Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇది నిజంగా నేల టిక్కెట్టే... రివ్యూ రిపోర్ట్

మాస్‌ మసాలా సినిమాలకు పెట్టింది పేరు రవితేజ. 'సోగ్గాడే చిన్నినాయనా'.. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలతో మంచి విజయాలందుకున్న కళ్యాణ్‌ కష్ణ. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'నేల టిక్కెట్టు' అప్పటి రోజుల్లో థియేటర్లలో సినిమాను అలా చూసేవాళ్ళం అంటూ ఇద్దరూ చెప

ఇది నిజంగా నేల టిక్కెట్టే... రివ్యూ రిపోర్ట్
, శుక్రవారం, 25 మే 2018 (19:07 IST)
నేల టిక్కెట్టు నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, సంపత్‌ రాజ్‌, ఆలీ, ప్రవీణ్‌, కౌముది, శరత్‌ బాబు, పోసాని కష్ణమురళి, పృథ్వీ, బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు; ఛాయాగ్రహణం: ముకేష్‌, సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌, నిర్మాత: రామ్‌ తాళ్ళూరి, రచన, దర్శకత్వం: కళ్యాణ్‌ కష్ణ కురసాల.
 
మాస్‌ మసాలా సినిమాలకు పెట్టింది పేరు రవితేజ. 'సోగ్గాడే చిన్నినాయనా'.. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలతో మంచి విజయాలందుకున్న కళ్యాణ్‌ కష్ణ. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'నేల టిక్కెట్టు' అప్పటి రోజుల్లో థియేటర్లలో సినిమాను అలా చూసేవాళ్ళం అంటూ ఇద్దరూ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పటి తరానికి నేల టిక్కెట్టు అంటే ఏమిటో పెద్దగా తెలియకపోయినా వారికి తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. దీనిని రామ్‌ తాళ్ళూరి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందకొచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం.
 
కథ :
నేల టిక్కెట్టుగాడని పిలిపించుకునే రవితేజ ఓ అనాధ. ఎదుటివాడిలో బంధాన్ని చూసే గుణం అతనిది. అందుకే జనాలంటే పిచ్చి. చుట్టూ జనం ఉండాలి. మధ్యలో మనం ఉండాలి అనుకునే రకం తనది. దొంగ సాక్ష్యాలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు. అలాంటివాడు వృద్ధుల్ని మోసం చేస్తున్న ఓ సంస్థపై తిరగబడి వారికి న్యాయం చేస్తాడు. అది రాష్ట్ర హోంమంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు)ది. అలా రెండుమూడు సంఘటనలు జరుగుతాయి. ఇదంతా కావాలనే చేస్తున్నట్లు మంత్రికి అర్థమయిపోతుంది. ఇంతకీ అతను హోంమంత్రిని ఎందుకు టార్గెట్‌ చేశాడు. అతడి గతమేంటి.. ఆ పోరాటంలో అతనెలా విజయం సాధించాడు అన్నది మిగతా కథ.
 
విశ్లేషణ:
ఈ కథంతా చూస్తుంటే యాభై ఏళ్ళక్రితం జనరేషన్‌ థియేటర్లో నేల టిక్కెట్టులో చూసిన కథలా అనిపిస్తుంది. అందుకే దర్శకుడు ముందే ఆ టైటిల్‌ పెట్టాడు. కానీ ఇప్పటి జనరేషన్‌కు అవి సరిపడవనే విషయాన్ని మరిచాడు. ఫ్యామిలీ సెంటిమెంట్లు అందరికీ వుంటాయి. చుట్టూ జనాలు బాగుండాలనేది అనాధగా బతికే క్యారెక్టర్‌కు అనిపించవచ్చు. ఎదుటి వ్యక్తిలో బంధాన్ని చూసే గుణం కల్గివుండవచ్చు. ఇవన్నీ బాగానే వున్నా కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పి బతికడంతో ఎదుటి వ్యక్తికి అన్యాయం జరిగిందనే పాయింట్‌ను దర్శకుడు ఎందుకు విస్మరించాడో అర్థంకాదు. సినిమా కథ కాబట్టి సన్నివేశాలపరంగా అనుకూలంగా రాసేసుకున్నాడని మిగిలిన సన్నివేశాలు చెప్పేస్తాయి. వృద్ధులు కుక్కలు కాదు. ఓ అనుభవం. లైట్‌ హౌస్‌లాంటివాళ్లు.. మనకు దిక్చూచి.. వంటి బలమైన సంభాషణలు బాగున్నా.. వాటిని మరోరకంగా హ్యాండిల్‌ చేస్తే సినిమా వేరేవిధంగా వుండేది.
 
ఇప్పటి కొత్తదర్శకులు హీరోలు వినూత్నమైన ఆలోచనలతో లాజిక్కుతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నారు. 'ఘాజీ', 'ఫిదా', 'రంగస్థలం', 'మహానటి' ఏ సినిమా అయితేనేమీ ఒక్కోటి ఒక్కో భిన్నమైన అంశాలు. ప్రేక్షకుల ఊహకు అందని పాయింట్లు. స్క్రీన్‌ప్లే కూడా అంతే ఆకర్షణీయంగా వుంటుంది. కానీ తన మాస్‌ హీరో అనే బ్రాండ్‌ ఇమేజ్‌తో పాతకాలపు కథల్నే ఎంచుకుని తీసిన సినిమానే మరలా తీసి కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్న హీరోని అభినందించాల్సిందే. 
 
దర్శకుడిగా తీసుకుంటే.. 'సోగ్గాడే చిన్నినాయనా'తో హీరో ఆలోచనలు కలగలిపి మంచి సక్సెస్‌ సాధించాడు. ఆ తర్వాత 'రారండోయ్‌ వేడుక చూద్దాం' అనే కాన్సెప్ట్‌ పాతదే అయినా ట్రీట్‌మెంట్‌ కొత్తగా చూపించి సక్సెస్‌ చేశాడు. కానీ 'నేల టిక్కెట్టు' అంటూ ఈ తరానికి తెలియని పాత రోజుల్లోని పదాన్ని టైటిల్‌‌గా పెట్టుకుని ఏదో కొత్తదనం చూపిస్తాడనుకున్న ప్రేక్షకులకి నిరాశే కలుగుతుంది. కొత్తదనం లేకపోతే పోనీ.. కనీసం మాస్‌ ప్రేక్షకుల్ని అలరించే వినోదం కూడా లేకుండా.. చకచకా సినిమాటిక్‌గా సాగిపోయే అరిగిపోయిన కథ.. ఆసక్తి రేకెత్తించని కథనం.. బలహీనమైన.. పేలవమైన పాత్రలు..  లాజిక్‌ లేని అతకని సన్నివేశాలు.. ఇలా అన్ని రకాలుగా 'నేల టిక్కెట్టు' నిజంగా నేల టిక్కెట్టుగానే అనిపిస్తుంది.
webdunia
 
ఇక సినిమాలో ఎవరికే పని కావాలన్నా మన హీరోనే కావాలి. ఇలా అందరి సమస్యలు తీర్చడం తప్ప పనేమీ లేనట్లు 80లు.. 90ల నాటి కథానాయకుడి స్టయిల్లో చెలరేగిపోతుంటాడు హీరో. కట్‌ చేస్తే ముందు లైట్‌‌గా కనిపించి.. ఇంటర్వెల్‌ రాగానే హీరో ఒక ఉద్దేశం ప్రకారమే ఇదంతా చేస్తున్నాడని గత దశాబ్దం కాలంగా మనకు బాగా అలవాటైన 'ట్విస్టు ఒకటిస్తారు. ఇక ద్వితీయార్థంలో ఆటోమేటిగ్గా హీరో ఫ్లాష్‌ బ్యాక్‌ చూస్తాం. వర్తమానంలోకి రాగానే హీరో-విలన్‌ ఎత్తులు పైఎత్తులు వేసుకుని చివరగా కథను క్లైమాక్సుకు తీసుకెళ్లిపోతారు. ఇదీ పరమ రొటీన్‌‌గా సాగిపోయే 'నేల టిక్కెట్టు' వ్యవహారం. ఒక సీన్లో ''కమిషనర్‌ కూతుళ్లకు మొగుళ్లు రారా'' అంటూ 'ఇడియట్‌' డైలాగ్‌ పేలుస్తాడు రవితేజ. ఆ సీన్లో కామెడీ కోసం రవితేజ అండ్‌ కో పడ్డ ప్రయాస చూసి.. 'ఇడియట్‌' రోజులు గుర్తు తెస్తాయి. హీరోయిన్‌ ప్రేమ పొందడానికి డాక్టర్‌గా మారి ఆమె ప్రేమ పొందడం చిత్రంగా అనిపిస్తుంది.
 
రవితేజ కొత్తగా చేసిందేమీ లేదు. అతనేదైనా చేయడానికి ఈ సినిమా ఎంతమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడూ చూసే నటనే.. అదే బాడీ లాంగ్వేజే.. అవే డైలాగులు. అతడి నుంచి మాస్‌ ప్రేక్షకులు ఆశించే వినోదం కూడా కరవైంది ఇందులో. హీరోయిన్‌ మాళవిక శర్మ చూడ్డానికి బాగానే ఉంది కానీ.. పాత్రకు సూటవ్వలేదు. విలన్‌గా జగపతిబాబు పాత్ర గతంలో పోషించిన తరహానే వుంది. వినోదాన్ని పండిచే పాత్రల్లో పృథ్వీ.. జయప్రకాష్‌ రెడ్డి.. ఆలీ.. ప్రవీణ్‌.. ప్రియదర్శి కన్పిస్తారు. విశేషం ఏమంటే.. బ్రహ్మానందం పాత్రను జూనియర్‌ ఆర్టిస్టులా ఒక్క డైలాగ్‌ లేకుండా రెండుమూడు సీన్ల వరకే పరిమితం చేయడం.
 
సాంకేతికపరంగా చెప్పాలంటే... 'ఫిదా'తో సత్తా చాటుకున్న సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌కు ఈసారి తన ప్రతిభ చూపించే అవకాశం లేకపోయింది. ఇలాంటి సినిమాకు అతను సూటవ్వలేదనిపిస్తుంది మ్యూజిక్‌ వింటే. ఐ లవ్యూ... అంటూ సాగే ఒక పాట బాగుంది కానీ.. అది సినిమాలో సెట్టవ్వలేదు. మాస్‌ బీట్స్‌ కోసం అతను చేసిన ప్రయత్నం ఏమాత్రం మెప్పించలేదు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా మామూలే. ముకేష్‌ ఛాయాగ్రహణం ఓకే. సినిమాలో కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఛేజింగ్‌ సీక్వెన్స్‌ బాగా చిత్రీకరించాడు. అదీ నేల టిక్కెట్టు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాయిగా వెళ్లి రావచ్చు 'అమ్మమ్మగారిల్లు'కి... రివ్యూ రిపోర్ట్