నాని 'నేను లోకల్', రవితేజ 'ఇడియట్' వాసన వస్తోంది... రివ్యూ రిపోర్ట్
నేను లోకల్ విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2017 నటీనటులు : నాని, కీర్తి సురేష్, సచిన్ ఖడేక్కర్, తులసి, పోసాని, రావురమేష్ తదితరులు. సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత: లక్ష్మన్, దిల్‌రాజు, దర్శకత్వం : త్రినాథరావ్ నక్కిన. 'నేను లోకల్' అంటూ నానితో ట
నేను లోకల్ విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2017
నటీనటులు : నాని, కీర్తి సురేష్, సచిన్ ఖడేక్కర్, తులసి, పోసాని, రావురమేష్ తదితరులు. సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత: లక్ష్మన్, దిల్‌రాజు, దర్శకత్వం : త్రినాథరావ్ నక్కిన.
'నేను లోకల్' అంటూ నానితో టైటిల్ పెట్టగానే ఇది పక్కా మాస్ సినిమా అని అర్థమయిపోయింది. మరి మాస్ వారు ఏం కోరుకుంటారో అనేది నిర్మాత దిల్‌రాజుకు తెలుసు కాబట్టి.. అంతకుముందు 'సినిమా చూపిస్త మావ' చిత్రానికి దర్శకత్వం వహించిన త్రినాథ రావు నక్కినతో తీశాడు. ఈమధ్య సక్సెస్ సినిమాలు చేస్తున్న దిల్‌రాజు బేనర్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా వచ్చిందో చూద్దాం.
కథ :
ఓ కాలనీలో పైలాపచ్చీస్‌గా తిరిగే కుర్రాడు బాబు(నాని). చదువుపై పెద్దగా శ్రద్ధ వుండదు. బీటెక్‌ను మార్చిలో పోతే... సెప్టెంబరులో రాస్తూంటాడు. ఎట్టకేలకు కాపీకొట్టి పాసైపోతాడు. నెక్ట్స్ ఏమిటీ? అని అందరూ అడుగుతుంటే.. విసుగుపుట్టి రోడ్డుమీద నిలబడ్డ బాబును కీర్తి(కీర్తిసురేష్) ఎవడినో కొట్టబోయి బాబును లాగి చెంపదెబ్బకొడుతుంది. దాంతో హీరోకదా.. ప్రేమలో పడిపోతాడు. తనకు అలాంటి వుద్దేశంలేదని చెప్పినా... నిన్ను డిస్ట్రబ్ చేస్తానంటూ సవాల్ విసురుతాడు. అలా ఆమె చదివే కాలేజీలో ఎం.బి.ఏ చదువుతూ ఆమెను మానసికంగా హింసిస్తాడు. తండ్రి సచిన్ ఖడేక్కర్ కూతురు కీర్తిని అదుపాజ్ఞనలతో పెంచుతాడు. తను చెప్పినవాడినే చేసుకుంటానని హామీ ఇస్తుంది కూడా. అయితే కీర్తీ జీవితంలో పోలీసాఫీసర్ సిద్దు(నవీన్‌చంద్ర) ప్రవేశిస్తాడు. అతడికే పెళ్ళి నిశ్చయం చేస్తాడు కీర్తి తండ్రి. సరిగ్గా నిశ్చితార్థం రోజునే బాబు ఫ్యామిలీ వచ్చి తామూ నిశ్చితార్థం చేస్తున్నామని వస్తుంది. ఇద్దరిలో ఎవర్ని కీర్తి తన జీవితంలోకి ఆహ్వానించింది? అనేది మిగిలిన సినిమా.
మాస్ సినిమా అంటే.. ఆవారాగాడిలా తిరిగే హీరో.. పెద్దవారికి నీతులు చెబుతూ.. తను చేసిందే కరెక్ట్ అనేలా దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. 'ఇడియట్' ఇలాంటి పాత్రలకు బీజం వేసింది. సరిగ్గా అలాంటి పాత్రనే నాని పోషించాడు. మాటల్లో పంచ్ డైలాగ్‌లు చొప్పించి.. మాస్ చేత చప్పట్లు కొట్టేలా చేసుకున్నారు రచయితలు. అయితే ఎంత మాస్ చిత్రమైనా.. మన కల్చర్ కట్టుబాట్లను ఏవిధంగానూ చులకనగా చూపించకూడదు. కానీ సినిమాల్లో చాలా ఎక్కువగా చూపించి.. యువతను తప్పుదోవ పట్టించే పరిస్థితులను ఇన్‌డైరెక్ట్‌గా కల్పిస్తున్నారు.
పాఠాలు చెప్పే గురువుతో విద్యార్థి చులకనగా మాట్లాడే చిత్రాలు వస్తే.. అప్పట్లో కొన్ని సంఘాలు రాద్దాంతం చేశాయి. అవి ఇంకా నీడలా వెంటాడుతున్నాయి. నాని కాలేజీకి వెళ్ళినప్పుడు పలుసార్లు లెక్చరర్‌తో మాట్లాడిన విధానం.. ఇబ్బంది కల్గించినా... నేల టిక్కెట్ బ్యాచ్ మాత్రం చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం.
ఒకప్పటి కుర్రాళ్ళు ప్రేమ.. ప్రేమ.. అంటూ అమ్మాయిల వెంట పడుతూ.. జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే.. జీవితానికి గోల్ వుండాలని చెప్పే పలు చిత్రాలూ వచ్చాయి. కాలక్రమేణా వారూ అందుకు తగినట్లుగా మారారు. ఇంకా మారని కుర్రాడి కథే నేను లోకల్. ఉద్యోగం లేకుండా తనకిష్టం వచ్చినట్లుంటానని.. రెక్‌లెస్‌గా వుండే మనస్తత్వం గల అబ్బాయిని ఇప్పటి అమ్మాయిలు ప్రేమించరు. కానీ సినిమా కనుక అతడినే ఆమె ప్రేమిస్తుంది. సంప్రదాయంగల కుటుంబంలోంచి వచ్చిన ఆ అమ్మాయి.. తనూ మాస్‌లా మారిపోతుంది.
ఇందుకు కారణం... పెళ్ళి పేరుతో పెద్దలు అంతస్తులు, అర్హత చూస్తారేకానీ.. అమ్మాయి మనస్సు చూడరు. తనను చచ్చేంత ప్రేమించేవాడే కావాలని అమ్మాయి కోరుకోవడం తప్పుకాదు. అలాంటి అర్హత నానికి వుంది. ఈ పాయింట్‌తోనే కథను అల్లి సినిమాగా తీశాడు దర్శకుడు. ఇంతకుముందు 'సినిమా చూపిస్తా మావ'కు తీసిన ఆయన సేమ్ టు సేమ్ అటువంటి పాయింట్‌నే కాస్త అటూ ఇటూ మార్చి.. పాత్రలను మార్చి తీశాడు.
ఇటువంటివి తెరపై కాసేపు మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి సరిపోతాయి. దర్శకనిర్మాతలకు కావాల్సింది అదే కాబట్టి ఇటువంటి సినిమాలు ఇంకా వస్తున్నాయి. మొదటి భాగమంతా హీరో స్నేహితులతో సరదాగా తీసిన దర్శకుడు సెకండాఫ్‌లో వచ్చే పోలీస్ స్టేషన్ సన్నివేశం, నిశ్చితార్థం సీన్ నవ్వించాయి. కీర్తి సురేష్ నటన సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్. అందంగా కనిపిస్తూనే నటనను ప్రదర్శించి సినిమాలో రొమాంటిక్ ఫీల్‌ని ఎక్కడా తగ్గకుండా నిలబెట్టింది. దేవిశ్రీ పాటలు, వాటికి త్రినాథరావు నక్కిన టేకింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరి అందంగా తయారయ్యాయి. కీలకమైన నవీన్ చంద్ర పాత్ర, నాని తండ్రి స్థానంలో పోసాని కృష్ణమురళి నటన, హీరోయిన్ తండ్రిగా సచిన్ ఖేడేకర్ కుదిరారు.
మైనస్ పాయింట్స్ :
పలు చిత్రాల్లోని పాయింట్లను అల్లి తీసిని సినిమా ఇది. ఎక్కడా కొత్తదనం వుండదు. రవితేజను ఇమిటేట్ చేసే పాత్ర.. కథ, కథనాలు తీసుకుని నానికి తొడిగేశారు. ప్రతి సినిమాలోనూ ముగింపు సన్నివేశం వరకు హీరోయిన్ ఎవరినో పెళ్లి చేసుకోవడానికి పీటలపై కూర్చుంటుంది. సరిగ్గా అదే టైంలో హీరో వచ్చి.. పెద్దలందరికీ క్లాస్ పీకుతాడు. నిజమైన ప్రేమ గుండెల్లో ఉండాలంటూ.. అది తానిస్తాననీ.. వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. దాంతో ఒక్కసారిగా హీరోపై సింపతీ పెరుగుతుంది. కథ సుఖాంతం అవుతుంది. ఇంకా ఈ తరహా చిత్రాలు తీస్తూ.. యువతలో లేనిపోని ఆలోచనల్ని క్రియేట్ చేసే విధానమే ఇందులో ప్రధాన లోపం.
ఇంకా నాని పాత్రకు రాసిన పంచ్ డైలాగులు ఆకట్టుకున్నాయి. సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్‌ల స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగానే ఉన్నా సెకండాఫ్‌లో ఊహాజనితంగా ఉండి అంతంగా మెప్పించలేదు. సెకండాఫ్ ముందుగానే ఊహించే విధంగా ఉండటం, కాస్త సాగదీసినట్టుండే ప్రి-క్లైమాక్స్ ఎపిసోడ్ ఇందులో బలహీనతలుగా ఉన్నాయి. మొత్తంగా మాస్‌ను అలరించే సినిమా.