"కణం" మూవీ రివ్యూ .. ఫీచర్ ఫిల్మ్‌కు ఎక్కువ.. షార్ట్ ఫిల్మ్‌కు తక్కువ...
'ఫిదా' చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. అలాగే, మంచి హిట్ కోసం ఆరాటపడుతున్న యువహీరో నాగశౌర్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే "కణం". ఎమోషనల్ హారర్ ఎలిమెంట్స్‌తో తె
బ్యానర్స్ : లైకా ప్రొడక్షన్స్, ఎన్.వి.ఆర్. సినిమాస్
నటీనటులు : నాగశౌర్య, సాయిపల్లవి, వెరోనికా, ప్రియదర్శి, సంతాన భారతి, రేఖ, నిరగల్ రవి తదితరులు
సంగీతం : శ్యామ్ సి.ఎస్
నిర్మాత: ఆలీరాజా సుభాష్ కరణ్
దర్శకత్వం: ఎ.ఎల్.విజయ్
'ఫిదా' చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. అలాగే, మంచి హిట్ కోసం ఆరాటపడుతున్న యువహీరో నాగశౌర్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే "కణం". ఎమోషనల్ హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్ర. తమిళంలో "దియా" అనే పేరుతో ఈ సినిమా రూపొందింది. భ్రూణ హత్యలు అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు విజయ్ తెరకెక్కించారు. ప్రతి యేడాది దేశంలో ఎన్నో భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. వాటి వల్ల మనం ఒక ఇందిరా గాంధీ, కల్పనా చావ్లా వంటి గొప్పవారిని కొల్పోయే అవకాశం ఉంది. కాబట్టి భ్రూణ హత్యలు జరగకుండా చూసుకోవాలనే ఇతివృత్తాన్ని నేపథ్యాన్ని తీసుకుని చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర కథ ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.
కథ :
కృష్ణ (నాగశౌర్య), తులసి (సాయిపల్లవి)లకు 19 యేళ్ల వయసులో తొందరపడి శారీరకంగా కలుసుకుంటారు. ఫలితంగా తులసి గర్భందాల్చుతుంది. కానీ ఆ వయసులో ఇద్దరికీ పెళ్లి చేయడం ఎందుకని ఇరు కుంటుబాలకు చెందిన పెద్దలు ఆలోచించి.. ఐదేళ్ల తర్వాత ఇద్దరికీ పెళ్లి చేద్దామని అనుకొని తులసికి అబార్షన్ చేయిస్తారు. ఐదేళ్ల తర్వాత కృష్ణ, తులసి పెళ్లి చేసుకుంటారు. కృష్ణ సివిల్ ఇంజనీర్‌గా, తులసి డాక్టరుగా స్థిరపడతారు. అయితే తనకు అబార్షన్ జరిగి ఐదేళ్లు గడిచినా దాన్ని మాత్రం తులసి మరిచిపోలేదు. అయితే, అబార్షన్ చేసి వెలికితీసిన పిండానికి దియా అని పేరు పెట్టుకుంటుంది.
పైగా, పొద్దస్తమానం దాన్ని గురించే ఆలోచన చేస్తుంటుంది. ఈ క్రమంలో దియా ఆత్మ పెరిగి పెద్దదవుతుంది. పెద్దదైన ఈ ఆత్మకు కోపం, కసి పెరిగి తనను పిండం దశలోనే చంపిన వారిని అందరినీ వరుసబెట్టి చంపేస్తుంది. కృష్ణ తండ్రి, తులసి తల్లి, మేనమామ, అబార్షన్ చేసిన డాక్టర్‌ను ప్రమాదం సృష్టించి చంపేస్తుంది. ఆ విషయాన్ని తులసి ఓ దశలో పసి గట్టేస్తుంది. నెక్ట్స్ దియా చంపబోయేది తన భర్త కృష్ణనే అని తెలుసుకుని భయపడుతుంది. దియా నుంచి కృష్ణను తులసి ఎలా బ్రతికించుకుంటుంది? దియాకు తన నాన్నపై ఉన్న కోపం తగ్గుతుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష :
సినిమాలో దర్శకుడు మెయిన్ పాయింట్ భ్రూణ హత్యలు అనే అంశాన్ని సినిమాటిక్‌గా చెప్పాలనుకోవడం బాగానే ఉంది. అయితే ఆ పాయింట్‌ను తెరకెక్కించిన విధానంలో స్పష్టమైన లోపం కనిపిస్తోంది. సాయిపల్లవి, నాగశౌర్య, వెరోనికా సహా మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు అనుగుణంగా నటించారు. ముఖ్యంగా చివరి 10 నిమిషాలు సాయిపల్లవి ఎమోషనల్‌గా నటించి మరోమారు మంచి మార్కులు కొట్టేసింది.
భ్రూణ హత్యలు చేయడం ముమ్మాటికీ తప్పే. అయితే ఆ పాయింట్‌ను చెప్పడానికి ఓ హారర్ ఎలిమెంట్‌ను క్రియేట్ చేసి వరుస హత్యలతో సినిమాను నడిపించడం బాలేదు. కథనంపరంగా చెప్పుకునేంతగా ఏమీ కనపడదు. బలమైన ఎమోషన్స్ లేవు. భ్రూణ హత్యల్లో పగ, ప్రతీకారం తీర్చుకునేంత కాన్సెప్ట్‌ను ఎందుకు తీయాలనుకున్నాడో దర్శకుడు విజయ్‌కే తెలియాలి.
19 యేళ్ల అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేయాలని ఏ తల్లితండ్రులు కోరుకోరు. వారు జీవితంలో స్థిరపడిన తర్వాత అంటే ఐదేళ్ల సమయం తర్వాత ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. అనుకున్నట్లే వారికి పెళ్లి చేసి సంతోషంగా ఉంచుతారు. అలాంటి వారిని దియా ఎందుకు చంపాలి. చిన్న పాపకు ఆమె తల్లి ఎంత ముఖ్యమో.. ఓ బాధ్యత గల తల్లిదండ్రులకు వారి పిల్లల భవిష్యత్ కూడా ముఖ్యమే కదా! ఆ కోణంలో దర్శకుడు ఆలోచించలేదు. పైగా, హారర్ ఎలిమెంట్స్ కూడా భయపెట్టేంత లేవు. శామ్ సి.ఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. నీరవ్ షా సన్నివేశాలను చక్కగా పిక్చరైజ్ చేశారు. సినిమా నిడివి చాలా తక్కువగా ఉండటం మరో ప్లస్‌గా చెప్పుకోవచ్చు.