Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రమ్య కోసమైతే సరే... కోడి 'నాగభరణం' మరీ ఇంత ఇదిగానా...? రివ్యూ రిపోర్ట్

కోడి రామకృష్ణ చిత్రాలంటే 'ముద్దుల మామయ్య' వంటి చిత్రాలే కాదు 'అమ్మోరు', 'దేవి', 'అంజి', 'అరుంధతి' చిత్రాలను తీసి మెప్పించగలనని నిరూపించుకున్నాడు. కాలక్రమేణా దర్శకత్వానికి దూరమైన ఆయన మూడేళ్ళనాడు ఆరంభించిన కన్నడ చిత్రం 'నాగరహవు'. తెలుగులో 'నాగభరణం' పే

రమ్య కోసమైతే సరే... కోడి 'నాగభరణం' మరీ ఇంత ఇదిగానా...? రివ్యూ రిపోర్ట్
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (18:48 IST)
'నాగభరణం' నటీనటులు : రమ్య, దిగంత్‌, సాయికుమార్‌, ముకుల్‌దేవ్‌, సాధుకోకిల, కీర్తి శేషులు విషువర్ధన్‌ తదితరులు, సంగీతం : గురు కిరణ్‌, కెమెరా: హెచ్‌సి. వేణు, ఎడిటర్‌: జాని హర్ష, నిర్మాతలు: సాజిత్‌ ఖురేషీ, సోహేల్‌ అన్సారి, ధవల్‌ గడ, దర్శకత్వం : కోడి రామకష్ణ.
 
కోడి రామకృష్ణ చిత్రాలంటే 'ముద్దుల మామయ్య' వంటి చిత్రాలే కాదు 'అమ్మోరు', 'దేవి', 'అంజి', 'అరుంధతి' చిత్రాలను తీసి మెప్పించగలనని నిరూపించుకున్నాడు. కాలక్రమేణా దర్శకత్వానికి దూరమైన ఆయన మూడేళ్ళనాడు ఆరంభించిన కన్నడ చిత్రం 'నాగరహవు'. తెలుగులో 'నాగభరణం' పేరు పెట్టారు. గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్‌కు ప్రాధాన్యతనిస్తూ ఆలస్యమైన ఈ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కథ కన్నా... విజువల్‌ ఎఫెక్ట్స్‌లో బాహుబలిని తలపించేలా వుంటుందని దర్శక నిర్మాతలు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. మరి వారన్నట్లుగా వుందా? లేదా? అసలేమిటి అనేది కథలోకి వెళదాం.
 
కథ :
సూర్య గ్రహణం నాడు దేవతల శక్తులు నశించి దుష్టశక్తుల ప్రాబల్యం పెరుగుతుందని గ్రహించిన బ్రహ్మాదిదేవతలు శక్తి కవచాన్ని సృష్టిస్తారు. అది భూలోకంలో ఓ ప్రాంతంలో మంత్రశక్తితో నిక్షిప్తం చేస్తారు. దాన్ని శివయ్య వంశం కాపాడుతుంటుంది. ఆ శక్తి కవచం కాలక్రమేణా మ్యూజియంలో భద్రపర్చబడుతుంది. అయితే.. సంగీత పోటీల్లో విజేతలైన వారికి ఆ కవచాన్ని ప్రభుత్వం బహుమతిగా ప్రకటిస్తుంది. దాన్ని సాధించాలని దిగంత్‌ తన డాన్స్‌ ట్రూప్‌తో ప్రయత్నిస్తాడు. విషయం తెలిసిన ముకుల్‌దేవ్‌ ముఠా దాన్ని కైవసం చేసుకోవాలని దిగంత్‌ను బెదిరిస్తుంది. కానీ మానస (రమ్య) తోడుగా వుంటూ.. దుండగుల ముఠాలో ఒక్కొక్కరిని పాము రూపంలో చంపేస్తుంది. ఇది చూసిన దిగంత్‌ ఆమె గతాన్ని అడుగుతాడు.
 
ఇక.. ఫ్లాష్‌బ్యాక్‌ లోకి వస్తే.. శక్తి కవచాన్ని శివయ్య(సాయి కుమార్‌) వంశం ఏళ్ళుగా కాపాడుతూ ఉంటుంది. అఘోరాలు వచ్చి దాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తే శివయ్య కూతురు నాగమ్మ(రమ్య) శక్తి కవచాన్ని కాపాడే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయి, కవచాన్ని జారవిడుస్తుంది. ఆ తర్వాతి జన్మలో శక్తి కవచాన్ని ఎలాగైనా అదే స్థానంలో ప్రతిష్టింపజేయడానికి నాగమ్మ, మానస(రమ్య)గా పుట్టి శక్తి కవచం కోసం పోరాడుతుంది. ఇంతకీ శక్తి కవచం మహత్యం ఏంటి? చివరకు మానస శక్తి కవచాన్ని దక్కించుకుందా? అన్నదే సినిమా.
 
విశ్లేషణ:
ముందుగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ను ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్‌ పార్ట్‌లో దివంగత కన్నడ సూపర్‌ స్టార్‌ విష్ణువర్ధన్‌ను విజువల్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. ఈ పార్ట్‌లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ బాగానే ఉన్నాయి. ఇక ఎక్కువగా తనపైనే నడిచే సినిమాలో రమ్య నటన చాలా బాగుంది. సాయికుమార్‌ సంస్థానం నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, ఓ యాక్షన్‌ సీన్‌ బాగానే ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను ఉన్నంతలో ప్లస్‌పాయింట్‌గా చెప్పాలి.
 
పురాణాల్లో పుట్టిన కథ.. వర్తమానంలో వచ్చేసరికి ఒక్కసారిగా పడిపోయింది. అద్భుత శక్తులున్నాయని చెప్పే శక్తికవచాన్ని కేవలం.. ఓ డాన్స్‌ ట్రూప్‌కు బహుమతిగా ఇవ్వడమనే కాన్సెప్ట్‌ ఫూలిష్‌గా వుంది. ఫస్టాఫ్‌ అంతా ఎప్పుడు ఏ సన్నివేశం వస్తుందో కూడా తెలియని అయోమయంలో పడేసి విసుగు తెప్పించేలా నడిచింది. ఇక సెకండాఫ్‌లో కథ మొదలయ్యాక అర్థంపర్థంలేని మరో కథ పుట్టుకువస్తుంది. అక్కడక్కడా ఫర్వాలేదనిపించే సన్నివేశాలొచ్చినా విసుగు తెప్పిస్తూనే నడిచింది.
 
ఇక రమ్య పాత్రను పక్కనబెడితే మిగతా ప్రధాన పాత్రలన్నీ ఓవర్‌గానే ఉన్నాయి. విలన్‌ అయిన ముకుల్‌దేవ్‌ పాత్ర పేలవంగా వుంది. అసలు శక్తికవచం అనే కాన్సెప్ట్‌ ఎన్‌టిఆర్‌ నటించిన 'శక్తి'లో చూసిందే. ఇదే అంశంతో వచ్చి కొత్త విషయమేదీ చెప్పకపోగా చాలా చోట్ల బోర్‌ కొట్టించింది. డాన్స్‌ ట్రూప్‌ పేరుతో పాడే పాటలు ఎందుకు వస్తాయో అర్థం కానంత విచిత్రంగా ఉన్నాయి.  
 
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌దే బలమైన పాత్ర. ఇంటర్వెల్‌ అప్పుడు ఒక పెద్ద పామును వీఎఫ్‌ఎక్స్‌లో సృష్టించిన విధానం, క్లైమాక్స్‌లో చనిపోయిన ఒక సూపర్‌ స్టార్‌ను విజువల్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా ఆవిష్కరించడం లాంటివి టెక్నికల్‌గా సినిమాకు ఒక స్థాయికి తెచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఏమాత్రం బాగోలేదు. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి.
 
దర్శక, రచయిత కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని తీశాడా అనే సందేహం చూసేవాడికి కలుగుతుంది. ఏదో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో మ్యాజిక్‌ చేయాలన్న ఆలోచన తప్పితే ఒక బలమైన కథ లేకపోవడం శోచనీయం. ఈ సినిమాలో అసలు ఎమోషన్‌ అన్నదే లేదు. ఇటు రైటింగ్‌ పరంగా, అటు దర్శకుడిగా రామకృష్ణ ఫెయిలయ్యారనే చెప్పుకోవాలి.
 
'రోబో' తరహాలో ఒకరిపై ఒకరు నుంచొని వుండేట్లుగా అఘోరాలు పుట్టుకొచ్చి ఎటాక్‌ చేయడం, 'బాహుబలి'లోని కాలకేయ తరహాలో గెటప్‌లు వచ్చి సాహస సింహా దివంగత విష్ణువర్ధన్‌పై పోరాటం వంటి సన్నివేశాలు కన్నడిగులకు ఆకట్టుకోవచ్చునేమో కానీ.. తెలుగులో ఏమంత ఇంట్రెస్ట్‌గా లేవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల 'ఇజం'కు యు/ఏ.. 21న రిలీజ్