తెలుగులో మోహన్ లాల్ హ్యాట్రిక్ 'మన్యం పులి'... రివ్యూ రిపోర్ట్
మన్యం పులి నటీనటులు: మోహన్‌లాల్, కమలిని ముఖర్జీ, జగపతిబాబు, బాల, లాల్, వినుమోహన్ తదితరులు; సాంకేతిక విభాగం: సినిమాటోగ్రఫీ: షాజి కుమార్, దర్శకత్వం: వైశాఖ్, నిర్మాత: టోమిచన్ ముల్కుపుడమ్, రచన: ఉదయ్‌క్రిష్ణ, సంగీతం: గోపీ సుందర్.
మన్యం పులి నటీనటులు: మోహన్‌లాల్, కమలిని ముఖర్జీ, జగపతిబాబు, బాల, లాల్, వినుమోహన్ తదితరులు; సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ: షాజి కుమార్, దర్శకత్వం: వైశాఖ్, నిర్మాత: టోమిచన్ ముల్కుపుడమ్, రచన: ఉదయ్‌క్రిష్ణ, సంగీతం: గోపీ సుందర్.
మలయాళ నటుడు మోహన్‌లాల్ హీరోగా నటించిన 'పులి మురుగన్' సినిమా ఇది. 2015లో సినిమా ఆరంభించి ఏడాది పాటు చిత్రీకరణ తర్వాత ఈ ఏడాది అక్టోబర్ విడుదలైంది. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొంది 125 కోట్లు వసూలు చేసిందని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలాంటి సినిమాను తెలుగులో మోహన్‌లాల్‌కున్న క్రేజ్ మేరకు 'మన్యం పులి'గా అనువదించారు. ఈ శుక్రవారమే విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
కథ :
అటవీ ప్రాంతంలోని ఓ పల్లెటూరిలో కుమార్(మోహన్‌లాల్) తల్లిదండ్రులతో నివశిస్తుంటాడు. ఆ ఊరి చుట్టుపక్కల అడవుల్లో పులి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటుంది. చిన్నతనంలో కుమార్ నాన్ననూ చంపుతుంది. ఆ తర్వాత తల్లి మరణిస్తూ తమ్ముడ్ని కుమార్‌కు అప్పగిస్తుంది. ఆ తర్వాత తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఊరిలోనే వుంటూ తనకు తెలిసిన మెళకువులతో పులుల్ని వేటాడుతుంటాడు. సొంత లారీ ద్వారా అడవిలో దుంగలను ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ జీవిస్తాడు. ఆ ఊరికి చెందిన మైనా(కమలినీ ముఖర్జీ)ని పెండ్లి చేసుకుంటాడు. సోదరుడ్ని పెద్ద చదువులు చదివిస్తాడు.
తమ్ముడు స్నేహితుడొకడు కుమార్‌ని ఆశ్రయించి అడవిలో గంజాయిని రవాణా చేసేలా ప్లాన్ చేస్తాడు. ఇలా చేస్తే సోదరుడికి మంచి ఉద్యోగం కూడా వస్తుందని చెబుతాడు. గంజాయి ద్వారా కేన్సర్ మందు కనిపెడుతున్నట్లు నమ్మబలుకుతాడు. ఓ సంఘటనతో కుటుంబంతో సహా గంజాయి లోడున్న లారీతో సిటీలోని పెద్ద రౌడీ డాడీ గిరిజ(జగపతిబాబు) వద్దకు వస్తాడు. ఫలితంగా కుమార్ తమ్ముడికి డాడీ గిరిజ పెద్ద వుద్యోగం ఇస్తాడు. ఆ తర్వాత పోలీసులు కుమార్ సోదరుడ్ని కిడ్నాప్ చేస్తారు. అతడిని విడిపించుకునేందుకు వచ్చిన కుమార్‌కు డాడీ గిరిజ గురించి పూర్తిగా తెలుస్తుంది. ప్లాన్ ప్రకారం అతడ్ని పోలీసులకు పట్టించే క్రమంలో సీన్ తారుమారవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ తన ఊరికెళ్ళాడా? లేదా అనేది సినిమా.
విశ్లేషణ:
అడవిలో మనుషుల్ని తినే పులితో పాటు బయట నమ్మించి మోసం చేసే పులులు చాలా వున్నాయి. అవి అసలు పులులకంటే ప్రమాదం. వాటిని కుమార్ వంటి వ్యక్తి ఏం చేశాడనేది చిత్ర కథ. ఆద్యంతం అటవీ అందాలు, వాతావరణం, మనుషులు, వారి అలవాట్లు ఆహ్లాదకరంగా సాగుతాయి. వాటిని సినిమాటోగ్రఫీతో చక్కగా బంధించాడు షాజి కుమార్. దర్శకుడు తను చెప్పాల్సిన పాయింట్‌ను మసాలా వేసి చెప్పినట్లు.. యాక్షన్ ఎండ్వచర్‌తో చెప్పాడు. అది చూసే ప్రేక్షకుడికి థ్రిల్ కల్గిస్తుంది.
55 ఏళ్ళ పైబడిన మోహన్‌లాల్ చేసిన యాక్షన్ సన్నివేశాలు థ్రిల్ కల్గిస్తాయి. ఇలాంటి పోరాటాలు పీటర్‌హేన్స్ నేతృత్వంలో కనువిందు చేశాడనే చెప్పాలి. లోగడ కొన్ని చిత్రాల్లో హేన్స్ చేసిన ఫైటింగ్స్‌కూ ఈ చిత్రంలోని ఫైటింగ్స్ చాలా తేడా వుంది. అడవి మృగాల్ని ఎలా వేటాడాలో.. వాటిని వేటాడే మన్యంపులిని ఎలా వేటాడాలో విదేశీ ఫైటర్ల చేత చేయించిన విధానం అద్భుతంగా వుంది. చిన్నతనంలో కుమార్ పాత్ర పులితో చేసిన ఫైట్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.
కమిలినీ ముఖర్జీ.. మన్యం యువతిగా అమరింది. మిగిలిన పాత్రల్లో అంతా జీవించారనే చెప్పాలి. డ్రగ్ మాఫియా డాన్‌గా జగపతిబాబు సరిపోయాడు. పతాక సన్నివేశాలో మోహన్‌లాల్, జగపతిబాబుల ఫైట్ అలరిస్తుంది. ఇలా ఎక్కువ భాగం యాక్షన్‌తో కొత్త కొత్త ఫైట్స్‌తో ప్రేక్షకుల్ని మైమరిపించాడు. అందుకే పెద్దగా పాటలు లేకపోయినా.. కథంతా మన్యంలో జరిగినా.. బోర్ లేకుండా చూపించాడు.
సంగీతపరంగా గోపీసుందర్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ సంగీతం చిత్రానికి ప్లస్ అయింది. పులిరా పులిరా.. మన్యం పులిరా.. అంటూ సాగే బ్యాక్‌డ్రాప్ సాంగ్ సందర్భానుసారంగా వుంది. కుమార్ పులితో పోరాడే సన్నివేశాలు చాలా సహజంగా వున్నాయి. పులి కూడా ట్రైనీ పులి కావడంతో రియలిస్టిక్‌గా ప్రేక్షకుడు ఫీలయి చూశాడు. దీనికంతటి కారకుడైన దర్శకుడు వైశాఖ్ అభినందనీయుడు.
అయితే రూరల్ ప్రాంతానికి చెందిన కథ కాబట్టి ఇది మాస్‌ను బాగా ఆకట్టుకుంటుంది. సామాన్య ప్రేక్షకుడు థ్రిల్‌కు గురవుతాడు. కానీ అందరూ చూసేంతలా కమర్షియల్ అంశాలు లేకపోవడం తెలుగు ప్రేక్షకులకు లోపమనే చెప్పాలి. ఓ మూసకు అలవాటు పడిన ప్రేక్షకులు అందులోని బయటకువచ్చి చూస్తే ఈ చిత్రం థ్రిల్ కల్గిస్తుంది.
ఇప్పటికే జనతా గ్యారేజ్, మనమంతా చిత్రాల్లో అలరించిన మోహన్‌లాల్‌కూ ఈ చిత్రంలోని కుమార్ పాత్రకూ చాలా వ్యత్యాసం వుంది. 55 ఏళ్లు పైబడినా తను చేసిన యాక్షన్ సీన్స్, హుషారు ఆకర్షిస్తాయి. పాత్ర మేరకే నటించి హీరోయిజం వంటివి చూపించకుండా చేసిన దర్శకుడు అభినందనీయుడు.