సైకోగా సీనియర్ నరేష్... రేప్ బాధితురాలిగా నిత్యా మీనన్... 'ఘటన' రివ్యూ
'దృశ్యం' సినిమాతో దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న శ్రీప్రియ మరోసారి చేసిన ప్రయత్నమే 'ఘటన'. మలయాళంలో ఆశిక్ అబు దర్శకత్వం వహించిన '22 ఫిమేల్ కొట్టాయం' సినిమా 2012లో విడుదలై కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు దక్కించుకుంది. అందులో నటించిన రిమా కలింగాల్‌కు
'దృశ్యం' సినిమాతో దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న శ్రీప్రియ మరోసారి చేసిన ప్రయత్నమే 'ఘటన'. మలయాళంలో ఆశిక్ అబు దర్శకత్వం వహించిన '22 ఫిమేల్ కొట్టాయం' సినిమా 2012లో విడుదలై కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు దక్కించుకుంది. అందులో నటించిన రిమా కలింగాల్‌కు ఉత్తమ నటి అవార్డు రాగా, ప్రతాప్ పోతన్, ఫాజిల్ పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ఆ చిత్రాన్ని 2014లో 'మాలిని 22 పాలయమ్ కొటై' పేరుతో తమిళంలో శ్రీప్రియ రీమేక్ చేశారు. నిత్యమీనన్, క్రిస్ జె. సత్తార్, సీనియర్ నరేష్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెలుగులో 'ఘటన'గా విడుదలైంది. రాధాకృష్ణ నిర్మాతకాగా, శివకుమార్ విడుదలకు సహకరించారు. ఆడవారి సమస్యలకు ఆడవారే దర్శకులయితే బాగా తీయగలరనే శ్రీప్రియ చెప్పినట్లు.. ఈ సినిమా వుందో లేదో చూద్దాం.
కథ:
మాలిని (నిత్యమీనన్) ఆసుపత్రిలో నర్సు. జబ్బు చేసిందని భార్య పిల్లలు వదిలేసిన ఓ ఆస్తిపరుడికి నర్సుగా ట్రీట్‌మెంట్ చేస్తుంది. కెనడా వెళ్ళాలన్నదే ఆమె డ్రీమ్. వీసా కోసం ఓ సంస్థను సంప్రదిస్తుంది. అందులో పనిచేసే వరుణ్ ప్రేమలో పడిపోతుంది. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ సహజీవనం చేస్తారు. వరుణ్ లేని సమయంలో అతని బాస్ ప్రకాష్(సీనియర్ నరేష్) వచ్చి ఆమెపై అత్యాచారం చేస్తాడు.
ఇది పరువు సమస్య.. వీసాకు ఇబ్బందులు వస్తాయని.. వరుణ్ చెప్పినట్లు వింటుంది. ఆ తర్వాత మరోసారి ప్రకాష్‌కు బలవుతుంది. వెంటనే ఇక్కడ నుంచి మకాం మార్చేయాలని హడావుడిగా వైజాగ్ తీసుకువస్తాడు వరుణ్. అనంతరం ఆమెను డ్రగ్ కేసులో ఇరికించి వదిలించుకుంటాడు. జైలు పాలవుతుంది. అక్కడ పరిచయమైన ఓ మహిళ మాలినికి ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తుంది. బెయిల్‌పై బయటకు వచ్చాక.. వరుణ్, ప్రకాష్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది సినిమా.
విశ్లేషణ :
కథలోని పాయింట్ చాలా పాతది. ప్రతీకార డ్రామా కూడా కొత్తదనం లేదు. నర్సుగా తనేమిటో తెలుసుకోగలిగిన అమ్మాయి.. ప్రేమలో పడితే గుడ్డిగా నమ్మేయడం.... ఆ తర్వాత తనపై జరిగిన అత్యాచారాన్ని స్నేహితులకు కూడా చెప్పకపోవడం ప్రధాన లోపం. సహజీవనం పేరుతో ఎవరినీ నమ్మరాదని ఓ సందేశం ఇందులో ఇమిడి వుంది. మేకవన్నె పులులు వున్న సమాజంలో మహిళ ఎంత జాగరూకతతో మెలగాలో చెప్పిన కథ. సినిమాలో నిత్యమీనన్ నటనే హైలైట్. ఆనందం, సంతోషం, విషాదం, బాధ, వేదన వంటి పాళ్ళను సమపాళ్ళలో పండించింది. అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసే సైకోగా సీనియర్ నరేష్ అమరాడు.
స్వార్థం కోసం బాస్‌కే తన ప్రేయసిని పణంగా పెట్టిన వరుణ్ పాత్రకు సత్తార్ సరిపోయాడు. సమాజంలో నిర్భయ ఘటనలతో పాటు ఎనిమిదేళ్ళ చిన్నారిలను కూడా వదలని మృగాలకు ఇటువంటి తీర్పే ఇవ్వాలని చెప్పిన చిత్రమిది. పరిమితమైన నటీనటుల వల్లకానీ... స్క్రీన్‌ప్లే వల్లకానీ.. డాక్యుమెంటరీని తలపించిన ఈ చిత్రం ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాల్సిందే.