అనే సౌండ్‌తోనే సంభాషణలు పలకడం విశేషం.
ఇలాంటి కథలో విలన్లు మనుషులుకాదు. ప్రకృతి. అది ఏరూపంలో వారి జీవితాల్లో ఎలా ఆడుకుందో అనేది చక్కగా చూపించాడు. ఈ కథకు అదే మూలం. మరి అదే ప్రకృతివల్ల తన జీవితంలో రాజేంద్రప్రసాద్ ఏం కోల్పోయాడో, మరలా ఏం దక్కించుకున్నాడనేది ఆసక్తికరం. అయితే ఈ కథలో కొన్ని లాజిక్కులు లేకుండా చూపించేశాడు దర్శకుడు. బేంక్ మేనేజర్, ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన అధికారి పాత్రల ద్వారా కామెడీ పండించాలనే ప్రక్రియ కొత్తగా వున్నా బాగా మెప్పించలేకపోయారు. అదేవిధంగా రాజేంద్రప్రసాద్ ఇంటివెనుకే పాతపడిన బావిలో పడిపోయిన విధానం బాగుంది. అందులో నుంచి పైకి వచ్చే క్రమంలో సీరియస్‌వున్నా దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించాడు. మొత్తంగా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన ఈ సినిమాను పిల్లలతో చూడతగ్గ చిత్రంగా చెప్పొకోవచ్చు.